బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : ఎంసెట్(ఇంజినీరింగ్)-2013 కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ఆరంభం కానుంది. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రోజూ 15 వేల ర్యాంకుల చొప్పున విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాలలో ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 810 సీట్లు ఉన్నాయి. ఈ నెల 19 నుంచి 30వ తేదీ వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో బ్రాంచీల పేర్లను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 5న సీట్లు ఖరారు చేస్తారు. అదే నెల 6, 7, 8, 9 తేదీల్లో సీటు వచ్చిన కళాశాలలో చేరడానికి తుది గడువు విధించారు. 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం అవుతాయి.
కౌన్సెలింగ్ జరిగే తీరు..
ఎంసెట్-2013లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్లిన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు తొలుత పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ దగ్గరలోని ఏ హెల్ప్‌లైన్ కేంద్రంలోనైనా నిర్వహిం చుకోవడానికి ఈసారి అవకాశం కల్పించారు. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు తప్పనిసరిగా అసలు ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్-కౌన్సెలింగ్ ఫీజు చెల్లించి రశీదు తీసుకోవాలి.
ఆప్షన్ల నమోదు..
సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం ర్యాంకుల ప్రకారం ఆగస్టు 22 నుంచి ఆప్షన్ల నమోదు జరుగుతుంది. ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ముందుగా మాన్యువల్ ఆప్షన్ ఫారంలో ప్రాధాన్యత క్రమంగా బ్రాంచ్, జిల్లా, కాలేజ్ కోడ్‌లను రాసుకొని ఆప్షన్లు ఇచ్చుకోవడం మంచి పద్ధతి. ఆప్షన్ల సంఖ్య క్రమంలో ఆయా కళాశాలలు, కోర్సుల్లో ఖాళీలు లోకల్ ఏరియా, కులం,ర్యాంకు, ఆడ, మగ అంశాలపై సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఎంచుకున్న కళాశాలలో చేరడానికి వీలైనంత మేరకు ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం మంచిది. ఒక్కో విద్యార్థి సుమారు 500 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
ఆప్షన్ల ఎంట్రీ తేదీలు
సర్టిఫికేట్ల పరిశీలనంతరం ఆప్షన్ల ఎంట్రీ ప్రారంభమవుతుంది. ఈ నెల 22, 23 తేదీల్లో 1 నుంచి 40,000 ర్యాంకు పొందిన విద్యార్థులు ఆప్షన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవల్సి ఉంటుంది. 24, 25 తేదీల్లో 40,001 నుంచి 80,000 ర్యాంకు వరకు, 26, 27 తేదీలలో 80,001 నుంచి 1,20,000 ర్యాంకు వరకు, 28, 29 తేదీల్లో 1,20,001 నుంచి 1,60,000 ర్యాంకు వరకు, 30, 31 తేదీలలో 1,60,001 నుంచి 2,00,000ల ర్యాంకు వరకు, ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో 2,00,001 నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఫీజు చెల్లింపు
సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత కళాశాలలో చేరడానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించడానికి చలాన్‌ను ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ చలాన్ ద్వారా ఆంధ్రాబ్యాంకు లేదా ఇండియన్ బ్యాంకు ఏ శాఖలోనైనా ఫీజును చెల్లించి రశీదు పొందాలి. నిర్ధేశించిన గడువు లోపల ఫీజు చెల్లించాలి. సీటు అలాట్‌మెంట్ ఆర్డర్, ఫీజు రషీదు చూపించి కళాశాలలో చేరాలి. సకాలంలో చేరకపోతే సీటు రద్దు అవుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థులు సీటు అలాట్‌మెంట్ ఆర్డర్‌తో కళాశాలలో చేరవచ్చు.
సర్టిఫికేట్ల పరిశీలన తేదీలు.. ర్యాంకులవారీగా..
ఈ నెల 19వ తేదీన 1 నుంచి 15 వేల ర్యాంకు వరకు
20న 15,001 నుంచి 30,000 ర్యాంకు వరకు
21న 30,001 నుంచి 45,000 ర్యాంకు వరకు
22న 45,001 నుంచి 60,000 ర్యాంకు వరకు
23న 60,001 నుంచి 80,000 ర్యాంకు వరకు
24న 80,001 నుంచి 1,00,000 ర్యాంకు వరకు
25న 1,00,001 నుంచి 1,20,000 ర్యాంకు వరకు
26న 1,20,001 నుంచి 1,40,000 ర్యాంకు వరకు
27న 1,40,001 నుంచి 1,60,000 ర్యాంకు వరకు
28న 1,60,001 నుంచి 1,80,000 ర్యాంకు వరకు
29న 1,80,001 నుంచి 2,00,000 ర్యాంకు వరకు
30న 2,00,001 నుంచి చివరి ర్యాంకు వరకు..
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు శ్రీకారం
Published Mon, Aug 19 2013 4:43 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement