సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత ప్రభుత్వం 15 పంచాయతీలను హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో విలీనం చేసిన విధానంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది.అసంతృప్తి, అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి రెండు రోజుల కిందట లేఖ రాశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశాక పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేయడంవల్ల తమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టారని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలుపుదల(అబయన్స్) చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. గతంలో పలు గ్రామ పంచాయతీలను పురపాలక సంఘాలు, సంస్థల్లో విలీనం చేస్తామని చెప్పినప్పుడు వాటికి ఎన్నికలు జరగకుండా ఆపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
గ్రేటర్‌పరిధిలో గ్రామ పంచాయతీల విలీనానికి సంబంధించి ఎన్నికల సంఘం ఆగస్టు 12, 23 తేదీల్లో ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించలేదని తప్పుపట్టారు. ఈలోగా ఈ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదంటూ కొందరు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తమ దృష్టికి రాగానే పంచాయతీరాజ్, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులతో సమావేశం నిర్వహించి.. పరిస్థితిని వివరించామని వీలైనంత త్వరగాా విలీన ప్రక్రియ ముగించాలని చెప్పామని పేర్కొన్నారు. సెప్టెంబర్2లోగా విలీన ప్రక్రియ పూర్తి చేయాలని వారికి గడువు విధించినట్లు ఆ లేఖలో స్పష్టం చేశారు. రెండో తేదీన ఒకటిన్నర వరకు వేచి చూసి రంగారెడ్డి జిల్లాలో 14, మహబూబ్‌నగర్ జిల్లాలో 3 పంచాయతీలకు, ఆ మరుసటి రోజు రంగారెడ్డి జిల్లాలోని మరో రెండింటికి నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు.
ఆరో తేదీ నుంచి నామినేషన్లు దాఖలు చేయాల్సిన పరిస్థితుల్లో ఐదో తేదీ సాయంత్రం పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేస్తూ ఉత్తర్వులు వచ్చాయన్నారు. విలీనం చేసే అంశాన్ని కనీసం తెలియచేయలేదని ఆక్షేపించారు. ఎన్నికలకు తాము జారీ చేసిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకునే పరిస్థితుల్లోకి ప్రభుత్వం తమను నెట్టిందనే అభిప్రాయాన్ని ఎన్నికల సంఘం కమిషనర్ వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడానికే ఈ లేఖ రాస్తున్నట్లు ఎన్నికల సంఘం కమిషనర్ పేర్కొనడం గమనార్హం.
‘పంచాయతీల విలీనం’పై ఈసీ సీరియస్
Published Wed, Sep 11 2013 2:46 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
Advertisement
Advertisement