ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు 8 నామినేషన్లు!
⇒ వైఎస్సార్‌సీపీ తరఫున గంగుల, ఆళ్లనాని
⇒ లోకేశ్‌తో దగ్గరుండి నామినేషన్ వేయించిన బాలకృష్ణ
⇒ నేటితో ముగియనున్న గడువు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలకు సోమవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.సత్యనారాయణ వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ తరఫున గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) దాఖలు చేశారు. ప్రభాకర్‌రెడ్డి సతీమణి గంగుల ఇందిరారెడ్డి కూడా డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వీరివెంట శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ఆర్.కె.రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు గంటా మురళీ, తానేటి వనిత, తెల్లం బాలరాజు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు.
టీడీపీ తరఫున పోటీ చేస్తున్న నారా లోకేశ్‌ను ఆయన మామ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వయంగా పిలుచుకొచ్చి నామినేషన్ వేయించారు. లోకేశ్ వెంట ఉప ముఖ్యమంత్రులు కె.ఈ.కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావ్ ఉన్నారు. అనంతరం బచ్చుల అర్జునుడు, పోతుల సునీత, కరణం బలరామకృష్ణ మూర్తి, డొక్కా మాణిక్య వరప్రసాదరావు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేసేందుకు మంగళవారంతో గడువు ముగియనుంది.
పదవి రావడానికి అన్నీ కలిసొచ్చాయి: నారా లోకేశ్
ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీకి, కార్యకర్తలకు సేవచేస్తున్న తనను గుర్తించి ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసినందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా నని లోకేశ్ చెప్పారు. ఎమ్మె ల్సీలుగా టీడీపీ తరఫున నామినేషన్ వేసిన కరణం బలరామకృష్ణమూర్తి, పోతుల సునీత, డొక్కా మాణిక్య వరప్రసాదరావు, బచ్చుల అర్జునుడుతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావుతో కలసి సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద లోకేశ్ మాట్లాడారు. తనకు ఎమ్మెల్సీ పదవి రావడానికి అన్నీ కలిసొచ్చాయని చెప్పారు. యువత విభాగం కింద తనకు అవకాశం లభించినట్లు తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పిన విధంగా నూరుశాతం నిరుద్యోగ భృతి హామీని అమలు చేస్తామని చెప్పారు. కాగా, వెలగపూడి సచివాలయంలోకి సోమవారం తొలిసారి ప్రవేశించిన నారా లోకేశ్ తికమకకు గురయ్యారు.