సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్ర విభజన అంశం, రాజకీయ పరిస్థితులు.. ఎలా ఉన్నా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం(ఈసీ) తన పని తాను చేసుకుపోతోంది. 2014 సాధారణ ఎన్నికల లోపు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కానందున పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకీ ఎన్నికలు జరుపుతామని ఇటీవలే ప్రకటించింది.
ఈ మేరకు జిల్లా యంత్రాంగాన్ని అ ప్రమత్తం చేసింది. ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడి నా ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించింది. ఫిబ్రవరి 14లోగా జిల్లాలో మూడేళ్లు పూర్తి చేసుకున్న పోలీసు, రెవెన్యూ, పంచాయతీ తదితర శాఖల అధికారులను బదిలీ చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో 35మంది ఎస్‌ఐలతో పాటు పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. ఐదుగురు ఉన్నతాధికారులతో పాటు 46 మంది తహశీల్దార్‌ల బదిలీ జాబితా నేడో రేపో వెలువడనున్నట్లు సమాచారం. ఓ వైపు బదిలీలు... మరోవైపు ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలపై అధికారులు ఆరా తీస్తుండటంతో జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది.
శాంతిభద్రతలే కీలకం
పోలీసు యంత్రాంగం అధికారుల బదిలీలు చేపడూతూనే గ్రామాల్లో శాంతిభద్రతలపై దృష్టి సారించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీకి ఓ ప్రశ్నావళిని పంపిన ఎన్నికల సంఘం నివేదిక సమర్పించాలని సూచించినట్లు సమాచారం.
2009 సార్వత్రిక ఎన్నికలు రెండు విడతల్లో జరుగగా జిల్లావ్యాప్తంగా ఎన్ని బైండోవర్లు చేశారు.. రౌడీషీటర్లు ఎంతమంది ఉన్నారు.. ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులెన్ని.. వీటిలో ఎన్ని కేసులు పరిష్కారమయ్యాయి.. ఎంతమందికి ఆయుధ అనుమతులున్నాయి.. తదితర వివరాలను పూర్తిస్థాయిలో ఇవ్వాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్పీ తరుణ్‌జోషి సమాచార సేకరణ బాధ్యతలను ఆయా సబ్ డివిజన్ల పరిధిలోని డీఎస్పీలకు అప్పగించినట్లు తెలిసింది. గ్రామానికి ఇద్దరు కానిస్టేబుళ్ల చొప్పున పంపి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదివరకే తమవద్ద ఉన్న అంశాలను ఎన్నికల సంఘానికి పంపినా వచ్చే ఎన్నికల్లో శాంతిభద్రతల అంశమే కీలకం కావడంతో మరో తాజాగా నివేదిక సిద్ధం చేస్తున్నారు.
నేడో రేపో అధికారుల బదిలీలు
భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాస్థాయిలో అధికారుల బదిలీలకు పచ్చజెండా ఊపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్.8తో కూడిన ఉత్తర్వులు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీకే మహంతి పేరు మీదుగా విడుదల కాగా, ఇప్పటికే 35 మంది ఎస్‌ఐలతో పాటు పలువురు ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. మూడేళ్లు పూర్తయిన జిల్లా జాయింట్ కలెక్టర్ హర్షవర్దన్, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్, ఎన్‌వైకే కో-ఆర్డినేట్ రాంచందర్‌లతో పాటు ఐదుగురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడే అవకాశం ఉంది.
అలాగే మూడేళ్లు పూర్తయిన 44 మంది తహశీల్దార్లు, తొమ్మిది మంది పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లతో పాటు పలువురికి నల్గొండ, మెదక్ జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు బదిలీల కసరత్తును పూర్తి చేసిన ఉన్నతాధికారులు నేడో రేపో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని తెలిసింది. ఇందుకోసం గత ఏడాది మే 17న బదిలీలపై విధించిన నిషేధాన్ని సైతం పాక్షికంగా ఎత్తివేశారు.
బదిలీలకు నిర్దేశించిన మార్గదర్శకాలు..
ఎన్నికలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధముండే అధికారులు ఎవరూ తమ సొంత జిల్లాలో పని చేయడానికి వీలులేదు.
డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డీఎస్పీలు, సీఐలు ఈ ఉత్తర్వుల పరిధిలోకి వస్తారు.
ఎస్‌ఐ స్థాయి అధికారులు తమ సొంత నియోజకవర్గంలో పనిచేయడానికి వీలులేదు.
ఈ ఏడాది మే 31నాటికి మూడేళ్లు నిండిన అధికారులు సైతం ఆ నియోజకవర్గంలో కొనసాగవద్దు.
వచ్చే ఆరు నెలల్లో పదవీ విరమణ చేసే అధికారులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది.
{పస్తుతం కోర్టు కేసులు ఉన్న అధికారులు, గత ఎన్నికల్లో క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నవారు ఈసారి విధులకు దూరంగా ఉండాలి.