ఈదర అవుట్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు పదవి పోయింది. పార్టీ విప్ ధిక్కరించిన కేసులో ఆయనపై అనర్హత వేటు వేస్తూ సోమవారం సాయంత్రం ప్రిసైడింగ్ అధికారి హోదాలో కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పరిషత్‌కు చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు కో-ఆప్షన్ మెంబర్ల ఎంపికకు గత నెల 13న ప్రత్యేక సమావేశం జరిగింది. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ విజయకుమార్ వ్యవహరించారు. చైర్మన్ ఎన్నిక సందర్భంలో
పొన్నలూరు జెడ్పీటీసీ ఈదర హరిబాబు ఇండిపెండెంట్ అభ్యర్థికి, వైస్ చైర్మన్ ఎన్నికలో మరో ఇండిపెండెంట్ అభ్యర్థికి విప్ ధిక్కరించి చేతులు ఎత్తినందున పార్టీ విప్ ధిక్కరించినట్లు భావించి పంచాయతీరాజ్ చట్టం 2006 ప్రకారంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఎలక్షన్ రూల్స్ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు నం.173, తేదీ 10.5.2006 మేరకు విప్ ధిక్కరించినందున జెడ్పీటీసీ పొన్నలూరు అభ్యర్థి హరిబాబుపై కలెక్టర్ అనర్హత ఉత్తర్వులు జారీ చేశారు.’ అంటూ అధికారిక ప్రకటన వెలువడింది.
వేటు పడిందిలా...
పార్టీ విప్ ధిక్కరించి ఓటు వేసిన అంశంలో తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు కలెక్టర్ విచారణ చేపట్టారు. దీనిపై నోటీసులు జారీ చేసినపుడు తాను పార్టీ విప్ తీసుకోలేదని, అందువల్ల విప్ ధిక్కరించే అవకాశం లేదంటూ ఈదర హరిబాబు, ఆయన తరఫు న్యాయవాది వాదించారు. అయితే విప్ జారీ చేసిన సమయంలో పెట్టిన సంతకం, గత నెల 13వ తేదీన జరిగిన ప్రత్యేక సమావేశం హాజరు రిజిస్టర్‌లో సంతకం సరిచూడగా రెండు సంతకాలు ఒక్కటే కావడంతో కలెక్టర్ విప్ ధిక్కరించినట్లు భావించి వేటు వేశారు.
కిం కర్తవ్యం...
జెడ్పీ చైర్మన్‌పై వేటు పడటంతో తర్వాత ఏం చేయాలనే దానిపై కలెక్టర్ దృష్టి పెట్టారు. చట్ట ప్రకారం వైస్ చైర్మన్‌ను ఇన్‌చార్జిగా నియమించాల్సి ఉంటుంది. దీని కోసం ఎన్నికల సంఘాన్ని స్పష్టత ఇవ్వాల్సిందిగా లేఖ రాశారు. మంగళవారానికి దీనిపై ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆదేశాలు రాగానే వైస్ చైర్మన్‌గా ఉన్న నూకసాని బాలాజీకి చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారు.
మళ్లీ ఎన్నిక ఎప్పుడు?
జెడ్పీ చైర్మన్‌పై వేటు పడటంతో ఆయనకు కోర్టు నుంచి ఎటువంటి ఊరట లభించని పక్షంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మళ్లీ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. హరిబాబు జెడ్పీటీసీ సభ్యత్వం రద్దు కావడంతో పొన్నలూరు జెడ్పీటీసీకి ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ ఎన్నికను ఆరు నెలల్లోపు ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అప్పటి వరకూ నూకసాని బాలాజీ చైర్మన్‌గా కొనసాగుతారు. పొన్నలూరు జెడ్పీటీసీ ఎన్నిక జరగకముందే చైర్మన్ ఎన్నిక జరిపించాలని తెలుగుదేశం నాయకులు తెరవెనక ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే ఎన్నికల సంఘందే తుది నిర్ణయం కావడంతో అక్కడి నుంచి ఆదేశాలు వచ్చే వరకూ చైర్మన్ ఎన్నిక ఉండకపోవచ్చు.