
లబ్బీపేట (విజయవాడ తూర్పు): వైద్యం కోసం బిడ్డను తీసుకువచ్చిన తల్లిని వేధింపులకు గురిచేశాడో వైద్యుడు. రాత్రివేళల్లో ఫోన్లు చేస్తూ, అసభ్య మెసేజ్‌లు పంపుతూ హింసించాడు. డాక్టర్ చేష్టలతో విసుగెత్తిన ఆమె.. తన కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. ఆమె భర్త, బంధువులు ఆస్పత్రికి వచ్చి ఆ వైద్యుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. విజయవాడలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు.. జాతీయ ఆరోగ్య కార్యక్రమమైన రాష్ట్రీయ బాల స్వాస్థ్య (ఆర్‌బీఎస్) విభాగాన్ని ఇక్కడి పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.
ఆర్‌బీఎస్‌లో భాగమైన డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్(డీఈఐసీ)ను పిల్లల ఓపీ విభాగంలో నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్‌కు ‘డౌన్ సిండ్రోమ్’తో పుట్టిన తన బిడ్డకు వైద్యం చేయించేందుకు విజయవాడ చిట్టినగర్‌కు చెందిన ఓ మహిళ కొంతకాలంగా డీఈఐసీకు వస్తోంది. పాపకు పరీక్షలు చేస్తూ డాక్టర్ ఇమ్రాన్ తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంతేకాక ఆమె ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టడం, రాత్రివేళల్లో ఫోన్ చేసి విసిగించడం లాంటివి చేసేవాడు. రోమియో వైద్యుని చేష్టలకు ఆ మహిళ విసిగిపోయి బంధువులకు విషయాన్ని చెప్పింది. దీంతో వారు డాక్టర్‌ను పట్టుకొని దేహశుద్ధి చేశారు.
వచ్చిన 20 రోజులకే: డాక్టర్ ఇమ్రాన్ కృష్ణా జిల్లా గంపలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్టు వైద్యునిగా పనిచేసే వాడు. విజయవాడలోని పాఠశాలల్లో వైద్య పరీక్షలతో పాటు, డీఈఐసీలో పోస్టు ఖాళీగా ఉండటంతో గత నెల 18న ఆయన్ని ఇక్కడ నియమించారు. విధుల్లో చేరి 20 రోజులు కాకముందే వివాదంలో చిక్కుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment