కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : పాలకుల నిర్లక్ష్యం వల్లనే సాగునీటి ప్రాజెక్టులకు గ్రహణం పట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు. కడపలోని డాక్టర్ వైఎస్‌ఆర్ మెమోరియల్ మున్సిపల్ ఆడిటోరియంలో సాగునీటి ప్రాజెక్టుల సత్వర నిర్మాణం కోసం రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో నారాయణ ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నీటి అవసరం ఎంతో ఉంటుందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయకపోవడంతో అవన్నీ పెండింగ్‌లో ఉండిపోయాయని ఆరోపించారు.
రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలు తీరాలంటే కృష్ణా జలాల మళ్లింపే శరణ్యమన్నారు. ఇందు కోసం సీపీఐ అలుపెరుగని పోరాటం చేస్తున్నదన్నారు. 1937లో శ్రీబాగ్ ఒడంబడికను ఉల్లంఘించారన్నారు. 1953లో కేంద్ర జలవనరుల సంఘం ఆమోదించిన కృష్ణా-పెన్నార్‌ను తెలుగు ప్రజల ఐక్యత కోసం త్యాగం చేశారన్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా రాయలసీమ రాజధానిని, తుంగభద్ర డ్యామ్‌ను, బళ్లారిని కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు.
1984-85లో మిగులు జలాల ఆధారంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించిన గాలేరు- నగరి(గండికోట), తెలుగు గంగ, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. బ్రిజేష్‌కుమార్ మిశ్రా కమిటీ ఇచ్చిన ట్రిబ్యునల్ తీర్పుతో రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. బ్రిజేష్‌కుమార్ మిశ్రాను కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నీటి ప్రాజెక్టుల కోసం అలుపెరుగని పోరాటాలకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్లు ఈ సందర్భంగా నారాయణ అన్నారుఉ.
ఫిబ్రవరి 5న కలెక్టరేట్‌ల ఎదుట సామూహిక నిరాహారదీక్షలు, 15న సంతకాల సేకరణ, 17న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలతోపాటు హైదరాబాద్ కేంద్రంగా ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి కోసం పోరాటాలు చేయనున్నామన్నారు. సదస్సులో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామకృష్ణ, జి.ఓబులేసు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకయ్య, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల పార్టీ కార్యదర్శులు కె.అరుణ, కె.రామాంజనేయులు, జగదీష్, రామానాయుడు, ఈశ్వరయ్య, రామరాజు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.
పాలకులదే పాపం
Published Sat, Feb 1 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement
Advertisement