గుడ్లురుముతోంది
Published Wed, Dec 11 2013 12:51 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: కూరగాయల ధరలు మండిపోతున్నా.. కూర త్వరగా రెడీ కావాలన్నా.. అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది గుడ్డు. ఇక బ్యాచిలర్ల ఫుడ్డుకైతే కొండంత ‘అండా’.. అలాంటి గుడ్డు ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సామాన్య ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే కోడిగుడ్డు ధర రోజురోజుకూ పెరిగిపోతోంది. కార్తీకమాసం ప్రారంభానికి ముందుకు కొండెక్కిన ధర అంతకంతకూ పెరిగిపోతోంది. ఒకానొక దశలో చికెన్ ధరలు అమాంతం పడిపోయినప్పటికీ గుడ్డు ధర మాత్రం పైసా తగ్గలేదు. వారం రోజుల్నుంచి మరింత పెరిగింది. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌లో ఒక గుడ్డు రూ.4.50 పలుకుతుండగా, రిటైల్‌లో రూ.5కు విక్రయిస్తున్నారు. మునుపెన్నడూ లేనంతగా ధర పెరిగిపోవడంతో సామాన్యులు గుడ్డు కొనాలంటేనే జంకుతున్నారు.
దాణా ఖర్చులే కారణం...
గుడ్డు ధర ప్రియం కావడానికి పెరిగిన కోళ్ల దాణా ఖర్చులే ప్రధాన కారణం అని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. సోయా, నూకలు, మొక్కజొన్నపొడి తదితర దాణా కిలోకు రూ.50కి తక్కువ లేకపోవడంతో ధరను పెంచాల్సి వస్తోందని అంటున్నారు. దీనికితోడు మన దగ్గర ఉత్పత్తి అయిన గుడ్డు బయటి ప్రాంతాలకు ఎగుమతి అవుతుండడంతో ఇక్కడ కొరత ఏర్పడి ధరల పెరుగుదలకు మరో కారణమయ్యాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో చికెన్‌తో పాటు గుడ్డు ధరలు కూడా తగ్గుముఖం పడుతాయి. దీనికి విరుద్ధంగా డిసెంబర్‌లో గరిష్టంగా రూ.5కు చేరింది. అయినప్పటికీ ఈ ధర తమకు గిట్టుబాటు కావడం లేదని.. రిటైల్ వ్యాపారులకే లాభం చేకూరుతోందని పౌల్ట్రీ వ్యాపారులు వాపోతున్నారు.
Advertisement