
వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై ఎన్నికల కమిషన్ ఆరా తీసింది. హత్యకు దారితీసిన కారణాలేమితో తెలుసుకోవాలని అధికారులను ఆదేశించింది.
సాక్షి, అమరావతి : కర్నూలు, కడప జిల్లాల్లో జరిగిన పరిణామాలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై ఈసీ ఆరా తీసింది. హత్యకు దారితీసిన కారణాలేమిటో తెలుసుకోవాలని అధికారులను ఆదేశించింది. కడప జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది పరిస్థితిని సమీక్షించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని పోలీసులను ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాయలసీమ జిల్లాల్లో శాంతిభద్రతలపై ఆయా జిల్లాల ఎస్పీలతో సమీక్షించారు. అలాగే కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరిగిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గన్‌మెన్ కాల్పులు ఘటనపై ఆయన నివేదిక కోరారు.
ఇదిలాఉండగా.. తన చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుంటే ఎందుకు సీబీఐ విచారణకు భయపడుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ శనివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో పాటు, రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల అంశంపై గవర్నర్ నరసింహన్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారు.