రాత్రంతా రోడ్డుపైనే నిరసన
నవీన్ మృతదేహంతో తెల్లవారుజాము వరకూ ఆందోళన
న్యాయం చేయాలని గ్రామస్తులు, బంధువుల డిమాండ్
ఎట్టకేలకు దిగివచ్చిన ట్రాక్టర్ యజమాని వర్గీయులు
కోలవెన్ను (కంకిపాడు) : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి నవీన్‌కుమార్ కుటుం బాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు చేపట్టిన ఆందోళన రెండో రోజైన బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. రెండు వర్గాల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో కోలవెన్ను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఒకానొక దశలో తోపులాటలు జరిగాయి. అనంతరం రాజీ కుదరటంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. వివరాల్లోకి వెళితే.. కోలవెన్ను గ్రామానికి చెందిన ప్రత్తిపాటి నవీన్‌కుమార్ (18) విజయవాడలోని ఓ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం కళాశాల నుంచి రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆటోలో ఇంటికి వస్తున్నాడు. మాదాసువారిపాలెం సమీపంలో ఎదురుగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో నవీన్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. కోలవెన్ను రోడ్డు మార్జిన్‌లో ఉన్న కంకర గుట్టను తప్పించే క్రమంలో వేగంగా వెళ్తున్న రెండు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన నవీన్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు, బంధువులు పట్టుబట్టారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ యజమాని ప్రతినిధులు, బాధితులు, గ్రామస్తులతో తెల్లవారుజాము వరకూ పోలీసుస్టేషన్‌లోనే చర్చలు జరిపారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అనుచరుడు ఇచ్చిన హామీతో గ్రామస్తులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. అప్పటి వరకూ ఘటనాస్థలంలోనే ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడకు తరలించారు.
కోలవెన్నులో ఉద్రిక్తత
బాధితులు, ట్రాక్టర్ యజమాని ప్రతినిధులతో గ్రామ సర్పంచ్ తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), టీడీపీ నేత తుమ్మల జగదీష్ స్థానిక పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచి చర్చలు జరిపారు. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న నవీన్ తల్లిదండ్రులు నాగరాజు, శ్రీదేవి రోదించిన తీరు అక్కడ ఉన్నవారిని కదిలించివేంది. అందరితో కలివిడిగా ఉండే నవీన్ మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ పంచాయతీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకున్నారు. తమసహ విద్యార్ధిని చూసేందుకు విజయవాడలోని కళాశాల విద్యార్ధులు కోలవెన్ను చేరుకున్నారు. దీంతో గ్రామం లో విషాదం నెలకొంది. ట్రాక్టర్ యజమాని ఎం.శ్రీనివాసరావు తరఫు మధ్యవర్తులు జగన్‌మోహన్‌రావు, విశ్వేశ్వరరావు బాధిత కుటుంబానికి అందించే నష్టపరిహారం అందించే విషయం స్పష్టంగా చెప్పకపోవడం గ్రామస్తులు, మృతుని బంధువులను ఆగ్రహానికి గురిచేసింది. ఎస్‌ఐ శ్రీనివాస్ సమక్షంలోనే స్థానికులు మధ్యవర్తులపై దాడికి యత్నించారు. దీంతో ఎస్‌ఐ అక్కడినుంచి వెళ్లిపోయారు. సర్పంచ్ తుమ్మల చంద్రశేఖర్, తుమ్మల జగదీష్‌లు బాధితులు, మధ్యవర్తులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో నష్టపరిహారం విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో గ్రామానికి చెందిన యువత ఆగ్రహావేశాలతో కార్యాలయంలోకి తోసుకొచ్చి తోపులాటకు దిగారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులను వదిలేది లేదంటూ పెద్దగా కేకలు వేశారు. ఆందోళనకారులకు సర్దిచెప్పి రూ 2లక్షలు నష్టపరిహారం బాధిత కుటుంబానికి అందించేలా రాజీ కుదిర్చారు. దీంతో ఆందోళనకారులు వెనుదిరిగారు.