
సాక్షి, అమరావతి: ఎక్కువమంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనేలా కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పోలింగ్ సమయాన్ని పెంచింది. ఈ నెల 11న రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న పోలింగ్ ఏకంగా 11 గంటల పాటు కొనసాగుతుంది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సా. 5 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ఓటర్లు సాయంత్రం పూట ఓటింగ్‌కు వచ్చేందుకు అసక్తి చూపిస్తారనే ఉద్దేశంతో ఈ సారి సా. 6 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు మార్చి 18న కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
ఏజెన్సీ ప్రాంతమైన ఆరకు లోక్‌సభ పరిధిలోని అరకు వ్యాలీ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. గిరిజన ప్రాంతాల నుంచి ఈవీఎంలు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సమయం పట్టనుండటంతో ఎన్నికల కమిషన్ ఇక్కడ పోలింగ్ సమయాన్ని గంట తగ్గించింది. ఇక మిగతా 24 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు వాటి పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
477 అదనపు పోలింగ్ కేంద్రాలు: పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా రాష్ట్రంలో 477 అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45, 920 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, కొత్తగా 25 లక్షల ఓటర్లు పెరగడంతో ఈ అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్ల తెలిపారు. ఆదివారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో అత్యధికంగా 121 పోలింగ్ కేంద్రాలు పెరగ్గా, విజయనగరం జిల్లాలో ఒక్క పోలింగ్ కేంద్రం కూడా పెరగలేదన్నారు. ఏప్రిల్ 7 వరకు ఓటరు కార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ 70 శాతం పూర్తయిందని, బ్యాలెట్ పేపర్లను ఆయా నియోజకవర్గాలకు పంపిస్తున్నట్లు తెలిపారు.
హైకోర్టు న్యాయమూర్తులతో సమావేశం: ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరును సోమవారం సాయంత్రం 4 గంటలకు హైకోర్టు న్యాయమూర్తులకు వివరించనున్నట్లు ద్వివేది తెలిపారు. ఇందుకోసం కేంద్ర ఈవీఎంల సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యుడు డి.టి.సహాని వస్తున్నట్లు తెలిపారు.