విసు సంస్థల అధినేత సీసీ రెడ్డి కన్నుమూత | Educationalist and Producer CC Reddy Passed Away | Sakshi
Sakshi News home page

విసు సంస్థల అధినేత సీసీ రెడ్డి కన్నుమూత

Published Tue, Oct 7 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

విసు సంస్థల అధినేత సీసీ రెడ్డి కన్నుమూత

విసు సంస్థల అధినేత సీసీ రెడ్డి కన్నుమూత

హైదరాబాద్: ప్రభుత్వ మాజీ సలహాదారు, ప్రముఖ సినీ నిర్మాత, విసు సంస్థల అధినేత సీసీరెడ్డి (చవ్వా చంద్రశేఖర్‌రెడ్డి, 76) సోమవారం రాత్రి 7.10 గంటలకు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో మృతి చెందారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ కోసం ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయనకు డయాలసిస్ చేస్తున్న సమయంలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కక్కడికక్కడే మృతి చెందినట్లు కేర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సీసీ రెడ్డి కడప జిల్లా పులివెందుల సమీపంలోని చినకుంట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 24న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చవ్వా రామలక్ష్మమ్మ, చవ్వా వెంగళరెడ్డి ఇద్దరూ ఉపాధ్యాయులు. తొమ్మిదిమంది సంతానమున్న పెద్ద కుటుంబం. దీంతో పేదరికంలోనే ఆయన తన విద్యాభ్యాసం పూర్తిచేశారు. తల్లిదండ్రుల పట్టుదలతో నే ఆయన న్యాయశాస్త్రం చదివారు.

సినిమా, పారిశ్రామిక, విద్యా, రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజ శేఖరరెడ్డికి ఆయన అత్యంత ఆప్తుడు. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆయనకు నలుగురు కుమార్తెలు. సీసీరెడ్డి మరణవార్త తెలియగానే వైఎస్సార్‌సీపీ నాయకులు, రాజకీయ, సినీ ప్రముఖులు ఆసుపత్రికి చేరుకుని నివాళులు అర్పించారు. సమీప బంధువులైన సినీనటుడు మంచు విష్ణు, నటి మంచు లక్ష్మి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు.

అంత్యక్రియలు గురువారం..

సీసీరెడ్డి అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నట్లు ఆయన సోదరుని అల్లుడు వై.సురేష్‌కుమార్‌రెడ్డి చెప్పారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం అభిమానుల దర్శనార్థం సీసీరెడ్డి ఇంటివద్ద ఆయన భౌతికకాయాన్ని ఉంచుతామని స్పష్టం చేశారు. కుమార్తెలు, కుమారులు, ముఖ్య బంధువులు అమెరికా నుంచి రావాల్సి ఉందని తెలిపారు. బుధవారం చంద్రగ్రహణం ఉండటంతో అంత్యక్రియలను గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత సదా శివపేటలోని సీసీరెడ్డి తోటలో నిర్వహించనున్నట్లు చెప్పారు.
 
విసు సంస్థలతో విఖ్యాతి


‘విసు’ సంస్థల అధిపతిగా విద్యార్థి లోకానికి సుపరిచితులైన సీసీ రెడ్డి న్యాయవాదిగా కడపలో వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా, కార్మిక సంఘాల నాయకునిగా అనేక ఉద్యమాల్ని, ప్రజాహిత కార్యక్రమాల్ని నిర్వహించారు. వీకే కృష్ణమీనన్ తదితరులతో కలిసి వివిధ దేశాల్లో జరిగిన అం తర్జాతీయ న్యాయ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. 1973లో అమెరికాలో వ్యాపారం అనంతరం 1983లో తిరిగి స్వదేశానికి వచ్చి ‘విసు’ సంస్థను నెలకొల్పారు. వేలమంది విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభకు వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభు త్వ హయాంలో 2004లో రాష్ట్ర ప్రభుత్వానికి విదేశీ పెట్టుబడుల సలహాదారుగా నియమితులై ఏడేళ్లపాటు కొనసాగారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విసు ఫిలిమ్స్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ‘మీ శ్రేయోభిలాషి’, ‘గౌతమ్ ఎస్‌ఎస్‌సీ’, ‘రూమ్‌మేట్స్’ చిత్రాలు నిర్మించారు. రాజేంద్రప్రసాద్ హీరోగా నిర్మించిన ‘మీ శ్రేయాభిలాషి’ చిత్రం మూడు బంగారు నందుల్ని, అనేక అంతర్జాతీయ బహుమతుల్ని పొందింది. అమెరికా వాసులు సీసీ రెడ్డిని లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంటు అవార్డుతో సత్కరించారు. రారా, కొడవటికంటి, శ్రీశ్రీ లాంటి సాహితీవేత్తలతో సాన్నిహిత్యం ఉంది. సవ్యసాచి, తెలుగు స్వతంత్య్ర మొదలైన పత్రికల్లో వ్యాసాలు, కథలు, కవితలు రాశారు. ‘ఈభూమి’ పేరుతో వారపత్రికను నడిపారు.

సీసీ రెడ్డి మృతికి జగన్ సంతాపం

రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సీసీరెడ్డి మృతిపట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసింద న్నారు. సీసీరెడ్డి మృతికి నివాళులర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. సీసీ రెడ్డి జీవితం కమ్యూనిస్టు పార్టీతో, కార్మికోద్యమంతో పెనవేసుకుందని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కె.నారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలో లేకున్నా ప్రతి సందర్భంలోనూ వామపక్ష ఉద్యమానికి శ్రేయోభిలాషిగా వ్యవహరించారని, ఆయన మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఇతర నేతలు జి.ఓబులేసు, జి.ఈశ్వరయ్య తదితరులు కూడా సీసీ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement