ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు ఎదురుచూపు
Published Tue, Aug 27 2013 3:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులు కళాశాలల ఎంపికకు ఉద్దేశించిన వెబ్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 19న ప్రారంభమైన ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన మొదలై ఎనిమిది రోజులు పూర్తయినప్పటికీ వెబ్ కౌన్సెలింగ్ ఊసేలేకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. సోమవారానికి 1,40,000 ర్యాంకు వరకూ గల విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది.
ఈ నెల 22న ప్రారంభ కావాల్సిన వెబ్ కౌన్సెలింగ్‌ను ఉన్నత విద్యాశాఖ వాయిదా వేసి, నూతన షెడ్యూల్ జారీ చేస్తామని ప్రకటించిందే తప్ప ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా మారిన పక్షంలో అసలు జరుగుతుందో లేదోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 30తో సర్టిఫికెట్ల పరిశీలన ముగియనుంది. స్థానిక సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు 463మంది విద్యార్థులు హాజరయ్యారు. కళాశాల హెల్ప్‌లైన్ కేంద్రం సమన్వయకర్త సీహెల్ పుల్లారెడ్డి పర్యవేక్షణలో అధ్యాపకులు సర్టిఫికెట్లను పరిశీలించారు.
నేడు ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన..
ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు 1,40,001 నుంచి 1,60,000 ర్యాంకు వరకూ గల విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 1,40,001 నుంచి 1,45,000, 1,55,001 నుంచి 1,60,000 ర్యాంకు వరకూ గల విద్యార్థులు హాజరుకావాలి. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 1,45,001 నుంచి 1,55,000 ర్యాంకు వరకూ గల విద్యార్థులు హాజరుకావాలి.
సర్టిఫికెట్ల పరిశీలనకు 465 మంది హాజరు
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: వర్సిటీ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కేంద్రంలో సోమవారం జరిగిన ఎంసెట్ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు 465మంది హాజరయ్యారని కౌన్సెలింగ్ కేంద్రం అధికారి డాక్టర్ సింహాచలం తెలిపారు. గుంటూరులోని గుజ్జనగుండ్ల పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు కేటాయించిన ర్యాంకులకు ఏఎన్‌యూ కేంద్రంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement