ఒంగోలు, న్యూస్‌లైన్: వైద్య సేవలు మరింత విస్తృతం చేయాలని మాతాశిశు వైద్యశాల కమిటీ చైర్మన్ బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. సోమవారం ఒంగోలులోని మాతాశిశు వైద్యశాలలో నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఆస్పత్రి సీ గ్రేడ్‌లో ఉండేదని, కానీ ప్రస్తుతం ఏ గ్రేడ్‌కు చేరిందని తెలిపారు. మాతా శిశువులకు సంబంధించి ప్రతి రోజూ 200కుపైగా ఓపీలు వస్తున్నట్లు తెలిపారు. ప్రసవాలు నెలకు 150 నుంచి 176కి పెరిగాయన్నారు. ఎక్స్‌రే తీయించాల్సి వచ్చినప్పుడు రిమ్స్‌ను ఆశ్రయించాల్సి వస్తుందని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా పోర్టబుల్ ఎక్స్‌రే యూనిట్‌కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.
3.5 లక్షల నిధులతో కొనుగోలు చేసేందుకు బాలినేని అనుమతి మంజూరు చేశారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లకు హాజరైన సిబ్బందికి 1.31 లక్షల ప్రోత్సాహం ఇచ్చామన్నారు. ప్రస్తుతమున్న 80 పడకలను వంద పడకలుగా మార్చేందుకు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. సూపరింటెండెంట్ ఎస్ ఉషారాణి మాట్లాడుతూ ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉన్నట్లు తెలిపారు. 2013 ఏప్రిల్ నుంచి 2014 జనవరి వరకు ఆరోగ్యశ్రీ ఆపరేషన్ల కోసం పిలిపించిన ప్రైవేటు మత్తు డాక్టర్లకు *2.21 లక్షలు చెల్లించినట్లు వివరించారు. ఈ విషయాన్ని రిమ్స్ డెరైక్టర్ దృష్టికీ తీసుకెళ్లామని తెలిపారు. తాజా రిక్రూట్‌మెంట్‌లో కనీసం అనస్తీషియా పీజీ డాక్టర్‌నైనా ఇవ్వాలని కోరారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, అన్ని సమస్యలు తీరతాయని బాలినేని వారికి భరోసా ఇచ్చారు.
ఆస్పత్రి అభివృద్ధికి కృషి
Published Tue, Feb 25 2014 2:54 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement