సీసీ రెడ్డి అంత్యక్రియలు పూర్తి
కన్నీటి పర్యంతమైన స్నేహితులు, బంధువులు కుటుంబాన్ని ఓదార్చిన జగన్, విజయమ్మ
సిటీబ్యూరో: విసు సంస్థల అధినేత, చలన చిత్ర నిర్మాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సీసీ రెడ్డి (చవ్వా చంద్రశేఖరరెడ్డి) భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ నెల 6వ తేదీన కేర్ ఆసుపత్రిలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. ఉదయాన్నే సీసీ రెడ్డి భౌతిక కాయాన్ని కేర్ హాస్పిటల్ నుంచి తీసుకువచ్చి జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో ప్రజల దర్శనార్థం ఉంచారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబాన్ని ఓదార్చేందుకు ప్రయత్నించారు.
సీపీఐ నేత డాక్టర్ కె. నారాయణ దంపతులు, ఏపీ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కె. రామకృష్ణ, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, సినీ డెరైక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, వైఎస్ అనిల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టి.చెంచురెడ్డి, తదితరులు సీసీ రెడ్డి భౌతికకాయంవద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకంటే ముందుగా భౌతికకాయం వద్ద క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కుటుంబీకులు, బంధువులు కార్యక్రమాలు నిర్వహించారు. సీసీ రెడ్డి అమితంగా ఇష్టపడే పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో బంధువులు, కుటుంబీకులు, విసు విద్యాసంస్థల సిబ్బంది వెంటరాగా సీసీ రెడ్డి పార్థివదేహాన్ని ముంబై హైవే మార్గంలోని మునిపల్లి మండలం గొర్రెగట్టు గ్రామం సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి నుంచి సీసీ రెడ్డి భౌతికకాయాన్ని తరలిస్తుండగా భార్య సుభద్రమ్మ, కుమార్తెలు, మనుమరాలు విరోనికా, సీసీ రెడ్డి శిష్యుడు బి. నాగరాజు , బంధువులు, స్నేహితులు ఒక్కసారిగా ఘెల్లుమన్నారు.
ఆయనది ఆదర్శ జీవితం : మంచు లక్ష్మి
అందరూ జీవితం ఎలా ఉండాలని ఆశపడతారో అంతకన్నా ఎక్కువగా గొప్ప జీవితాన్ని సీసీ రెడ్డి అనుభవించారని సినీ నటి మంచు లక్ష్మి తెలిపారు. ప్రేమ, ఆనందంతో కూడిన అద్భుతమైన జీవితాన్ని అనుభవించి, అందరికీ అన్నింట్లో ఆదర్శంగా నిలిచిన మహామనిషి సీసీ రెడ్డి తిరిగిరాని తీరాలకు వెళ్లటం బాధాకరమన్నారు.
మానవతావాది: గేయ రచయిత రాంబాబు
జీవితాన్ని ప్రేమించిన శ్రేయోభిలాషి, మహోన్నత మానవతావాది సీసీ రెడ్డి అని సినీ గేయ రచయిత వెనిగళ్ల రాంబాబు కొనియాడారు. ఆత్మహత్యల నివారణ కోసం ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రాన్ని నిర్మించిన మహానుభావుడని చెప్పారు. తాను రాసిన ‘చిరునవ్వులతో బతకాలి.. చిరంజీవిగా బతకాలి’ అనేపాట సీసీ రెడ్డి హృదయానికి అక్షరరూపాలేనని తెలిపారు.