ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఉద్యమ సెగ | eamcet counselling stopped due to unite andhra movement | Sakshi
Sakshi News home page

ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఉద్యమ సెగ

Published Tue, Aug 20 2013 12:53 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

eamcet counselling stopped due to unite andhra movement

 కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: వ్యయప్రయాసలకోర్చి ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. ఆర్టీసీ బస్సులు తిరగకపోయినా ప్రైవేట్ వాహనాల్లో, మోటార్‌బైక్‌లపై సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది సోమవారం కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఉదయం 9 గంటల సమయానికి జి.పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి చేరుకున్న విద్యార్థులకు అధికారులు చేదునిజాన్ని వెల్లడించారు. కౌన్సెలింగ్ సిబ్బంది సమ్మె నోటీస్ ఇచ్చారని, కౌన్సెలింగ్ నిర్వహించలేమంటూ వారు చేతులెత్తేశారు. దీంతో విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం రాయలసీమ యూనివర్సిటీకి బయలుదేరారు. అక్కడ పోలీస్‌బందోబస్తు మధ్య అధికారులు కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. ఒకటి నుంచి కాకుండా వారికి కేటాయించిన 7,501 ర్యాంకు నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విధానాన్ని ప్రశ్నించారు.
 
  ఒకటి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించాలని కోరారు. వీరికి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జె.లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్, కార్యదర్శి సుధాకర్ తదితరులు మద్దతు పలికారు. దీంతో కేంద్రం వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులకు సర్దిచెప్పారు. ఈలోపు కేంద్రాన్ని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కృష్ణానాయక్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ అక్కడికి చేరుకున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ఏర్పాట్లను కన్వీనర్ ప్రొఫెసర్ సంజీవరావును అడిగి తెలుసుకున్నారు. పాలిటెక్నిక్ కళాశాల కేంద్రం పనిచేయకపోవడంతో అక్కడి విద్యార్థులు సైతం ఇక్కడికే వస్తున్నారని వివరించారు. ఈ కారణంగా ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల కేంద్రాన్ని సైతం యూనివర్సిటీలోనే ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన సిబ్బందిని ఇందిరాక్రాంతి పథం, సోషల్ వెల్ఫేర్ విభాగాల నుంచి సమకూరుస్తామని కలెక్టర్ చెప్పారు. దీంతో పాలిటెక్నిక్ కళాశాల నుంచి వర్సిటీలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు ఇందిరాక్రాంతి పథం, సోషల్ వెల్ఫేర్ సిబ్బందికి శిక్షణనిచ్చారు. సమైక్యాంద్ర ఆందోళనలతో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
 
 కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు
 సమైక్యాంధ్ర  కోసం ఉద్యమాలు జరుగుతుంటే ఇక్కడ ఎంసెట్ కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తారంటూ రాయలసీమ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు ప్రశ్నించారు. ఈ మేరకు కౌన్సెలింగ్ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకుని వెనక్కు పంపారు. దీంతో వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులకు, సమైక్యవాదులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీమాంధ్రలో అన్ని చోట్లా కౌన్సెలింగ్ వాయిదా పడితే ఇక్కడ మాత్రం ఎలా నిర్వహిస్తారని ఆందోళనకారులు ప్రశ్నించారు. వెంటనే కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని కోరారు. ఆ తర్వాత కొద్దిసేపటికి వీసీ ప్రొఫెసర్ కృష్ణానాయక్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలాఉండగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోతుంటే రాజకీయ నాయకులు తమ వ్యాపారాలను నిరాటంకంగా సాగిస్తున్నారని.. ఇదేమి న్యాయమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఉద్యమాల కారణంగా ఇరు ప్రాంతాల్లో విద్యార్థులే బలిపశువులుగా మారుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో వ్యయప్రయాలకోర్చి ఇక్కడకు వస్తే కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం సరికాదన్నారు. బీసీ, ఎస్సీ,ఎస్టీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విధులను బహిష్కరించని ఉద్యమకారులు ఈ రోజు ప్రారంభమైన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని కోరారు.
 
 నంద్యాలలోనూ నిలిపివేత
 నంద్యాల రూరల్: సమైక్య నిరసనలతో పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలోనూ సోమవారం నిర్వహించాల్సిన ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. స్థానిక కళాశాలలో ఉదయం 9 గంటలకు ఒకటి నుండి 15వేల ర్యాంకులు పొందిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక ఈఎస్‌సీ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల లెక్చరర్లు కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందే కేంద్రం వద్దకు చేరుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా నినదించారు. ఏజేసీ రామస్వామి, ఆర్డీఓ నరసింహులు.. ప్రిన్సిపాల్ రామసుబ్బారెడ్డితో సమావేశమై వారితో చర్చించినా ఫలితం లేకపోయింది. కౌన్సెలింగ్ ప్రక్రియ ఆన్‌లైన్ కావడంతో తేడాలు వస్తే మొదటి మోసం వస్తుందని భావించిన అధికారులు వాయిదా వేస్తూ ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement