వృద్ధురాలిపై దౌర్జన్యం చేస్తున్న దృశ్యం
నెల్లూరు(వీఆర్సీసెంటర్) : తమకు విక్రయించిన స్థలంలో పాకా వేసిందనే నెపంతో ఓ వృద్ధురాలిపై తల్లి, కొడుకు దౌర్జన్యం చేసిన ఘటన నగరంలోని 53వ డివిజన్ గాంధీగిరిజనకాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు..గాంధీగిరిజన కాలనీకు చెందిన పసుపులేటి శేషమ్మ తనకు చెందిన స్థలంలో పాకా వేసుకుంటుండగా, అదే ప్రాంతానికి చెందిన కట్టా మంజుల తన కుమారుడితో కలిసి వచ్చి పాకాను పీకివేశారు. శేషమ్మ 14 ఏళ్ల క్రితం కట్టా మంజుల వద్ద రూ.10వేలు అప్పుగా తీసుకుంది. అప్పట్లో ఓ కాగితంపై వేలిముద్ర వేయించుకుని స్థలాన్ని ఆక్రమించారని వృద్ధురాలు చెబుతోంది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు.
పక్షవాతానికి గురైన కుమారుడితో కలిసి ఉండేందుకు శుక్రవారం స్థలంలో చిన్నపాకను వేసుకోబోగా దౌర్జన్యంగా పీకివేశారని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. కాగా తమకు 14 ఏళ్ల క్రితమే ఇంటి స్థలాన్ని శేషమ్మ విక్రయించిందని, తమ వద్ద శేషమ్మతో పాటు ఆమె ఇద్దరి కొడుకులు సంతకాలు చేసిన కాగితాలు ఉన్నాయని మంజుల చెబుతోంది. అయితే శేషమ్మ రెండో కొడుకు శ్రీనుకు పక్షవాతంతో కాళ్లు, చేతులు పడిపోయాయని, సంతకం పెట్టడం కూడా రాదని, అలాంటప్పుడు ఎలా సంతకం చేశాడని స్థానికులు అనుమానాలు వ్వక్తం చేస్తున్నారు. వివాదాన్ని పోలీసుల దృష్టికి తీసుకుపోకుండా వృద్ధురాలిపై అమానుషంగా ప్రవర్తించడంపై స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment