హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ గడగడలాడిస్తున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎబోలాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ రెడ్ అలెర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు అధికారులు ....విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎబోలా వైరస్ సోకిన వారిని గుర్తించి వారిని హుటాహుటిన అక్కడి నుంచి తరలించేందుకు వీలుగా రాష్ట్ర అత్యవసర వైద్య సేవల విభాగంకు చెందిన అంబులెన్సులు విమానాశ్రయంలో మోహరించాయి. దేశవ్యాప్తంగా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ తనిఖీలు జరుపుతున్నారు.
ఇందుకోసం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఆఫ్రికా ఖండంలో పలు ప్రాంతాలను ఎబోలా వైరస్ వణికిస్తోంది. తీవ్ర జ్వరంతో ఆరంభమయ్యే ఈ వైరస్ ప్రాణాంతకంగా మారుతుంది. దీంతో భారత్లో ఈ వైరస్ ప్రబలకుండా కేంద్ర ఆరోగ్య శాఖ జాగ్రత చర్యల్లో పడింది.