నేడు విద్యా సంస్థలు బంద్‌ | Educational institutions are Shut Down today | Sakshi
Sakshi News home page

నేడు విద్యా సంస్థలు బంద్‌

Published Tue, Sep 25 2018 4:19 AM | Last Updated on Tue, Sep 25 2018 10:23 AM

Educational institutions are Shut Down today - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో : విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలైనా నేటికీ విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ పలు విద్యార్థి సంఘాలు మంగళవారం విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. పాఠ్యపుస్తకాలు, స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నది ఎస్‌ఎఫ్‌ఐ, వైఎస్సార్‌ఎస్‌యూ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్‌ల ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో కేజీ టూ పీజీ వరకూ అన్ని విద్యాసంస్థలు బంద్‌కు సహకరించాలని ఆయా సంఘాల నాయకులు కోరారు.  

అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర
కాగా, విద్యార్థి సంఘాల బంద్‌ను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు తప్పనిసరిగా పనిచేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ సెక్రటరీ గిరిజాశంకర్‌ పేరిట ఆదివారం ఒక సర్క్యులర్‌ జారీ అయింది. బంద్‌ను విఫలం చేసే బాధ్యతను ఆర్‌జేడీ, డీఈఒలకు అప్పగించింది. మరోవైపు.. ప్రభుత్వ కుట్రను పిరికిపంద చర్యగా విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ప్రభుత్వం తన అణచివేత ధోరణిని వీడాలని.. విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ జేడీ రవీంద్రరెడ్డికి  విద్యార్థి సంఘాలు వినతిపత్రం ఇచ్చాయి.

విద్యా వ్యవస్థ నాశనం
ఇదిలా ఉంటే.. టీడీపీ పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైందని.. నాలుగేళ్ల పాలనలో సుమారు ఆరు వేల స్కూళ్లను మూసివేసిందని వైఎస్సార్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ నేత డి. అంజిరెడ్డి విమర్శించారు. నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క హామీ అమలుకాలేదన్నారు. మరోవైపు.. విద్యా సంస్థల బంద్‌ను ప్రభుత్వం అడ్డుకోవాలని చూడడం పిరికిపంద చర్యగా ఎస్‌ఎఫ్‌ఐ కృష్ణాజిల్లా అధ్యక్షులు కోటి అభివర్ణించారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే ఇలా వ్యవహరిస్తోందన్నారు. అలాగే, ప్రభుత్వం నిరంకుశ భావాలు వీడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర డిమాండ్‌ చేశారు.

వారి ప్రధాన డిమాండ్లు ఇవీ..
- పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి..
కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రణ చట్టం చేసి విద్యాహక్కు చట్టాన్ని పటిష్టం చేయాలి.
సంక్షేమ హాస్టళ్లలో మెనూను పూర్తిస్థాయిలో అమలుచేయాలి. మెస్‌ చార్జీలు పెంచాలి.
పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి
పెంచిన ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ కాలేజీల        ఫీజులు తగ్గించాలి..
ప్రతి మండలానికి జూనియర్‌ కాలేజీ, నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి..
అన్ని యూనివర్సిటీల పరిధిలో మెగా సప్లిమెంటరీని నిర్వహించాలి.
జీఓ నం. 35ను రద్దుచేసి ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలి.
మూసివేసిన స్కూళ్లు, హాస్టళ్లను తిరిగి ప్రారంభించి, మౌలిక వసతులు కల్పించాలి..
యూనివర్సిటీలలో ఖాళీ పోస్టులను భర్తీచేయాలి. పరిశోధన విద్యార్థులకు నెలకు రూ.8,000 ఇవ్వాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement