రోడ్డుపైనే విద్యార్థుల సైకిళ్ల పార్కింగ్
తిరుపతి ఎడ్యుకేషన్ : ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ దిశగా రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం లోపు ఫీజు నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గురువారం తిరుపతి, శ్రీకాళహస్తిలోని 9ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలను కమిషన్ సభ్యుడైన కడప ఆర్జేడి కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ నాగేశ్వరరావు నేతృత్వంలో 20మంది వైఎస్సార్ జిల్లా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పలు అక్రమాలు బట్టబయలయ్యాయి.
తనిఖీ చేసిన ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలు
కమిషన్ ఆధ్వర్యంలో తిరుపతిలో 8, శ్రీకాళహస్తిలో ఒకటి, మొత్తం 9ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో తనిఖీలు చేశారు. తిరుపతిలో జీఎస్ మా డవీధిలోని శ్రీచైతన్య, కరకంబాడిరోడ్డులోని స్ప్రింగ్‌డేల్, భవానీనగర్‌లోని సిల్వర్ ఓక్స్, శివజ్యోతినగర్‌లోని రత్నం, ముత్యాలరెడ్డిపల్లెలోని నారాయణ, కేశవరెడ్డి, హథీరాంజీ కాలనీలోని భాష్యం, రవీంద్రభారతి, శ్రీకాళహస్తిలో నారాయణ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో ఈ తనిఖీలు చేశారు.
రికార్డులు గల్లంతు
ఒక్కో పాఠశాలకు ఇద్దరు చొప్పున కమిషన్ ప్రతినిధులు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగుచూశాయి. కమిషన్ ప్రధానంగా ఫీజులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, సిబ్బంది, తరగతి గదులు, భవనం, క్రీడా మైదానం, విద్యాబోధన, మౌలిక వసతులు తదితర అంశాలపై దృష్టి సారించారు. ప్రభుత్వ గుర్తింపునకు సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించారు. అయితే చాలా పాఠశాలల్లో రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని గుర్తించారు. అలాగే ఉపాధ్యాయులు, సిబ్బందికి జీతభత్యాలు చెల్లించే రికార్డులు లేనట్లు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అదనపు తరగతులు నిర్వహించడం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగినన్ని టాయ్‌లెట్లు లేకపోవడం, క్రీడా మైదానం లేకపోవడం వంటి అంశాలు వెలుగుచూశాయి. ఒకే తరగతిలో ఒక్కో విద్యార్థి నుంచి ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేసినట్లు గుర్తించారు. అలాగే రికార్డులు కాగితాలకే పరిమితమైనట్లు గుర్తించారు. పలు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించారు. వీటన్నింటినీ కమిషన్ బృందం నోట్ చేసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపనుంది. ఈ నెలాఖరులోపు జూనియర్ కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్టు సమాచారం.
క్రీడామైదానం లేని నారాయణ ప్రైవేట్ పాఠశాల భవనం
Comments
Please login to add a commentAdd a comment