జిల్లాలో వేర్వేరు చోట్ల ఎనిమిది మంది మృతి
Published Fri, Sep 13 2013 3:30 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాల్లో విధి విషాదాన్ని నింపింది. పిడుగుల రూపంలో విరుచుకుపడిన మృత్యువు ఎనిమిది మందిని బలిగొంది. వరినాట్లు వేస్తుండగా ఒకరు, పశువుల పొట్ట నింపేందుకు గడ్డి కోస్తుండగా మరొకరు, చేలో మందుచల్లుతూ ఒకరు, మిరప మొక్కలు నాటుతుండగా మరొకరు..పొట్టకూటి కోసం వలస వచ్చి పొలం పనులు చేస్తున్న మహిళలపై ప్రకృతి తన ప్రతాపాన్ని చూపింది. నిట్ట నిలువునా పొట్టన పెట్టుకుంది. ఉన్నపళంగా ఉసురు తీసింది. పలువురిని గాయపర్చింది. ఆయా కుటుంబాల్లో తీరని వ్యథను మిగిల్చింది.
ముప్పాళ్ళ/అచ్చంపేట/నాదెండ్ల/రొంపిచర్ల/పెదకూరపాడు, న్యూస్‌లైన్ : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా విశ్రమించలేదు ఆ రైతు కూలీలు.. నిలువెల్లా తడుస్తూనే పొలం పనుల్లో మునిగిపోయారు.. చలికి వణుకుతూనే శ్రమిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడి వానకు కన్నుకుట్టింది. పిడుగు రూపంలో కూలీలను బలిగొంది. పని చేస్తూనే కూలీలు ప్రాణాలు విడిచారు. జిల్లాలోని ముప్పాళ్ల, అచ్చంపేట, నాదెండ్ల, రొంపిచర్ల, పెదకూరపాడు మండలాల్లో గురువారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలేనికి చెందిన తేలుకుట్ల వెంకటేశ్వర్లు అలియాస్ లింగమయ్య స్వామి(50) కుటుంబసభ్యులు, కొందరు కూలీలతో కలిసి వరినాటు వేసేందుకు గురువారం ఉదయం పొలానికి వెళ్లాడు. నాటు వేస్తుండగా నెత్తిన పిడుగు పడటంతో వెంకటేశ్వర్లు అక్కడికి అక్కడే మృతిచెందాడు. భార్య సుబ్బులు, కుమారుడు ఏడుకొండలు, మరో మహిళ వెంకట రంగమ్మలు పిడుగుపాటుకు షాక్‌కు గురయ్యారు. కాళ్లు, చేతులు కదపలేని స్థితిలో అచేతనంగా ఉన్న వీరిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నార్నెపాడులో గ్రామంలో గడ్డి కోస్తున్న యార్లగడ్డ మంగాయమ్మ(45), బొల్లవరం గ్రామంలో వరిచేలో మందు చల్లుతున్న రైతు కళ్ళం అర్జునారెడ్డి (45) పిడుగుపాటుకు మరణించారు. అర్జునారెడ్గి వెంట ఉన్న మరో ముగ్గురు స్వల్పంగా గాయపడగా వారిని నరసరావుపేట ఆస్పత్రికితరలించారు. పొట్టకూటి కోసం వలస వచ్చి తురకపాలెం గ్రామంలో కూలి పనులు చేస్తున్న భూపతి సుధ (22) గురువారం మధ్యాహ్నం పిడుగుపాటుకు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో గాయపడిన ఆమె భర్త రవి, మరో మహిళ కోనాల రాగేలు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బతుకుతెరువు కోసం కృష్ణా జిల్లా కలదిండి మండలం, కోరుకొల్లు గ్రామం నుంచి వచ్చిన కూలీల్లో సుధ ఒకరు. ఉపాధి కోసం ఇంత దూరం వస్తే తన భార్యను ఆ దేవుడు దూరం చేశాడంటూ రవి విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. దమ్మాలపాడు గ్రామంలో పిడుగుపాటుకు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో గ్రామానికి చెందిన సూరంశెట్టి రమణమ్మతోపాటు, పశ్చిమగోదావరి జిల్లా ఆలంపూడి వాటసులు పోట్రోలు వెంకమ్మ, దోనాది దుర్గ ఉన్నారు. వీరిని నరసరావుపేటకు చికిత్స నిమిత్తం తరలించారు. స్థానిక ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పిడుగుపాటుకు చనిపోయిన వారి మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. గాయపడిన వారిని పరామర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు చాగంటివారిపాలెం గ్రామంలో తేలుకుట్ల వెంకటేశ్వర్లు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
మిరప మొక్కలు నాటేందుకు వె ళ్లి..
అచ్చంపేట మండలం నిండుజర్లలో పిడుగుపాటుకు మహిళ మృతి చెందగా మరో 16 మందికి తీవ్రంగా గాయపడ్డారు. మృతురాలి భర్త సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తోకల గంగయ్య పొలంలో మిరప నారు వేసేందుకు 25 మందిగల ముఠా వెళ్లారు. మొక్కలు నాటుతుండగా మధ్యాహ్నం 2గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ప్రారంభమైంది. కూలీలు సమీపంలోని వేపచెట్టు కిందకు వెళ్లారు. కొద్దిసేపటికి చెట్టుపై పిడుగు పడటంతో యడవల్లి సాంబ్రాజ్యం (52) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందింది. షాక్‌తో సృహతప్పిన వారిని, గాయపడిన వారిని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో తోకల పద్మ, కుందరు శివపార్వతిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
జమ్మిచెట్టు కిందకు వెళ్లి..
నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన రైతు వీరగంధం శ్రీనివాసరావు (43), బండారుపల్లి ధనలక్ష్మిలు గురువారం ఉదయాన్నే కనపర్తి డొంకరోడ్డు వద్ద గల తమ పొలంలో వరినాట్లు వేసుకునేందుకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో భారీవర్షం ప్రారంభమైంది. ఇద్దరూ సమీపంలోని జమ్మిచెట్టు కిందకు చేరారు. చెట్టుపై పిడుగు పడటంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందగా, ధనలక్ష్మికి గాయాలయ్యాయి. గమనించిన తోటి రైతులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ సాంబశివరావు కేసు నమోదు చేశారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదేవిధంగా రొంపిచర్ల మండలంలోని విప్పర్ల గ్రామానికి చెందిన షేక్ పమిడిమర్రి దరియాసాహేబ్(40) పొలంలోని నారుమడి వద్ద ఉన్నాడు. ఈసమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం వచ్చి పిడుగుపడటంతో మృతి చెందాడు.
పెదకూరపాడుకు చెందిన పాగల్లు సాగర్‌బాబు(23) గురువారం ఉదయం తమ పొలాల్లోని మిర్చినారు మడిలో కలుప తిసేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో పిడుగుపాటుకు గురై అక్కడక్కడే మృతి చెందాడు. రాత్రి 9 గంటలు దాటినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లి స్థానికులకు చెప్పగా.. కొందరు యువకులు నారుమడి వద్దకు వెళ్లారు. అక్కడ సాగర్‌బాబు మృతదే హాన్ని గుర్తించారు.
Advertisement
Advertisement