నిరక్షరాస్యులైన ఉపాధి కూలీల కోసం సరఫరా చేసిన పాఠ్య పుస్తకాలు
కామవరపుకోట : జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న నిరక్షరాస్యులైన కూలీలను అక్షరాస్యులను చేసే కార్యక్రమం ప్రారంభమైంది. మస్తర్లలో వేలిముద్రలు నివారించడం ద్వారా బోగస్ హాజరును నివారించేందుకు ఇది దోహదపడతుందని పలువురు భావిస్తున్నారు. మస్తర్‌లో వారి పేర్లను వారే చదువుకునే విధంగా, జాబ్‌కార్డుల్లోని వివరాలు, పే స్లిప్పుల్లో వారి వేతన వివరాలు ఎవరికి వారు తెలుసుకునే విధంగా చదువులేని కూలీలకు చదవటం, రాయడం, సంతంకం చేసే విధంగా అక్షరాస్యతా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఆరునెలల కార్యక్రమం. దీనికోసం పాఠ్యపుస్తకాలను సరఫరా చేశారు. బ్రిడ్జ్ ప్రీమియర్, పార్టు–1, పార్ట్–2లు చదవడం అయ్యాక వీరికి పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లను అందజేస్తారు.
ఈ అక్షరాస్యతా కార్యక్రమం రెండు దశల్లో కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి ముప్ఫై మంది నిరక్షరాస్యులకు ఒక వలంటీర్‌ను నియమిస్తారు. సంఘాల్లో చదువుకున్న మేట్లు లేదా వేజ్‌సీకర్లను వలంటీర్లుగా నియమిస్తారు. వీరికి ఎటువంటి గౌరవవేతనం లభించదు. సామాజిక సేవగా భావించి పనిచెయ్యాలి. అంతే కాకుండా ప్రతి రెండు, మూడు మండలాలకు ఒక ఉపాధ్యాయుణ్ణి ఎంఎల్‌ఒగా నియమిస్తారు. గ్రామాల్లో అనువైన చోట చదువు నేర్పుతారు. ఉపాధి హామీ పథకానికి చెందిన సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంటారు. జిల్లాలో మొత్తం 1,92,429 మంది నిరక్షరాస్యులైన ఉపాధి కూలీలుండగా వీరిని అక్షరా>స్యులను చేసేందుకు 2,460 కేంద్రాలను ఏర్పాటు చేసి 63,108 మంది వలంటీర్లను గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment