జాతరెళ్లిపోయాకే.. | effect transfers of officers | Sakshi
Sakshi News home page

జాతరెళ్లిపోయాకే..

Published Sat, Feb 8 2014 4:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

effect transfers of officers

 సమ్మక్క-సారలమ్మ జాతర ఎఫెక్ట్ అధికారుల అంతర్‌జిల్లాల బదిలీలపై పడింది. మేడారం జాతర ఈ నెల 15 వరకు ఉండడంతో అది ముగిసిన తర్వాతే జోన్ పరిధిలోని వరంగల్, కరీంనగర్ జిల్లాలకు బదిలీ అయ్యే ఉద్యోగులను రిలీవ్ చేయాలని సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీ చేసింది.
 
 కలెక్టరేట్, న్యూస్‌లైన్ :  ఎన్నికలసంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మూడే ళ్ల పాటు విధులు నిర్వర్తించిన అధికారులు, సొంత జిల్లాకు చెందిన వారిని బదిలీ చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు తహశీల్దార్లు, ఎంపీడీవోల జాబితాను రూపొందించింది. సమ్మక్క జాతర ముగిసేవరకు జిల్లాలోని ఉద్యోగులను బదిలీ చేయొద్దని వరంగల్ కలెక్టర్ సీసీఎల్‌ఏను సంప్రదించారు. జిల్లాలో అనుభవం ఉన్న అధికారులను రిలీవ్ చేస్తే జాతర ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా సీసీఎల్‌ఏ సైతం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని 15 వరకు గడువు ఇస్తూ సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ జిల్లాలో ఇప్పటికే బదిలీ అయిన తహశీల్దార్లను 15వ తేదీ తర్వాతే రిలీవ్ చేయనున్నారు.
 
 ఎక్కువ మంది వరంగల్ వారే...
 జిల్లా నుంచి బదిలీపై వెళ్లే అధికారులకు సీసీఎల్‌ఏ వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలను మాత్రమే ఆప్షన్లుగా ఇచ్చింది. అంతర్ జిల్లాల వారికి కరీంనగర్ ఆప్షన్ ఉంది. జిల్లాలో 19 మంది డెప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతి కల్పించి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు ఇప్పటికే బదిలీ చేసింది. ఇతర జిల్లా ల నుంచి జిల్లాకు 35మంది అధికారులు బదిలీపై రావాల్సి ఉండగా, ఇక్కడినుంచి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాకు 28 మంది బదిలీపై వెళ్లనున్నారు. బదిలీపై వెళ్లే 28 మందిలో అత్యధికంగా 21 మంది వరంగల్ జిల్లానే ఆప్షన్‌గా ఎంచుకున్నారు. మరో 9 మంది ఆదిలాబాద్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చే అధికారులకు పోస్టింగ్ ఇస్తేనే ఇక్కడి వారిని రిలీవ్ చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 11 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావించినా ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతర పూర్తయ్యాకే స్థానచలనం కలగనుంది.
 
 పలువురికి మినహాయింపు
 మన జిల్లాలో పనిచేస్తున్న, ఇతర జిల్లాలకు చెందిన వారిలో ఆర్నెల్లలోగా ఉద్యోగ విరమణ పొందే 10 మం ది తహశీల్దార్లను బదిలీల నుంచి మినహాయించింది. ఎన్నికలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం లేని కలెక్టరేట్ సూపరింటెండెంట్లు ఐదుగురు, ఆర్డీవో కార్యాలయ ఏవోలు ఐదుగురికి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు బదిలీ ఉత్తర్వులు రాకపోవడంతో ఇక 15వ తేదీ తర్వాతే బదిలీల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement