అనంతపురం: అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు, బీజేపీ నాయకుల మధ్య వర్గ పోరు మరో సారి బయటపడింది. అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం కుర్లపల్లిలో బీజేపీ ప్రచారరధంపై ముగ్గురు టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో బీజేపీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు సదరు పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.
అయితే పోలీసుల తీరును బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, అంకాల్రెడ్డిలు తప్పు పట్టారు. దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అందుకు పోలీసులు ససేమిరా అనడంతో బీజేపీ నేతలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతోనే బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.