EAMCET -2013
-
ఫార్మసీ సీట్ల కేటాయింపు, 9,106 సీట్లు భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2013 బైపీసీ విభాగం అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జాబితా సోమవారం రాత్రి విడుదలైంది. సీట్ల వివరాలను అభ్యర్థులకు ఎస్ఎంఎస్ల ద్వారా చేరవేశారు. ఎంసెట్ బైపీసీ విభాగంలో 85,741 మంది అర్హత సాధించగా.. వారిలో ఫార్మసీ కోర్సుల కోసం 14,724 మంది ధ్రువపత్రాల పరిశీలనలో పాల్గొన్నారు. అందులో 13,696 మంది వెబ్ఆప్షన్లు నమోదు చేశారు. రాష్ట్రంలో 9,401 ఫార్మసీ సీట్లు ఉండగా.. 9,106 సీట్లు భర్తీ అయ్యాయి. బీఫార్మసీలో 8,506 సీట్లకుగాను 8,326 సీట్లు.. ఫార్మా-డిలో 741 సీట్లు, బయోటెక్నాలజీలో 154 సీట్లకు గాను 39 నిండాయి. సీటు పొందిన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు కట్టాల్సి ఉంటే చలానా ద్వారా బ్యాంకులో చెల్లించాలి. ఆ రశీదులతో 27లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. 29 నుంచి తుది కౌన్సెలింగ్: ఎంసెట్ బైపీసీ విభాగం అభ్యర్థులు ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 29, 30 తేదీల్లో తుది విడత వెబ్ కౌన్సెలింగ్ ఉంటుందని అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు. వచ్చే నెల ఒకటిన సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రకటనను ఈ నెల 25న వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. ఎంపీసీ విభాగంలో మిగిలిపోయే సీట్లను తుది విడత బైపీసీ స్ట్రీమ్ అభ్యర్థులకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. -
ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు ఎదురుచూపు
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులు కళాశాలల ఎంపికకు ఉద్దేశించిన వెబ్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 19న ప్రారంభమైన ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన మొదలై ఎనిమిది రోజులు పూర్తయినప్పటికీ వెబ్ కౌన్సెలింగ్ ఊసేలేకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. సోమవారానికి 1,40,000 ర్యాంకు వరకూ గల విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. ఈ నెల 22న ప్రారంభ కావాల్సిన వెబ్ కౌన్సెలింగ్‌ను ఉన్నత విద్యాశాఖ వాయిదా వేసి, నూతన షెడ్యూల్ జారీ చేస్తామని ప్రకటించిందే తప్ప ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా మారిన పక్షంలో అసలు జరుగుతుందో లేదోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 30తో సర్టిఫికెట్ల పరిశీలన ముగియనుంది. స్థానిక సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు 463మంది విద్యార్థులు హాజరయ్యారు. కళాశాల హెల్ప్‌లైన్ కేంద్రం సమన్వయకర్త సీహెల్ పుల్లారెడ్డి పర్యవేక్షణలో అధ్యాపకులు సర్టిఫికెట్లను పరిశీలించారు. నేడు ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన.. ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు 1,40,001 నుంచి 1,60,000 ర్యాంకు వరకూ గల విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 1,40,001 నుంచి 1,45,000, 1,55,001 నుంచి 1,60,000 ర్యాంకు వరకూ గల విద్యార్థులు హాజరుకావాలి. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 1,45,001 నుంచి 1,55,000 ర్యాంకు వరకూ గల విద్యార్థులు హాజరుకావాలి. సర్టిఫికెట్ల పరిశీలనకు 465 మంది హాజరు ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: వర్సిటీ ఆన్లైన్ కౌన్సెలింగ్ కేంద్రంలో సోమవారం జరిగిన ఎంసెట్ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు 465మంది హాజరయ్యారని కౌన్సెలింగ్ కేంద్రం అధికారి డాక్టర్ సింహాచలం తెలిపారు. గుంటూరులోని గుజ్జనగుండ్ల పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు కేటాయించిన ర్యాంకులకు ఏఎన్‌యూ కేంద్రంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. -
వెబ్ అప్షన్ల నమోదు తాత్కాలిక వాయిదా
రెండు, మూడు రోజుల్లో రీషెడ్యూల్: ఉన్నత విద్యామండలి సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నేడు (గురువారం) ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మాత్రం యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గురు, శుక్రవారాల్లో 1 నుంచి 40 వేల ర్యాంకు వరకు గల అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ నెల 19న ప్రారంభమైన సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియలో 40 వేల ర్యాంకులోపు గల అభ్యర్థులు అందరూ హాజరు కాలేదు. సీమాంధ్ర ప్రాంతంలో 37 హెల్ప్‌లైన్ సెంటర్లకుగాను 17 మాత్రమే నడవడంతో పలువురు అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందుతారన్న కారణంగా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేశామని, రెండు, మూడు రోజుల్లో రీషెడ్యూల్‌ను ప్రకటిస్తామని అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ తెలిపారు. బుధవారం రాత్రి 7 గంటల వరకూ మొత్తం 15 వేల మందికిగాను 9,432 మంది అభ్యర్థులు మాత్రమే సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియకు హాజరయ్యారు. సీమాంధ్రలో 17 సహాయక కేంద్రాలే పనిచేశాయని, వీటిలో 4,216 మంది హాజరయ్యారని రఘునాథ్ తెలిపారు. తెలంగాణలోని 22 కేంద్రాల్లో 5,216 మంది హాజరైనట్టు తెలిపారు. తొలి రెండు రోజులతో పోల్చితే మూడో రోజు సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియకు హాజరు పెరిగిందని వివరించారు. హైదరాబాద్‌లో కొత్తగా 4 కేంద్రాలు.. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల తనిఖీకి హాజరుకాలేకపోయిన అభ్యర్థుల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నాలుగు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు అడ్మిషన్ల క్యాంపు అధికారి వెల్లడించారు. నిజాం కళాశాల, సైఫాబాద్ డిగ్రీ కళాశాల, సికింద్రాబాద్‌లోని ఓయూ పీజీ కళాశాల, దోమలగూడలోని ఏవీ కళాశాలలో ఈ కేంద్రాలను ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్టు తెలిపారు. మూడో రోజు సర్టిఫికెట్ల తనిఖీకి సీమాంధ్ర జిల్లాల నుంచి తెలంగాణ ప్రాంతంలోని సహాయక కేంద్రాలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు తెలిపారు. ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదులో పాల్గొన్నాకే.. సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. సీమాంధ్ర ప్రాంతంలో అధ్యాపకులు ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సహకరించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. -
సాగని కౌన్సెలింగ్
నూనెపల్లె, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఆందోళనల కారణంగా ఎంసెట్ రెండో రోజు కౌన్సెలింగ్ కూడా నిలిచిపోయింది. మొదటి రోజు కౌన్సెలింగ్ కేంద్రానికి పడిన తాళం రెండోరోజు కూడా తెరుచుకోలేదు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నామని, సమైక్యాంధ్ర ఉద్యమకారులకు తాము కూడా మద్దతు ఇస్తున్నామని నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక జేఏసీ నాయకులు తెలిపారు. ఈ కారణంగా కౌన్సెలింగ్ విధులకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకులు విధులను బహిష్కరించి రెండో రోజు కౌన్సెలింగ్‌లో పాల్గొనకుండా ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ రామసబ్బారెడ్డి, అధ్యాపకులు సుబ్బరాయుడు, శ్రీనివాసరెడ్డి, రమణమూర్తి, ఉమామహేశ్వరప్ప, మంజునాథ్, సురేష్‌బాబు, రామసుబ్బారెడ్డి, కృష్ణమూర్తి, మురళీకృష్ణ, వీరభద్రారెడ్డి, రఘునాథ్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది మొత్తం ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు మణిశేఖర్‌రెడ్డి, జలాలుద్దీన్ ఖాద్రీ, బోయ శ్రీనివాసులు, సాయిబాబా తదితరులు కౌన్సెలింగ్ కేంద్రం వద్దకు వ చ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యమాన్ని నీరు గార్చేలా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న జేఏసీ నాయకులతో టూటౌన్ సీఐ రామాంజి నాయక్ చర్చలు జరిపారు. శాంతియుతంగా ఆందోళన కొనసాగించాలని కోరారు. అయితే కౌన్సెలింగ్ సాగకపోవడంతో ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కేంద్రం వద్ద కాసేపు ఎదురుచూసి ఇంటిముఖం పట్టారు -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఉద్యమ సెగ
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: వ్యయప్రయాసలకోర్చి ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. ఆర్టీసీ బస్సులు తిరగకపోయినా ప్రైవేట్ వాహనాల్లో, మోటార్‌బైక్‌లపై సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది సోమవారం కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఉదయం 9 గంటల సమయానికి జి.పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి చేరుకున్న విద్యార్థులకు అధికారులు చేదునిజాన్ని వెల్లడించారు. కౌన్సెలింగ్ సిబ్బంది సమ్మె నోటీస్ ఇచ్చారని, కౌన్సెలింగ్ నిర్వహించలేమంటూ వారు చేతులెత్తేశారు. దీంతో విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం రాయలసీమ యూనివర్సిటీకి బయలుదేరారు. అక్కడ పోలీస్‌బందోబస్తు మధ్య అధికారులు కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. ఒకటి నుంచి కాకుండా వారికి కేటాయించిన 7,501 ర్యాంకు నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విధానాన్ని ప్రశ్నించారు. ఒకటి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించాలని కోరారు. వీరికి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జె.లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్, కార్యదర్శి సుధాకర్ తదితరులు మద్దతు పలికారు. దీంతో కేంద్రం వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులకు సర్దిచెప్పారు. ఈలోపు కేంద్రాన్ని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కృష్ణానాయక్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ అక్కడికి చేరుకున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ఏర్పాట్లను కన్వీనర్ ప్రొఫెసర్ సంజీవరావును అడిగి తెలుసుకున్నారు. పాలిటెక్నిక్ కళాశాల కేంద్రం పనిచేయకపోవడంతో అక్కడి విద్యార్థులు సైతం ఇక్కడికే వస్తున్నారని వివరించారు. ఈ కారణంగా ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల కేంద్రాన్ని సైతం యూనివర్సిటీలోనే ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన సిబ్బందిని ఇందిరాక్రాంతి పథం, సోషల్ వెల్ఫేర్ విభాగాల నుంచి సమకూరుస్తామని కలెక్టర్ చెప్పారు. దీంతో పాలిటెక్నిక్ కళాశాల నుంచి వర్సిటీలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు ఇందిరాక్రాంతి పథం, సోషల్ వెల్ఫేర్ సిబ్బందికి శిక్షణనిచ్చారు. సమైక్యాంద్ర ఆందోళనలతో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు జరుగుతుంటే ఇక్కడ ఎంసెట్ కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తారంటూ రాయలసీమ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు ప్రశ్నించారు. ఈ మేరకు కౌన్సెలింగ్ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకుని వెనక్కు పంపారు. దీంతో వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులకు, సమైక్యవాదులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీమాంధ్రలో అన్ని చోట్లా కౌన్సెలింగ్ వాయిదా పడితే ఇక్కడ మాత్రం ఎలా నిర్వహిస్తారని ఆందోళనకారులు ప్రశ్నించారు. వెంటనే కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని కోరారు. ఆ తర్వాత కొద్దిసేపటికి వీసీ ప్రొఫెసర్ కృష్ణానాయక్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలాఉండగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోతుంటే రాజకీయ నాయకులు తమ వ్యాపారాలను నిరాటంకంగా సాగిస్తున్నారని.. ఇదేమి న్యాయమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఉద్యమాల కారణంగా ఇరు ప్రాంతాల్లో విద్యార్థులే బలిపశువులుగా మారుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో వ్యయప్రయాలకోర్చి ఇక్కడకు వస్తే కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం సరికాదన్నారు. బీసీ, ఎస్సీ,ఎస్టీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విధులను బహిష్కరించని ఉద్యమకారులు ఈ రోజు ప్రారంభమైన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని కోరారు. నంద్యాలలోనూ నిలిపివేత నంద్యాల రూరల్: సమైక్య నిరసనలతో పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలోనూ సోమవారం నిర్వహించాల్సిన ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. స్థానిక కళాశాలలో ఉదయం 9 గంటలకు ఒకటి నుండి 15వేల ర్యాంకులు పొందిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల లెక్చరర్లు కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందే కేంద్రం వద్దకు చేరుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా నినదించారు. ఏజేసీ రామస్వామి, ఆర్డీఓ నరసింహులు.. ప్రిన్సిపాల్ రామసుబ్బారెడ్డితో సమావేశమై వారితో చర్చించినా ఫలితం లేకపోయింది. కౌన్సెలింగ్ ప్రక్రియ ఆన్లైన్ కావడంతో తేడాలు వస్తే మొదటి మోసం వస్తుందని భావించిన అధికారులు వాయిదా వేస్తూ ప్రకటించారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు శ్రీకారం
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : ఎంసెట్(ఇంజినీరింగ్)-2013 కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ఆరంభం కానుంది. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రోజూ 15 వేల ర్యాంకుల చొప్పున విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాలలో ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 810 సీట్లు ఉన్నాయి. ఈ నెల 19 నుంచి 30వ తేదీ వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో బ్రాంచీల పేర్లను వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 5న సీట్లు ఖరారు చేస్తారు. అదే నెల 6, 7, 8, 9 తేదీల్లో సీటు వచ్చిన కళాశాలలో చేరడానికి తుది గడువు విధించారు. 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం అవుతాయి. కౌన్సెలింగ్ జరిగే తీరు.. ఎంసెట్-2013లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్లిన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు తొలుత పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ దగ్గరలోని ఏ హెల్ప్‌లైన్ కేంద్రంలోనైనా నిర్వహిం చుకోవడానికి ఈసారి అవకాశం కల్పించారు. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు తప్పనిసరిగా అసలు ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్-కౌన్సెలింగ్ ఫీజు చెల్లించి రశీదు తీసుకోవాలి. ఆప్షన్ల నమోదు.. సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం ర్యాంకుల ప్రకారం ఆగస్టు 22 నుంచి ఆప్షన్ల నమోదు జరుగుతుంది. ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ముందుగా మాన్యువల్ ఆప్షన్ ఫారంలో ప్రాధాన్యత క్రమంగా బ్రాంచ్, జిల్లా, కాలేజ్ కోడ్లను రాసుకొని ఆప్షన్లు ఇచ్చుకోవడం మంచి పద్ధతి. ఆప్షన్ల సంఖ్య క్రమంలో ఆయా కళాశాలలు, కోర్సుల్లో ఖాళీలు లోకల్ ఏరియా, కులం,ర్యాంకు, ఆడ, మగ అంశాలపై సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఎంచుకున్న కళాశాలలో చేరడానికి వీలైనంత మేరకు ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం మంచిది. ఒక్కో విద్యార్థి సుమారు 500 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆప్షన్ల ఎంట్రీ తేదీలు సర్టిఫికేట్ల పరిశీలనంతరం ఆప్షన్ల ఎంట్రీ ప్రారంభమవుతుంది. ఈ నెల 22, 23 తేదీల్లో 1 నుంచి 40,000 ర్యాంకు పొందిన విద్యార్థులు ఆప్షన్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవల్సి ఉంటుంది. 24, 25 తేదీల్లో 40,001 నుంచి 80,000 ర్యాంకు వరకు, 26, 27 తేదీలలో 80,001 నుంచి 1,20,000 ర్యాంకు వరకు, 28, 29 తేదీల్లో 1,20,001 నుంచి 1,60,000 ర్యాంకు వరకు, 30, 31 తేదీలలో 1,60,001 నుంచి 2,00,000ల ర్యాంకు వరకు, ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో 2,00,001 నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫీజు చెల్లింపు సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత కళాశాలలో చేరడానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించడానికి చలాన్‌ను ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ చలాన్ ద్వారా ఆంధ్రాబ్యాంకు లేదా ఇండియన్ బ్యాంకు ఏ శాఖలోనైనా ఫీజును చెల్లించి రశీదు పొందాలి. నిర్ధేశించిన గడువు లోపల ఫీజు చెల్లించాలి. సీటు అలాట్మెంట్ ఆర్డర్, ఫీజు రషీదు చూపించి కళాశాలలో చేరాలి. సకాలంలో చేరకపోతే సీటు రద్దు అవుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థులు సీటు అలాట్మెంట్ ఆర్డర్‌తో కళాశాలలో చేరవచ్చు. సర్టిఫికేట్ల పరిశీలన తేదీలు.. ర్యాంకులవారీగా.. ఈ నెల 19వ తేదీన 1 నుంచి 15 వేల ర్యాంకు వరకు 20న 15,001 నుంచి 30,000 ర్యాంకు వరకు 21న 30,001 నుంచి 45,000 ర్యాంకు వరకు 22న 45,001 నుంచి 60,000 ర్యాంకు వరకు 23న 60,001 నుంచి 80,000 ర్యాంకు వరకు 24న 80,001 నుంచి 1,00,000 ర్యాంకు వరకు 25న 1,00,001 నుంచి 1,20,000 ర్యాంకు వరకు 26న 1,20,001 నుంచి 1,40,000 ర్యాంకు వరకు 27న 1,40,001 నుంచి 1,60,000 ర్యాంకు వరకు 28న 1,60,001 నుంచి 1,80,000 ర్యాంకు వరకు 29న 1,80,001 నుంచి 2,00,000 ర్యాంకు వరకు 30న 2,00,001 నుంచి చివరి ర్యాంకు వరకు.. -
ఎంసెట్-2013 కౌన్సెలింగ్ జరిగేనా?
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌కు ముహూర్తం నిర్ణయించినా సమైక్యాంధ్ర ఉద్యమంతో కౌన్సెలింగ్ నిర్వహణపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నెల 19 నుంచి 30 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించిన విషయం తెలి సిందే. ఇంతకుముందు జూన్ 20 నుంచి దీన్ని నిర్వహిం చాలనుకున్నా సాధ్యం కాలేదు. బీ కేటగిరీ సీట్ల భర్తీ అం శం కోర్టులో ఉన్నందున సాధ్యం కాలేదు. కోర్టు ఆదేశం మేరకు కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించినా ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం.. దానికి తోడు కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన పాలిటెక్నిక్ అధ్యాపకులు సమ్మె నోటీసు ఇవ్వడం, కౌన్సెలింగ్‌కు సహాయ నిరాకరణ చేస్తామని రెవెన్యూ ఉద్యోగులు ప్రకటించడంతో కౌన్సెలింగ్ జరగడం అనుమానమేన న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఈ ఏడాది 4,513 మంది ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష రాశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కళాశాలల ఎంపిక విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని కళాశాలలను ఎంపిక చేసుకోవాలా వద్దా అన్న డైలమాలో పడ్డారు. మరో పక్క జిల్లా అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు శ్రీకాకుళం పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలోనే హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. ప్రైవేట్ వాహనాలు అంతంతమాత్రంగానే తిరుగుతున్నాయి. జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ రాస్తారోకోలు జరుగుతూ వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇచ్ఛాపురం, పలాస, సోంపేట, పాలకొండ, టెక్కలి తదితర ప్రాంతాల విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ఒకే ఒక్క హెల్ప్‌లైన్ కేంద్రానికి రావడం కష్టసాధ్యమే. ఈనెల 19 నుంచి 30 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు షెడ్యూల్ ప్రకటించారు. 22 నుంచి ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. 22, 23 తేదీల్లో 1 నుంచి 40 వేల ర్యాంకు వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఈ రెండు రోజుల్లో ఆప్షన్లు నమోదు చేయకపోతే, ఆ తర్వాత సర్వర్లు వివరాలు తీసుకోవు. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే సాంకేతిక విద్యాశాఖ స్పందించి సర్వర్లను పెంచాలి. విద్యార్థులు సకాలంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన హాజరుకాలేకపోతే మరో అవకాశం ఇవ్వాలి, ఆప్షన్ల నమోదుకు కూడా అదనపు సమయం కావాలి. ఈ వెసులుబాటు ఇవ్వకపోతే విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతుంది. విద్యార్థుల ఇబ్బందులు గుర్తించాలి కౌన్సెలింగ్ కేంద్రానికి విద్యార్థి సజావుగా చేరుకునే అవకాశం ఉండాలి. అంటే తప్పని సరిగా బస్సులు తిరగాలి. లేదంటే దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు హెల్ప్‌లైన్ సెంటర్‌కు చేరటం కష్టం. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. -డాక్టర్ జి.రాజేంద్రకుమార్, ఉపాధి అధికారి, శ్రీశివానీ కళాశాల కౌన్సెలింగ్‌కు మిస్ అయితే సీటు కోల్పోయినట్లే ప్రతి విద్యార్థి కౌన్సెలింగ్‌కు చేరే అవకాశం ఉండాలి. లేదంటే సీటును కోల్పోవలసి వస్తుంది. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థి ధ్రువీక రన పత్రాల పరిశీలన తరువాత ఆప్షన్లు ఇచ్చుకునే పరిస్థితి ఉండాలి. లేదంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. -దుర్గాప్రసాద్‌రాజు, యాజమాన్య సభ్యుడు, శ్రీశివానీ కళాశాల