CC reddy
-
సీసీ రెడ్డి అంత్యక్రియలు పూర్తి
కన్నీటి పర్యంతమైన స్నేహితులు, బంధువులు కుటుంబాన్ని ఓదార్చిన జగన్, విజయమ్మ సిటీబ్యూరో: విసు సంస్థల అధినేత, చలన చిత్ర నిర్మాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సీసీ రెడ్డి (చవ్వా చంద్రశేఖరరెడ్డి) భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ నెల 6వ తేదీన కేర్ ఆసుపత్రిలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. ఉదయాన్నే సీసీ రెడ్డి భౌతిక కాయాన్ని కేర్ హాస్పిటల్ నుంచి తీసుకువచ్చి జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో ప్రజల దర్శనార్థం ఉంచారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబాన్ని ఓదార్చేందుకు ప్రయత్నించారు. సీపీఐ నేత డాక్టర్ కె. నారాయణ దంపతులు, ఏపీ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కె. రామకృష్ణ, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, సినీ డెరైక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, వైఎస్ అనిల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టి.చెంచురెడ్డి, తదితరులు సీసీ రెడ్డి భౌతికకాయంవద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకంటే ముందుగా భౌతికకాయం వద్ద క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కుటుంబీకులు, బంధువులు కార్యక్రమాలు నిర్వహించారు. సీసీ రెడ్డి అమితంగా ఇష్టపడే పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో బంధువులు, కుటుంబీకులు, విసు విద్యాసంస్థల సిబ్బంది వెంటరాగా సీసీ రెడ్డి పార్థివదేహాన్ని ముంబై హైవే మార్గంలోని మునిపల్లి మండలం గొర్రెగట్టు గ్రామం సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి నుంచి సీసీ రెడ్డి భౌతికకాయాన్ని తరలిస్తుండగా భార్య సుభద్రమ్మ, కుమార్తెలు, మనుమరాలు విరోనికా, సీసీ రెడ్డి శిష్యుడు బి. నాగరాజు , బంధువులు, స్నేహితులు ఒక్కసారిగా ఘెల్లుమన్నారు. ఆయనది ఆదర్శ జీవితం : మంచు లక్ష్మి అందరూ జీవితం ఎలా ఉండాలని ఆశపడతారో అంతకన్నా ఎక్కువగా గొప్ప జీవితాన్ని సీసీ రెడ్డి అనుభవించారని సినీ నటి మంచు లక్ష్మి తెలిపారు. ప్రేమ, ఆనందంతో కూడిన అద్భుతమైన జీవితాన్ని అనుభవించి, అందరికీ అన్నింట్లో ఆదర్శంగా నిలిచిన మహామనిషి సీసీ రెడ్డి తిరిగిరాని తీరాలకు వెళ్లటం బాధాకరమన్నారు. మానవతావాది: గేయ రచయిత రాంబాబు జీవితాన్ని ప్రేమించిన శ్రేయోభిలాషి, మహోన్నత మానవతావాది సీసీ రెడ్డి అని సినీ గేయ రచయిత వెనిగళ్ల రాంబాబు కొనియాడారు. ఆత్మహత్యల నివారణ కోసం ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రాన్ని నిర్మించిన మహానుభావుడని చెప్పారు. తాను రాసిన ‘చిరునవ్వులతో బతకాలి.. చిరంజీవిగా బతకాలి’ అనేపాట సీసీ రెడ్డి హృదయానికి అక్షరరూపాలేనని తెలిపారు. -
సీసీ రెడ్డికి వైఎస్ జగన్, విజయమ్మ నివాళి
హైదరాబాద్ : అనారోగ్యంతో మృతి చెందిన సీసీ రెడ్డి భౌతిక కాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ గురువారం నివాళులు అర్పించారు. అనంతరం వారు సీసీ రెడ్డి సతీమణి సుభద్రమ్మతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీసీ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శనార్థం కేర్ ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. అలాగే వివిధ పార్టీ నేతలు కూడా సీసీ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాగా సీసీ రెడ్డి అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం మునిపల్లి మండలం గొర్రెగట్టు గ్రామం సమీపంలోని ఫాంహౌస్‌లో నిర్వహించనున్నారు. -
సీసీ రెడ్డి కుటుంబానికి షర్మిల పరామర్శ
సాక్షి,సిటీబ్యూరో: చలన చిత్ర నిర్మాత సీసీ రెడ్డి కుటుంబసభ్యులను దివంగత సీఎం వైఎస్సార్ కుమార్తె షర్మిల, ఆమె భర్త అని ల్‌కుమార్ పరామర్శించారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏ ర్పాటు చేసిన చిత్రపటం వద్ద వారు శ్రద్ధాం జలి ఘటించారు. అనంతరం సీసీ రెడ్డి భా ర్య సుభద్రమ్మను ఓదార్చారు. అనంతపు రం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా సీసీ రె డ్డి నివాసానికి చేరుకొని సీసీ రెడ్డి కుటుం బీకులను పరామర్శించారు. సీసీ రెడ్డి దగ్గర 20 ఏళ్లుగా పనిచేస్తున్నానని ఆయన సహచరుడు అనంతపురం జిల్లా ఓడీ చెరువుకు చెందిన బి. నాగరాజు కన్నీటి పర్యంతమయ్యారు. నేడు అంత్యక్రియలు.. సీసీ రెడ్డి భౌతికకాయాన్ని కేర్ హస్పిటల్ నుంచి గురువారం ఉదయం 7 గంటలకు జూబ్లీహిల్స్, రోడ్ నంబర్ 24లోని, ప్లాట్ నంబర్ 366కు తీసుకువస్తామని సమీపబంధువు వై.సురేష్ కుమార్ రెడ్డి తెలిపా రు. అంత్యక్రియలను మధ్యాహ్నం 12 గం టల తర్వాత పటాన్ చెరువు నుంచి ముం బయి హైవే మార్గంలోని మునిపల్లి మండ లం గొర్రెగట్టు గ్రామం సమీపంలోని ఫాంహౌస్(శివశివాని ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర)లో నిర్వహిస్తారని చెప్పారు. -
విసు సంస్థల అధినేత సీసీ రెడ్డి కన్నుమూత
హైదరాబాద్: ప్రభుత్వ మాజీ సలహాదారు, ప్రముఖ సినీ నిర్మాత, విసు సంస్థల అధినేత సీసీరెడ్డి (చవ్వా చంద్రశేఖర్‌రెడ్డి, 76) సోమవారం రాత్రి 7.10 గంటలకు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో మృతి చెందారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ కోసం ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయనకు డయాలసిస్ చేస్తున్న సమయంలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కక్కడికక్కడే మృతి చెందినట్లు కేర్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సీసీ రెడ్డి కడప జిల్లా పులివెందుల సమీపంలోని చినకుంట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 24న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చవ్వా రామలక్ష్మమ్మ, చవ్వా వెంగళరెడ్డి ఇద్దరూ ఉపాధ్యాయులు. తొమ్మిదిమంది సంతానమున్న పెద్ద కుటుంబం. దీంతో పేదరికంలోనే ఆయన తన విద్యాభ్యాసం పూర్తిచేశారు. తల్లిదండ్రుల పట్టుదలతో నే ఆయన న్యాయశాస్త్రం చదివారు. సినిమా, పారిశ్రామిక, విద్యా, రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజ శేఖరరెడ్డికి ఆయన అత్యంత ఆప్తుడు. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆయనకు నలుగురు కుమార్తెలు. సీసీరెడ్డి మరణవార్త తెలియగానే వైఎస్సార్సీపీ నాయకులు, రాజకీయ, సినీ ప్రముఖులు ఆసుపత్రికి చేరుకుని నివాళులు అర్పించారు. సమీప బంధువులైన సినీనటుడు మంచు విష్ణు, నటి మంచు లక్ష్మి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అంత్యక్రియలు గురువారం.. సీసీరెడ్డి అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నట్లు ఆయన సోదరుని అల్లుడు వై.సురేష్‌కుమార్‌రెడ్డి చెప్పారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం అభిమానుల దర్శనార్థం సీసీరెడ్డి ఇంటివద్ద ఆయన భౌతికకాయాన్ని ఉంచుతామని స్పష్టం చేశారు. కుమార్తెలు, కుమారులు, ముఖ్య బంధువులు అమెరికా నుంచి రావాల్సి ఉందని తెలిపారు. బుధవారం చంద్రగ్రహణం ఉండటంతో అంత్యక్రియలను గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత సదా శివపేటలోని సీసీరెడ్డి తోటలో నిర్వహించనున్నట్లు చెప్పారు. విసు సంస్థలతో విఖ్యాతి ‘విసు’ సంస్థల అధిపతిగా విద్యార్థి లోకానికి సుపరిచితులైన సీసీ రెడ్డి న్యాయవాదిగా కడపలో వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా, కార్మిక సంఘాల నాయకునిగా అనేక ఉద్యమాల్ని, ప్రజాహిత కార్యక్రమాల్ని నిర్వహించారు. వీకే కృష్ణమీనన్ తదితరులతో కలిసి వివిధ దేశాల్లో జరిగిన అం తర్జాతీయ న్యాయ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. 1973లో అమెరికాలో వ్యాపారం అనంతరం 1983లో తిరిగి స్వదేశానికి వచ్చి ‘విసు’ సంస్థను నెలకొల్పారు. వేలమంది విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభకు వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభు త్వ హయాంలో 2004లో రాష్ట్ర ప్రభుత్వానికి విదేశీ పెట్టుబడుల సలహాదారుగా నియమితులై ఏడేళ్లపాటు కొనసాగారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విసు ఫిలిమ్స్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ‘మీ శ్రేయోభిలాషి’, ‘గౌతమ్ ఎస్ఎస్సీ’, ‘రూమ్మేట్స్’ చిత్రాలు నిర్మించారు. రాజేంద్రప్రసాద్ హీరోగా నిర్మించిన ‘మీ శ్రేయాభిలాషి’ చిత్రం మూడు బంగారు నందుల్ని, అనేక అంతర్జాతీయ బహుమతుల్ని పొందింది. అమెరికా వాసులు సీసీ రెడ్డిని లైఫ్ టైమ్ ఎచీవ్మెంటు అవార్డుతో సత్కరించారు. రారా, కొడవటికంటి, శ్రీశ్రీ లాంటి సాహితీవేత్తలతో సాన్నిహిత్యం ఉంది. సవ్యసాచి, తెలుగు స్వతంత్య్ర మొదలైన పత్రికల్లో వ్యాసాలు, కథలు, కవితలు రాశారు. ‘ఈభూమి’ పేరుతో వారపత్రికను నడిపారు. సీసీ రెడ్డి మృతికి జగన్ సంతాపం రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సీసీరెడ్డి మృతిపట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసింద న్నారు. సీసీరెడ్డి మృతికి నివాళులర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. సీసీ రెడ్డి జీవితం కమ్యూనిస్టు పార్టీతో, కార్మికోద్యమంతో పెనవేసుకుందని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కె.నారాయణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలో లేకున్నా ప్రతి సందర్భంలోనూ వామపక్ష ఉద్యమానికి శ్రేయోభిలాషిగా వ్యవహరించారని, ఆయన మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఇతర నేతలు జి.ఓబులేసు, జి.ఈశ్వరయ్య తదితరులు కూడా సీసీ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. -
ప్రభుత్వ మాజీ సలహాదారు సీసీ రెడ్డి కన్నుమూత
-
ప్రభుత్వ మాజీ సలహాదారు సీసీ రెడ్డి కన్నుమూత
హైదరాబాద్: ప్రభుత్వ మాజీ సలహాదారు సీసీ రెడ్డి (76) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు కేర్ ఆస్పత్రిలో గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. సీసీ రెడ్డి మృతికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతంలో సీసీ రెడ్డి కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 'రూమ్ మేట్స్, మీ శ్రేయోభిలాషి, గౌతమ్ ఎస్ఎస్సీ తదితర చిత్రాలకు ఆయన నిర్మాణ సారథ్యం వహించారు.