చదువులతో చెలగాటం
ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలనే సదాశయంతో ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడిచింది. అంతకు ముందు చంద్రబాబు చీకటి పాలనలో ఫీజులు చెల్లించలేక ఉన్న కొద్దిపాటి భూమిని అమ్ముకున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన గుర్తెరగని గుడ్డి కాంగ్రెస్ సర్కారు బాబు బాటలోనే పయనించింది. సవాలక్ష ఆంక్షలతో పేద విద్యార్థుల భవితను నిబంధనల చట్రంలో బిగించింది. చివరకు వరలక్ష్మి అనే పేద విద్యార్థినిని పొట్టన పెట్టుకుంది.
జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంటు, ఉపకార వేతనాలతో పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి విద్యా సంవత్సరం ఆరంభమైన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంటు, ఉపకార వేతనం చెల్లించాలి. వైఎస్ మరణం తర్వాత ప్రతి ఏటా విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా, సరిగా చెల్లించకుండా నానా తిప్పలు పెట్టింది. ఎన్నికల ఏడాది కూడా ఇదే తరహా అవలంబిస్తోంది. ఇప్పటి వరకు 50 శాతం మంది విద్యార్థులకు మాత్రమే బోధనా ఫీజులు అందాయి.
ఓ వైపు ఫీజులు చెల్లించాలని యాజమాన్యాల ఒత్తిళ్లు మరోవైపు రీయింబర్స్‌మెంటు నిధులు విడుదలవుతాయో లేదోనని అయోమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏం చేయాలో పాలు పోని పరిస్థితిని ఎదుర్కొన్నారు. పైగా రీయింబర్స్‌మెంటు పథకంలో అనర్హులను గుర్తించేందుకే ఈ తతంగమంతా అని సర్కారు చిలక పలుకుల్ని వల్లె వేసింది. ఆధార్ కార్డుల ఆంక్షలతో, బయోమెట్రిక్ విధానంతో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. మహానేత వై.ఎస్.మరణానంతరం ఫీజుల భారం ఎలా తగ్గించుకోవాలా అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఏటికాయేడు కొత్త నిబంధనల్ని అమలు చేసిందే తప్ప వారి సంక్షేమంపై ఏ మాత్రం దృష్టి సారించలేదు.
జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం కింద 76,498 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు ఈ ఏడాది లబ్ధి పొందాల్సి ఉంది.
వీరిలో 52,013 మంది రెన్యువల్, 24,485 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారున్నారు.ఎస్సీ విద్యార్థుల్లో రెన్యువల్ సంఖ్య 18,054 కాగా, ఇప్పటివరకు రిజిస్టర్ అయిన వారి సంఖ్య 16,973 ఉంది బీసీల్లో 25,108 మందికి రెన్యువల్ చేయాల్సి ఉండగా, 24,268 మందికి మాత్రమే రిజిస్టర్ అయింది. - బీసీల్లోనే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు 8,899 మంది ఉన్నారు.ఎస్టీల్లో రెన్యువల్ విద్యార్థులు 3,250 మంది కాగా, 2,790 మందిని నమోదు చేశారు. 460 మంది విద్యార్థుల్ని రిజిస్టర్ చేయలేదు. వీరితో పాటు కొత్తగా 1,041 మంది దరఖాస్తు చేసుకున్నారు.
మైనార్టీల్లో రెన్యువల్‌కు 5,758 అర్హత కాగా, 5,158 మందిని నమోదు చేశారు. 600 మంది పలు కారణాలతో నమోదు కాలేదు. ఈ ఏడాది మరో 3,046 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈ ఏడాది 5,355 మంది ఈబీసీ విద్యార్థులు, 25 మంది వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
వైఎస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ ఠంఛనుగా ఫీజు రీయింబర్స్‌మెంటు అందిందని, ఇప్పుడు అంతా పెండింగ్‌లో పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రతి ఒక్కరూ స్మరణకు తెచ్చుకుంటున్నారు.