అధికారులు, డీలర్ల మధ్య కుదరని పొంతన
ఆగిన కిరోసిన్ సరఫరా
గడువున్నది రెండు రోజులే...
6.85లక్షల మందికి ఇబ్బందులు
విజయనగరం కంటోన్మెంట్:
అధికారుల ధీమా, డీలర్ల నిర్లక్ష్యంతో జిల్లాలోని 6.85 లక్షల వినియోగదారులకు కిరోసిన్ పంపిణీ నిలిచిపోయింది. ప్రతీ నెలా జిల్లాకు 12,48,000లీటర్ల నీలి కిరోసిన్ పంపిణీ అవుతున్నది. ఈ-పాస్ ద్వారా కాకుండా మామూలుగా ఇవ్వడం వల్ల గత నెల జిల్లాలోని అన్ని డిపోల్లో 77,451లీటర్ల కిరోసిన్ మాత్రమే మిగిలింది. ఇది డీలర్ల లెక్క. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,85,649 లీటర్లు మిగిలి ఉండాలి. అదే ఉద్దేశంతో దానిని కలుపుకుని తాజాగా 9,84,900 లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేశారు. ఇది ఎలా సరిపోతుందని డీలర్లు ప్రశ్నిస్తున్నారు.
ఈ పాస్ ద్వారా కిరోసిన్ సరఫరా కాకపోయినా...
గత నెల 20, 21 తేదీల్లో కిరోసిన్ పంపిణీ చేశారనీ, 22వ తేదీకి క్లోజ్ చేశారనీ చెప్పారు. ఈ కొద్ది రోజుల్లో కిరోసిన్ ఈ పాస్ ద్వారా కిరోసిన్‌ను ఎలా పంపిణీ చేస్తామనీ డీలర్లు ప్రశ్నిస్తున్నారు. గతేడాది మార్చి నుంచి ఈ పాస్ విధానం మొదలైంది. కానీ కిరోసిన్ మాత్రం మామూలుగానే అందజేస్తున్నారు. ఇది అధికారులకు తెలుసు. రెండు నెలల క్రితం ఈ పాస్‌లోనే కిరోసిన్ ఇవ్వాలని జేసీ శ్రీకేశ్ బి లఠ్కర్, డీఎస్‌ఓ నాగేశ్వరరావు రేషన్ డీలర్లకు ఆదేశించారు. ఎప్పుడూ చెప్పేదే కదా అని డీలర్లు పట్టించుకోలేదు. కొంత మంది ప్రారంభంలో ఈపాస్ ద్వారా ఇవ్వడం ప్రారంభించినా ఆలస్యమవుతున్నదనే కారణంతో మాన్యువల్ పద్ధతిలోనే ఇచ్చేశారు.
ఈ నెల ఈ పాస్‌లో ఎంత పంపిణీ అయిందో చూసుకుని ఆ మేరకే కిరోసిన్ కేటాయించారు. దీంతో క్లోజింగ్ బ్యాలెన్స్‌లో తేడా వచ్చింది. అధికారుల లెక్కలతో అయితే తాము సరఫరా చేయలేమని డీలర్లు తేల్చి చెప్పేశారు. దీనివల్ల కిరోసిన్ కేటాయించి దాదాపు 15 రోజులు దాటినా సరఫరా చేపట్టలేదు. ఈ నెల 18లోగా పంపిణీ పూర్తిచేయాలి. కానీ అలా అయ్యే అవకాశం కనిపించలేదు. దీనిపై మంగళవారం ఉదయం జేసీ శ్రీకేశ్ బి లఠ్కర్‌ను కలసి డీలర్లు వినతిపత్రాన్ని అందించారు. ఆయన సాయంత్రం కలువమన్నారని రేషన్ డీలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సముద్రపు రామారావు చెప్పారు. సాయంత్రం డీఎస్‌ఓతో కలసి రావాలన్నారనీ, కానీ డీఎస్‌ఓ సాలూరు వెళ్లిపోవడంతో పంచాయతీ తేలలేదని తెలిసింది.
తేలని లెక్కలు
Published Tue, Mar 15 2016 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM
Advertisement
Advertisement