quarrelling
-
వృద్ధురాలిపై దౌర్జన్యం
నెల్లూరు(వీఆర్సీసెంటర్) : తమకు విక్రయించిన స్థలంలో పాకా వేసిందనే నెపంతో ఓ వృద్ధురాలిపై తల్లి, కొడుకు దౌర్జన్యం చేసిన ఘటన నగరంలోని 53వ డివిజన్ గాంధీగిరిజనకాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు..గాంధీగిరిజన కాలనీకు చెందిన పసుపులేటి శేషమ్మ తనకు చెందిన స్థలంలో పాకా వేసుకుంటుండగా, అదే ప్రాంతానికి చెందిన కట్టా మంజుల తన కుమారుడితో కలిసి వచ్చి పాకాను పీకివేశారు. శేషమ్మ 14 ఏళ్ల క్రితం కట్టా మంజుల వద్ద రూ.10వేలు అప్పుగా తీసుకుంది. అప్పట్లో ఓ కాగితంపై వేలిముద్ర వేయించుకుని స్థలాన్ని ఆక్రమించారని వృద్ధురాలు చెబుతోంది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు. పక్షవాతానికి గురైన కుమారుడితో కలిసి ఉండేందుకు శుక్రవారం స్థలంలో చిన్నపాకను వేసుకోబోగా దౌర్జన్యంగా పీకివేశారని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. కాగా తమకు 14 ఏళ్ల క్రితమే ఇంటి స్థలాన్ని శేషమ్మ విక్రయించిందని, తమ వద్ద శేషమ్మతో పాటు ఆమె ఇద్దరి కొడుకులు సంతకాలు చేసిన కాగితాలు ఉన్నాయని మంజుల చెబుతోంది. అయితే శేషమ్మ రెండో కొడుకు శ్రీనుకు పక్షవాతంతో కాళ్లు, చేతులు పడిపోయాయని, సంతకం పెట్టడం కూడా రాదని, అలాంటప్పుడు ఎలా సంతకం చేశాడని స్థానికులు అనుమానాలు వ్వక్తం చేస్తున్నారు. వివాదాన్ని పోలీసుల దృష్టికి తీసుకుపోకుండా వృద్ధురాలిపై అమానుషంగా ప్రవర్తించడంపై స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
రోగితో డాక్టర్ అసభ్య ప్రవర్తన..చితకబాదిన స్థానికులు
-
అసభ్య డాక్టర్‌కు దేహశుద్ధి
లబ్బీపేట (విజయవాడ తూర్పు): వైద్యం కోసం బిడ్డను తీసుకువచ్చిన తల్లిని వేధింపులకు గురిచేశాడో వైద్యుడు. రాత్రివేళల్లో ఫోన్లు చేస్తూ, అసభ్య మెసేజ్‌లు పంపుతూ హింసించాడు. డాక్టర్ చేష్టలతో విసుగెత్తిన ఆమె.. తన కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. ఆమె భర్త, బంధువులు ఆస్పత్రికి వచ్చి ఆ వైద్యుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. విజయవాడలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు.. జాతీయ ఆరోగ్య కార్యక్రమమైన రాష్ట్రీయ బాల స్వాస్థ్య (ఆర్బీఎస్) విభాగాన్ని ఇక్కడి పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఆర్బీఎస్లో భాగమైన డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్(డీఈఐసీ)ను పిల్లల ఓపీ విభాగంలో నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్‌కు ‘డౌన్ సిండ్రోమ్’తో పుట్టిన తన బిడ్డకు వైద్యం చేయించేందుకు విజయవాడ చిట్టినగర్‌కు చెందిన ఓ మహిళ కొంతకాలంగా డీఈఐసీకు వస్తోంది. పాపకు పరీక్షలు చేస్తూ డాక్టర్ ఇమ్రాన్ తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంతేకాక ఆమె ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టడం, రాత్రివేళల్లో ఫోన్ చేసి విసిగించడం లాంటివి చేసేవాడు. రోమియో వైద్యుని చేష్టలకు ఆ మహిళ విసిగిపోయి బంధువులకు విషయాన్ని చెప్పింది. దీంతో వారు డాక్టర్‌ను పట్టుకొని దేహశుద్ధి చేశారు. వచ్చిన 20 రోజులకే: డాక్టర్ ఇమ్రాన్ కృష్ణా జిల్లా గంపలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్టు వైద్యునిగా పనిచేసే వాడు. విజయవాడలోని పాఠశాలల్లో వైద్య పరీక్షలతో పాటు, డీఈఐసీలో పోస్టు ఖాళీగా ఉండటంతో గత నెల 18న ఆయన్ని ఇక్కడ నియమించారు. విధుల్లో చేరి 20 రోజులు కాకముందే వివాదంలో చిక్కుకున్నారు. -
చింతాడలో భగ్గుమన్న పాతకక్షలు
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం చింతాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన వారి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ క్రమంలో గ్రామ సర్పంచి రామచంద్రనాయుడు, మాజీ సర్పంచి కళావతి రెండు వర్గాలుగా విడిపోయారు. శుక్రవారం ఉదయం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రెండు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. ఆ దాడిలో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిపై ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్‌కు చేరి ఒక వర్గంపై మరో వర్గం కేసులు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాబు ప్రోత్సాహంతోనే బీజేపీ కార్యకర్తలపై దాడులు
అనంతపురం: అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు, బీజేపీ నాయకుల మధ్య వర్గ పోరు మరో సారి బయటపడింది. అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం కుర్లపల్లిలో బీజేపీ ప్రచారరధంపై ముగ్గురు టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో బీజేపీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు సదరు పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల తీరును బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, అంకాల్రెడ్డిలు తప్పు పట్టారు. దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అందుకు పోలీసులు ససేమిరా అనడంతో బీజేపీ నేతలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతోనే బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.