సాక్షి, కర్నూలు: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 23న పారదర్శకంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. రాజకీయ పార్టీలు ఈ నెల 19 తేదీ సాయంత్రంలోగా కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి అర్హత కలిగిన వారి పేర్లు ఇవ్వాలని సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఓట్ల లెకింపుపై గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి నియోజకవర్గానికి 20 టేబుళ్లు వినియోగిస్తున్నామని, ఇందులో పార్లమెంట్‌కు 10, అసెంబ్లీకి 10 ప్రకారం ఉంటాయన్నారు. వీటికి అదనంగా ఆర్‌వో టేబుల్ ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌కు 10 మంది, అసెంబ్లీకి 10 మంది ఏజెంట్లను నియమించుకునేందుకు ఈ నెల 19వ తేదీలోపు పేర్లు ఇవ్వాలని రాజకీయ పార్టీలకు సూచించారు. పార్లమెంట్‌కు మాత్రం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు అదనంగా నలుగురు ఏజెంట్లను పెట్టుకోవాలన్నారు. ఎలాంటి క్రిమినల్ కేసులు లేని వారినే ఏజెంట్లుగా నియమించుకోవాలని సూచించారు.
గంట ముందే
గంట ముందే కౌంటింగ్ కేంద్రానికి ఏజెంట్లు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు నేరుగా కౌంటింగ్ కేంద్రానికి రావచ్చని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, అగ్గిపెట్టెలను అనుమతించబోమని స్పష్టం చేశారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీ, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ ఏజెంట్లు వ్యవహరించాల్సి ఉందన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓటర్ల ఈటీపీబీఎస్‌ల లెక్కింపు జరుగుతుందని, తర్వాత కంట్రోల్ యూనిట్‌లోని ఓట్లను లెక్కిస్తామని తెలిపారు. కంట్రోల్ యూనిట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత వీవీప్యాట్‌ల స్లిప్‌లను లెక్కించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
రౌండ్ల వారీగా ఫలితాలు..
రౌండ్ల వారీగా ఫలితాలు ప్రకటించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 20,545 మంది ఉద్యోగులు ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో 19,404 మందికి జారీ చేశామని చెప్పారు. ఇప్పటి వరకు పార్లమెంట్‌కు 10,897 మంది, అసెంబ్లీకి 12,518 మంది ఓట్లు వేసి తిరిగి పంపారని పేర్కొన్నారు. మిగిలిన వారు పంపడానికి 23వ తేదీ ఉదయం 7 గంటల వరకు సమయం ఉందన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ ఏజెంట్లకు, సిబ్బందికి టీ, మంచి నీళ్లు, స్నాక్స్ ఇస్తామని, భోజన సదుపాయం ఉండదని చెప్పారు. సమావేశంలో డీఆర్‌వో వెంకటేశం, వైఎస్‌ఆర్‌సీపీ ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి, టీడీపీ ప్రతినిధి సత్రం రామకృష్ణుడు, కర్నూలు పార్లమెంట్ సీపీఎం అభ్యర్ధి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ర్యాండమైజేషన్ ద్వారా కౌంటింగ్ సిబ్బంది ఎంపిక
పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అవసరమైన సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ ఎంపిక చేశారు. సూక్ష్మ పరిశీలకులుగా 596 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లుగా 431 మంది, కౌంటింగ్ సూపర్ వైజర్లుగా 770 మందిని ఎంపిక చేశారు. సూపర్‌వైజర్లుగా గెజిటెడ్ అధికారులే ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు మాత్రం కౌంటింగ్ సూపర్‌వైజర్లతో పాటు అసిస్టెంట్లు కూడా గెజిటెడ్ అధికారులనే ఎంపిక చేయడం విశేషం. రెండో ర్యాండమైజేషన్ ద్వారా సూక్ష్మ పరిశీలకులు, ఓట్ల లెక్కింపు సిబ్బందిని నియోజక వర్గాలకు కేటాయిస్తారు. మూడో ర్యాండమైజేషన్ ద్వారా నియోజక వర్గాలకు కేటాయించిన సిబ్బందిని టేబుళ్లకు కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment