APSCHE
-
సెప్టెంబర్ 19న ఏపీ ఈసెట్ పరీక్ష
సాక్షి, అమరావతి: 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే ఏపీ ఈసెట్ (ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ అండ్ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్) పరీక్ష సెప్టెంబర్19న నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఆగష్టు 12 వరకు దరఖాస్తుల స్వీకరించేందుకు గడువు విధించింది. అలాగే వెయ్యి రూపాయల ఫైన్‌తో ఆగస్టు 23 వరకు అవకాశం కల్పించింది. ఏపీ ఈసెట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున అనంతపురంలోని జేఎన్టీయూ నిర్వహించనుంది. ఇందులో అర్హత సాధించిన వారికి బీటెక్/బీఈ, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాది(లేటరల్ ఎంట్రీ)లో ప్రవేశం లభిస్తుంది. ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని వీసీ రంగజనార్ధన్ తెలిపారు. -
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఎక్కడైనా, ఎప్పుడైనా చదువుకోవచ్చు
సాక్షి, అమరావతి: తరచూ తలెత్తుతున్న కోవిడ్ విపత్కర పరిస్థితులు విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ విధానాలపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీ ఎస్సీహెచ్ఈ) దృష్టి సారిస్తోంది. విద్యార్థుల చదువులు ఏ సమయంలో ఎక్కడైనా.. ఎప్పుడైనా నిరాటంకంగా, సాఫీగా సాగించేందుకు వీలుగా వీటికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా అత్యంత పటిష్టమైన అభ్యసన నిర్వహణ వ్యవస్థ, సుదూర అభ్యసన కేంద్రాలు (లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, రిమోట్ లెర్నింగ్ సెంటర్లు)ఏర్పాటు చేయాలని తలపోస్తోంది. వీటి ఏర్పాటు వల్ల విద్యార్థులు గ్రామస్థాయిలో కూడా తమంతట తాము ఎప్పుడైనా అభ్యసనాన్ని కొనసాగించేందుకు ఆస్కారం కలుగుతుంది. అభ్యసన నిర్వహణ వ్యవస్థ ఇలా.. కోవిడ్ నేపథ్యంలో విద్యాభ్యసనానికి ఏర్పడిన తీవ్ర అవాంతరాలను అధిగమించడానికి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఏపీ ఎస్సీహెచ్ఈ రూపొందిస్తోంది. తరగతి గదిలో అభ్యసనానికి ప్రత్యామ్నాయంగా బ్లెండెడ్ మోడ్ విధానంలో ఫ్లిప్ప్‌డ్ క్లాస్ రూమ్ ద్వారా అభ్యసన ప్రక్రియలను అమలు చేయనున్నారు. విద్యార్థులు ఆన్లైన్, డిజిటల్ కంటెంట్ల ఆధారంగా ఇంటివద్దే స్వయంగా అభ్యసన సాగిస్తూ తరగతి గదుల్లోని అధ్యాపకులు, సహ విద్యార్థులతో కలసి చర్చాగోష్టి, ప్రాజెక్టు వర్కులు వంటివి నిర్వహించుకునేలా ఈ విధానం ఉంటుంది. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో విద్యార్థులకు అవసరమైన ప్రోగ్రామ్స్, కోర్సులు, కంటెంట్లను అందుబాటులో ఉంచుతారు. యూజీ నాన్ ప్రొఫెషనల్, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కాలేజీల విద్యార్థుల అభ్యసన అవసరాలను ఉన్నత విద్యామండలి ఈ–ఎల్ఎంఎస్ ప్లాట్‌ఫామ్ ద్వారా తీర్చనుంది. ప్రైవేటు కాలేజీలు కూడా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలను ఈ ప్లాట్‌ఫామ్ వేదికగా కొనసాగించుకునేలా చేయనున్నారు. వివిధ సబ్జెక్టు నిపుణుల వీడియో లెక్చర్ల ద్వారా విద్యార్థులకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందిస్తారు. సెల్ఫ్ ఫేస్డ్ కోర్సులు, షెడ్యూల్డ్ కోర్సులు కూడా ఈ ఎల్ఎంఎస్ ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఈ కోర్సులలో విద్యార్థులు సాధించిన క్రెడిట్ల బదలాయింపునకు కూడా అవకాశం కల్పిస్తారు. సుదూర అభ్యసన సెంటర్ల ఏర్పాటు ఇలా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అభ్యసన ప్రక్రియలకు ఆటంకం లేకుండా చేసే విధానాన్ని క్షేత్రస్థాయి వరకు అందుబాటులోకి తెచ్చేందుకు సుదూర అభ్యసన (రిమోట్ లెర్నింగ్) సెంటర్ల ఏర్పాటుకు ఉన్నత విద్యామండలి సంకల్పిస్తోంది. అన్ని మండలాల్లో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నత విద్యను ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా కొనసాగించేందుకు విద్యార్థులకు అవకాశం కలుగుతుంది. అనియత విధానంలో సాగే పద్ధతి వల్ల ఉన్నత విద్యాకోర్సుల జీవితకాల అభ్యసనానికి ఇది ఉపకరిస్తుంది. డిజిటల్ లెర్నింగ్, లెర్నింగ్ మేనేజ్మెంటు సిస్టమ్ విద్యార్థులకు ఓపెన్ విధానంలో అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త ప్రక్రియల ద్వారా తరగతి గది అభ్యసనం, ఈ–లెర్నింగ్ రెండింటి అనుసంధానంతో బ్లెండెడ్ మోడ్ విధానంలో ఉన్నత విద్యాకోర్సులు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రానున్నాయి. -
'ప్రభుత్వ విద్యా సంస్థలను మరింత బలోపేతం చేయాలి'
సాక్షి, గుంటూరు : జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం గుంటూరులో నిర్వహించిన కార్పొరేట్ విద్య ప్రక్షాళన సదస్సుకు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం ర్యాంకుల కోసమే ఇప్పటి పేరెంట్స్ కార్పొరేట్ విద్యపై దృష్టి పెడుతున్నారని, ఇది మంచి నిర్ణయం కాదని పేర్కొన్నారు. ఏపీలో ఈ ఏడాది ఏడు లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వారిలో కేవలం 1.2 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్నారని, మిగతా 5.8లక్షల మంది ప్రైవేటు సంస్థల్లోనే తమ చదువును కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తును కార్పొరేట్ సంస్థల చేతిలో పెట్టవద్దని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని హేమచంద్రారెడ్డి వెల్లడించారు. -
ఏపీ ఉన్నత విద్యామండలి పిటిషన్ విచారణ వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు విచారించింది. ఎస్బీహెచ్ ఖాతాలను నిలిపివేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. ఖాతాల నిర్వహణపై ఏపీకి ఎలాంటి హక్కూ లేదని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు. -
ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి(ఏపీఎస్సీహెచ్ఈ) చైర్మన్‌గా ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన గతంలో ఆంధ్ర(ఏయూ), ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ)లకు వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు పదవీకాలం మంగళవారంతో ముగియడంతో వేణుగోపాల్ రెడ్డిని నియమించారు. అయితే, ప్రొ. జయప్రకాశ్‌రావునే కొనసాగిస్తారని, అందుకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా సుముఖంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అలా కాని పక్షంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన రెండు యూనివర్శిటీల ఉపకులపతుల్లో ఒకరిని నియమించవచ్చనే వాదన కూడా వినిపించింది. అయితే అనూహ్యంగా సీఎం జిల్లా చిత్తూరుకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి తెరపైకి వచ్చారు. మంగళవారం రాత్రి జీవో వచ్చే వరకూ ఈ పేరు బయటకు పొక్కకుండా సీఎం కార్యాలయ వర్గాలు జాగ్రత్తపడ్డాయి. విభజన నేపథ్యంలో ఈ నియామకం వివాదాస్పదమవుతుందని భావించిన ముఖ్యమంత్రి.. రాత్రి 7.30కు తన క్యాంపు కార్యాలయానికి ఉన్నత విద్యాశాఖ అధికారులను పిలిపించుకుని ఏపీఎస్సీహెచ్ఈ చైర్మన్‌గా వేణుగోపాల్‌రెడ్డిని నియమిస్తున్నట్టు తె లిపారు. కాగా ఇప్పటివరకు చైర్మన్‌గా ఉన్న జయప్రకాశ్‌రావు 2004లో ఉన్నత విద్యామండలి ైవె స్ఛైర్మన్గా నియమితులైయ్యారు. 2007లో ఆయన్ను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 2010 అక్టోబరు 29న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఫీజుల నిర్ధారణ అంశంలో అత్యంత కష్టకాలాన్ని ఎదుర్కొన్న మండలికి సారథ్యం వహించి విద్యారంగ మన్ననలు పొందారు. వేణుగోపాల్‌రెడ్డి నేపథ్యం ఇదీ..: ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డిది చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం కామిరెడ్డివారిపల్లి గ్రామం. ఆయన మొదట ఎస్కేయూ మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2002 నుంచి 2005 వరకు ఏఎన్‌యూ వైస్ చాన్స్‌లర్‌గా, 2005 మే నుంచి 2008 మే వరకు ఏయూ వీసీగా పనిచేశారు. యూజీసీ తరఫున పలు తనిఖీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. ' వైస్ చైర్మన్లు, కార్యదర్శి నియామకానికి ఆమోదముద్ర: ఉన్నత విద్యామండలిలో 2010 నుంచి ఖాళీగా ఉన్న రెండు వైస్ చైర్మన్ పోస్టుల నియామకం ఫైలుపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. దీనికి సంబంధించి బుధవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అలాగే మూడేళ్లుగా కార్యదర్శి పోస్టులో ఇన్చార్జ్ కొనసాగుతున్నారు. కార్యదర్శి పోస్టు భర్తీకి కూడా సీఎం ఆమోద ముద్ర వేశారని, బుధవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఉన్నత విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. కార్యదర్శిగా అంబేద్కర్ వర్శిటీలో అధ్యాపకుడిగా ఉన్న ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి నియమితులు కానున్నట్టు సమాచారం.