ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి | Eco-friendly should be | Sakshi
Sakshi News home page

ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి

Published Tue, Sep 15 2015 12:37 AM | Last Updated on Thu, Mar 21 2019 8:22 PM

ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి - Sakshi

ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి

గణపతి విగ్రహాలపై కలెక్టర్, సీపీ సమీక్ష
పోలీసులు సూచించిన ఘాట్‌ల్లోనే నిమజ్జనం చేయాలని వినతి
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం

 
భవానీపురం : ఎకో ఫ్రెండ్లీ విధానంలో గణపతి విగ్రహాలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ, నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీన జరుగనున్న వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, రోడ్లు-భవనాలు, అగ్నిమాపక, రవాణా తదితర శాఖలతో సోమవారం రాత్రి కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో తొలిసారిగా నిర్వహించనున్న ఈ వేడుకలను పూర్తి శాంతి భద్రతలు, పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో నిర్వహించుకోవాలని కోరారు. నిమజ్జనం సమయంలో జిల్లా యంత్రాంగం సూచించిన ఘాట్లలో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలని చెప్పారు. భవానీఘాట్‌ను విగ్రహాల నిమజ్జనం కోసం గుర్తించామని తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ విగ్రహాల ఏర్పాటు స్థలాల విషయమై ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వేడుకల కోసం ఇప్పటివరకు వెయ్యి దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించేందుకు మున్సిపాలిటీ, ఎలక్ట్రికల్, అగ్రిమాపక శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

గతంలో భవానీఘాట్‌లో విగ్రహాల నిమజ్జనం చేపట్టామని, తాగునీటి జలాలు కలుషితం కాకుండా అనువైన ప్రదేశాన్ని నిర్ణయించడానికి రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ వేశామని చెప్పారు. ఈ నెల 16 సాయంత్రం 6 గంటలకు క్షేత్రస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

 విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన క్రేన్‌లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీపీ అశోక్‌కుమార్, జేసీ-2 ఒంగోలు శేషయ్య, ఇన్‌చార్జ్ డీఆర్‌వో డి. సాయిబాబా, ఫైర్ ఆఫీసర్ డి. నిరంజన్‌రెడ్డి, పోలీస్ అధికారులు దామోదర్‌రెడ్డి, రమేష్‌బాబు, డి. శ్రావణ్‌కుమార్, ఇరిగేషన్ ఎస్‌ఈ సి. రామకృష్ణ, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ శేషుబాబు, అర్బన్ తహసీల్దార్ ఆర్. శివరామ్ తదితరులు పాల్గొన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement