ఖమ్మం కల్చరల్, న్యూస్‌లైన్: ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు జిల్లాలో ముస్లిం సోదరులు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని గ్రామ,గ్రామాన ఉన్న మసీదులు, ముఖ్యమైన ఈద్గాల వద్ద రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఖమ్మం నగరంలో వందలాది ఏళ్ల చరిత్రకల గాంధీచౌక్‌లోని ఈద్గావద్ద వేలాదిమంది ముస్లిం లు ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఈద్గాకు సదర్‌గా వ్యవహరిస్తున్న నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో రంజాన్ ప్రార్థనలకోసం తగిన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని అతిపెద్దదైన మీనార్ కలిగిన ఖమ్మం ఖిల్లాలోని మజీద్-ఎ-నిమ్రాలో వేలాది మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మజీద్-ఎ-నిమ్రా అధ్యక్షులు వాహెద్‌హుస్సేన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ప్రార్థనలకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరంలోని 45 మసీదులలో భారీ సంఖ్యలో రం జాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఫిత్రా సొమ్ముకోసం ఈద్గాలు, మసీదుల వద్ద పెద్ద సంఖ్యలో యాచకులు ఎదురుచూశారు. ఖమ్మం సమీపంలోని గొల్లగూడెం ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనలలో భారీ సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ నేత పొంగులేటిశ్రీనివాసరెడ్డి ఈద్గాను సందర్శించి ప్రార్థనల్లో పా ల్గొన్నారు. ఆయన ముస్లింసోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అడిషనల్ ఎస్‌పి తఫ్సీర్ ఇక్బాల్ పలువురు ప్రముఖులు ఇక్కడ నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు.
వెల్లివిరిసిన సోదరభావం
రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలు తమ ఇంటికి బంధువులు, స్నేహితులను, ఇరుగుపొరుగును ప్రత్యేకంగా ఆహ్వానించి పాయసం అందించారు. కుల మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో నగరవాసులు ముస్లిం సోదరుల ఇళ్లకువెళ్లి ఈద్‌ముబారక్ తెలిపారు. అందరూ కలసి పాయసం సేవించారు. అంతటా పండుగ వాతావరణం, సోదరభావం వెల్లివిరిసింది.
అందరూ సుఖంగా ఉండాలి
మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన పార్థనల సందర్భంగా మత పెద్దలు సందేశమిస్తూ విశ్వ మానవాళి సుఖ, సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గాంధీచౌక్ లోని ఈద్గా వద్ద ఇమాం మౌలానా సఫ్దర్జ్రా ప్రసంగిస్తూ మహ్మద్ ప్రవక్త ద్వారా సర్వశక్తి వంతుడైన అల్లాహ్ ప్రపంచ శాంతికోసం పంపిన సందేశాన్ని వినిపించారు. ప్రపంచంలోని ముస్లింలు మాత్రమే కాక అన్ని జాతులు, మతాల వారు ఆనందంగా ఉండటానికి వీలుగా కరుణ చూపాలంటూ అల్లాహ్‌ను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ అబ్దుల్ రెహ్మాన్, సయ్యద్‌బుడన్‌సాహెబ్, సయ్యద్ సిరాజుద్దీన్, అహ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. జైన్-ఉల్-అబిదిన్ మసీదులో నిర్వహించిన ప్రార్థనల్లో ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్‌అసద్, గ్రామీణవైద్యుల సంఘ జిల్లా మైనారిటీ నేత నూర్‌అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని ప్రముఖ మసీదులైన కమాన్‌బజార్‌లోని జమా మసీదులో ఇమాం సయ్యద్ అబ్దుల్ అజీజ్, కుతుబ్ షాహి మసీదులో ఇమాం మహ్మద్ సుబూర్, గాంధీచౌక్ లోని ఈద్గా వద్ద ఇమాం మౌలానా సఫ్దర్జ్రా,మజీద్ ఖ్వాసాలో హఫీజ్ మహ్మద్ అహ్మద్ ముస్లిం సోదరులతో ప్రత్యేక నమాజ్‌లు చేయించారు. మార్కెట్ మసీదు, బికె బజార్‌లోని జైన్-ఉల్-అబిదిన్ మసీదు, నిజాంపేట మసీదు, శుక్రవారపేటలోని తబేలా మసీదు, కస్బా బజార్‌లోని ఖాజీపుర మసీదు, ప్రభాత్ టాకీస్ సమీపంలోని గంధేషహీద్ మసీదు, కాల్వొడ్డులోని మోతి మసీదు, పాకబండ బజార్, ముస్తాఫానగర్, బుర్హాన్‌పుర తదితర ప్రాంతాలలోని మసీదులలో వేలాది మంది రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
నేటినుంచి 6రోజులు
ఉపవాస దీక్షలు
ఇస్లాం సాంప్రదాయం ప్రకారం రంజాన్ పర్వదినం మరుసటిరోజు (షవ్వాల్ నెల రెండవ రోజు) నుంచి 6 రోజుల పాటు ఉపవాసదీక్షలను ముస్లింలు పాటిస్తారు. అయితే రంజాన్ నెలలో రోజాను ముస్లింలందరూ ఖచ్చితంగా పాటిస్తారు. రంజాన్ పండగ రోజు అనంతరం షవ్వాల్‌లో పాటించే ఈ ఉపవాసాలను మాత్రం ఆరోగ్యం ఇతర పరిస్థితుల దృష్ట్యా వీలయిన వారు పాటిస్తారు.
ఘనంగా ఈద్-ఉల్-ఫితర్
Published Sat, Aug 10 2013 3:37 AM | Last Updated on Thu, Jul 11 2019 6:18 PM
Advertisement
Advertisement