గరం గరం!
సాక్షి ప్రతినిధి, కడప: కడపంటే ముందే కడుపు మంట. దానికి తోడు ఎన్నికల్లో ఘోర పరాభవం. వెరసి చంద్రబాబుకు కోపం తీవ్రస్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా వైఎస్సార్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం మిగలడంతో టీడీపీ అధినేత ఇక్కడి నాయకులపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సహకార, పంచాయతీ ఎన్నిలు మొదలుకుని స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో సైతం వైఎస్సార్‌సీపీకే ప్రజలు పట్టం కట్టారు. వరుసగా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వెల్లడి కావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఆశించిన మేరకు కష్టపడలేదనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది. దానికి తోడు నివేదికలు తెప్పించుకుని మరీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల్లో ఎవరెవరు ఎలా పనిచేశారు? అభ్యర్థుల వైఫల్యాలు? వారి బలహీనతలు? రాష్ట్ర మంతా రుణ మాఫీ ప్రభావం ఉన్నా, ఇక్కడ ఎందుకు పనిచేయలేదు? రాజంపేటలో మాత్రమే ఎందుకు సక్సెస్ అయ్యాం. ఇలాంటి అంశాలపై కూలంకషంగా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద జిల్లా నేతల వైఫల్యం కారణంగానే తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని
మూటగట్టుకుందనే అంచనాకు వచ్చినట్లు సమచారం. బెడిసికొట్టిన జెడ్పీ, కార్పొరేషన్ వ్యవహారం... అధికారం వచ్చిందనే అత్యుత్సాహంతో జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు తగినంతమంది లేకపోయినా ఆ పీఠాలను కైవసం చేసుకోవాలని తెలుగుతమ్ముళ్లు ఆశించారు. జిల్లా నాయకుల అత్యుత్సాహం బెడిసికొట్టినట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇటీవల జెడ్పీ, కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీల పాలకమండళ్లను టీడీపీ వశపర్చుకుంటుందని బహిరంగంగా ప్రకటించారు.
పజాతీర్పుకు భిన్నంగా అనైతిక చర్యలకు పాల్పడుతున్న వైనా న్ని ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు ముఖ్యమంత్రి చం ద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ నివేదికలు అందించినట్లు తె లుస్తోంది. అధికారిక నివేదికలు, సీనియర్ నాయకులు సమర్పించిన నివేదికలు పరిశీలించిన అనంతరం జిల్లా నేతల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. రాజంపేటలో మేడా మల్లికార్జునరెడ్డి స్థాయిలో ఇతర నియోజకవర్గాల అభ్యర్థులు కష్టపడలేదనే అంచనాకు వచ్చినట్లు సమాచారం.
పధానంగా మరో నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల స్వయం కృతాపరాధంతోనే ఓడిపోయామనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ బాధ్యుడిగా గుర్తించిన నాయకుడు సైతం అంటీముట్టనట్లుగానే వ్యవహరించారనే అంచనాకు చంద్రబాబు వచ్చినట్లు సమాచారం. ఇవన్నీ పరిశీలించిన పిమ్మట వైఎస్సార్ జిల్లా నాయకులపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో నామినేటెడ్ పదవులు ఆశించేందుకు సైతం జిల్లా నేతలు జంకుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ఒకరిపై మరొకరు నివేదికలు, ఫిర్యాదు అధినేతకు అందించినట్లు తెలుస్తోంది.
అధినేతను మచ్చిక చేసుకునేందుకే..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును మచ్చిక చేసుకునే ఎత్తుగడల్లో జిల్లా నేతలు నిమగ్నమైనట్లు సమాచారం. అందులో భాగంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్‌ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకువచ్చేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్‌తో రాజీనామా చేయించడం వెనుక కూడా బలమైన కారణం ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు మంత్రివర్గంలో ఇదివరకూ సర్పంచ్ కూడా కాని వ్యక్తి నారాయణకు నేరుగా మంత్రి పదవి దక్కింది. ఆరునెలలలోపు నారాయణకు ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే పదవి కట్టబెట్టాల్సి ఉంది. ఇప్పట్లో ఎమ్మెల్యే అవకాశం లేదు. ఎమ్మెల్సీగా ఆరునెలల్లో భ ర్తీ చేసే ఛాన్సు కన్పించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పదవిలో ఉన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఆ పదవిని భర్తీ చేసే అవకాశం ఉంది. గవర్నర్ కోటా పదవి కాబట్టి విద్యాసంస్థల అధినేతగా నారాయణకు కట్టబెట్టేందుకు మార్గం సుగమం కానుంది. ఈ పాత్రను జిల్లా నేతలు సమర్థవంతంగా నిర్వర్తించారు. ఈ కారణంగానైనా అధినేత శాంతించే అవకాశం ఉంటుందనే భావనతో వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు సమాచారం. ఏమైనా జిల్లా పై, జిల్లాలోని తెలుగుతమ్ముళ్ల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.