ఎన్నికల కాలం..! | Election period ..! | Sakshi
Sakshi News home page

ఎన్నికల కాలం..!

Published Sun, Mar 9 2014 4:01 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Election period ..!

సాక్షి, ఒంగోలు: ఎన్నికల జాతర మొదలైంది. రాజకీయ పదవుల కోసం ఇన్నాళ్లు ఉగ్గబట్టిన ఆశావహుల ‘కల’ నెరవేరే సమయం వచ్చింది. మున్సిపాలిటీలకు ఈనెల 30వ తేదీన, సార్వత్రిక ఎన్నికలు వచ్చేనెల 30న నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా నేడో,రేపో నోటిఫికేషన్ జారీకానుంది.
 
 ఇప్పటికే ఆయా స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఒకదాని వెంట ఒకటిగా ఎన్నికలు రానుండటంతో జిల్లాలో రాజకీయం పూర్తిస్థాయిలో వేడెక్కింది. వరుసగా వచ్చిపడుతున్న ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ అధికార యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రం విభజన నిర్ణయం నేపథ్యంలో వేగంగా మారిపోతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తి  రేకెత్తిస్తున్నాయి.
 
 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రీఫైనల్స్‌గా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈమేరకు ఆయా పార్టీలు తమ బలాబలాలను బేరీజు వేసుకుంటూ ‘పోరు’కు సమాయత్తమవుతున్నాయి. జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలకు, అదేవిధంగా జిల్లాలో 56 జెడ్పీటీసీ స్థానాలు, 790 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
 
 జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ ఓసీ జనరల్‌గా ప్రకటించగా, మిగతా స్థానాల రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలన్న చందంగా మున్సిపల్ ఎన్నికల్లో వార్డులకు కూడా ఆర్థిక, సామాజికవర్గాల సమీకర ణల కోణాల్లో అంచనాలు వేసుకుంటూ విజయావకాశాలను విశ్లేషించుకుంటున్నారు. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ఏపార్టీకి ఆపార్టీ రాష్ట్రస్థాయిలో వ్యూహాలు రూపొందించి జిల్లాస్థాయి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నాయి.
 
 ఈవిషయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ చురుగ్గా వ్యవహరిస్తుండగా, టీడీపీ, కాంగ్రెస్‌లు మాత్రం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక తలకుమించిన భారమైందని ఆ రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ నేతలు మాత్రం ఎటూ గెలుపుపై నమ్మకం లేనందున .. ఎవరొస్తే వారికి సీటివ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీటైన అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను అన్ని ప్రధాన పార్టీలు స్థానిక నాయకత్వానికే అప్పగించడంతో ఆశావహుల హడావుడి మొదలైంది. స్థానిక ఎన్నికలను కూడా పార్టీపరంగా నిర్వహిస్తుండటంతో పోటీకి సిద్ధపడుతున్న అభ్యర్థులు .. ప్రధాన పార్టీల తరఫున రంగంలోకి దిగితే పడే ఓట్లకు తమ వ్యక్తిగత పలుకుబడితో వచ్చే ఓట్లు కూడా తోడై గెలుపు సునాయాసమవుతుందని భావిస్తున్నారు. దీంతో మున్సిపల్ వార్డు పదవులకే అధికపోటీ నెలకొంది. ఒక్కోస్థానం నుంచి ఐదారుగురు టికెట్లు ఆశిస్తూ .. ఆయా పార్టీల నేతల ఇళ్లచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి మున్సిపల్ నామినేషన్ల స్వీకరణ మొదలుకానుండటంతో .. ఈరెండు మూడ్రోజుల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. ఆయా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎంపిక కమిటీలను నియమించి, ఇన్‌చార్జులను కూడా వేశారు.
 
 ఎన్నికల ఖర్చుపై లెక్కలు..
 ఎన్నికల్లో ప్రస్తుతం మద్యం, డబ్బు ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల్లో ఒక్కో అభ్యర్థికి సరాసరిన రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్లు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అదే విధంగా జెడ్పీచైర్మన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు సైతం వారి పరిధిని బట్టి ఎన్నికల ఖర్చు పెట్టాల్సిందే.. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.30 కోట్ల వరకు నగదు రూపంలో, మరో రూ.20 కోట్లు మద్యం రూపంలో , వివిధ పద్ధతుల్లో ఖర్చుచేయాల్సిన అవసరమొస్తుందని అంచనా వేస్తున్నారు. వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు తాజాపార్టీల నుంచి కూడా అభ్యర్థులు పోటీకి దిగితే జిల్లావ్యాప్తంగా ఎన్నికల వ్యయం రూ.200 కోట్లు మించుతుందని రాజకీయ వర్గాలు అంచనాలేస్తున్నాయి.
 
 చీరాల, మార్కాపురం మున్సిపాలిటీల్లో ఒక్కోఅభ్యర్థికి రూ.2 కోట్లు వ్యయమవుతుందని .. వాటిల్లో కొంతమొత్తాన్ని వార్డుల అభ్యర్థులు తమ గెలుపునకు భరించే అవకాశం ఉన్నప్పటికీ, మిగిలిన ఖర్చును చైర్మన్ అభ్యర్థే భరించాలి. ఎంత తక్కువ చూసుకున్నా ఒక్కో అభ్యర్థికి పైన పేర్కొన్న రెండుప్రాంతాల్లో సుమారు కోటి రూపాయలు ఖర్చు కాగలదని అంచనా. ఈమొత్తం సొమ్మును ఏవిధంగా భరించాలనే ఆలోచనతో టికెట్ ఆశిస్తున్న నేతలు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు వేస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల వ్యయం ఎమ్మెల్యే ఆశావహులపైనా పడింది.
 
 ఎమ్మెల్యే అభ్యర్థిత్వాల కోసం భారీస్థాయిలో ఆశావహులు బారులుతీరి ఉండటంతో సెమీఫైనల్స్‌గా భావిస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందడానికి వీలుగా ప్రధాన పార్టీలు ఈదిశగా కసరత్తు చేస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు అంగీకరించకుంటే, ఎమ్మెల్యే సీటు గల్లంతవుతుందని నేతలు భయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఎన్నికల వ్యయం ఇటు మున్సిపల్ ఆశావహుల్ని, అటు అసెంబ్లీ ఆశావహులను కలవరపరుస్తోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement