ఎమ్మెల్యే వీరశివా దౌత్యం....
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు అభ్యర్థిత్వ ప్రభావం ప్రజాగర్జనపై పడింది. టికెట్ ఆశావాహులు ధిక్కార స్వరం విన్పిస్తున్నారు. సీఎం రమేష్ ఏకపక్ష నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, పీసీసీ మెంబర్ రాంప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు. సోమవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవాలని భావించిన నేతలు, ఆ కార్యక్రమానికి దూరం కావడం వెనుక కడప పార్లమెంటు టికెట్ వ్యవహారమే కారణంగా పలువురు పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీతో భవిష్యత్ లేదని భావించిన నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, రమేష్‌రెడ్డి, వీరశివారెడ్డి, రాజంపేట నేత మేడా మల్లికార్జునరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదేబాటలో ఎమ్మెల్యేలు డీఎల్ రవీంద్రారెడ్డి, కందుల సోదరులు, పీసీసీ మెంబర్ రాంప్రసాద్‌రెడ్డి ఉన్నారని ఇదివరకే టీడీపీ నేతలు ప్రకటించారు. వీరందరూ ప్రజాగర్జనలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని భావించారు.
అయితే ఊహించని రీతిలో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అయిష్టత ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. కడప పార్లమెంటు అభ్యర్థిత్వం ఆశించిన ఆయన ఆ అవకాశం దక్కదని భావించి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఇష్టపడనున్నట్లు తెలుస్తోంది. అనూహ్యంగా కడప పార్లమెంటు అభ్యర్థిగా మాజీ మంత్రి ఆర్ రాజగోపాల్‌రెడ్డి తనయుడు శ్రీనివాసులరెడ్డి తెరపైకి రావడంతో కందుల రాజమోహన్‌రెడ్డి సైతం అలక వహించినట్లు తెలుస్తోంది.
కడప పార్లమెంటు సీటుతో మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించిన రాజమోహన్‌రెడ్డికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఎంపీ రమేష్ వైఖరి కారణంగా అడ్డుచక్రం పడ్డట్లు సమాచారం. ఆమేరకు ప్రజాగర్జనకు సైతం దూరంగా ఉండాలని రాజమోహన్‌రెడ్డి భావించినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే వీరశివా దౌత్యం....
కడప పార్లమెంటు టికెట్ ఆశించి భంగపడ్డ కందుల రాజమోహన్‌రెడ్డి చంద్రబాబు ప్రజాగర్జనకు దూరంగా ఉండాలనే తలంపుతో ఉండిపోయారు. అయితే ఎమ్మెల్యే వీరశివారెడ్డి కందుల ఇంటికి చేరుకుని మంతనాలు నిర్వహించారు. కడప అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆర్. శ్రీనివాసులరెడ్డి నాన్‌లోకల్ అవుతారు.. మీతోబాటు మేము కూడా చంద్రబాబుకు చెబుతాం.. తొందరపడొద్దు.. ప్రజాగర్జనకు హాజరు అవండి..అభ్యర్థిని మార్చేందుకు అందరం కలిసి ప్రయత్నిస్తాం అంటూ సముదాయించినట్లు తెలుస్తోంది.
వీరి చర్చల అనంతరం రాజమోహన్‌రెడ్డి కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నా, శివానందరెడ్డి మాత్రం దూరంగా ఉండిపోయారు. ఇకపై తాను తెలుగుదేశం పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటానని, నీవు మాత్రమే రాజకీయాలు చేసుకోవచ్చని సోదరుడు రాజమోహన్‌రెడ్డికి శివానందరెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం.
రాజ్యసభ సభ్యుడు రమేష్ ఏకపక్ష వైఖరితో కందుల సోదరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కాగా రాయచోటి కాంగ్రెస్ పార్టీ నేత రాంప్రసాద్‌రెడ్డి సైతం ప్రజాగర్జనకు దూరమయ్యారు. పాలకొండ్రాయుడికి గాని తనకుగాని టికెట్ ఇవ్వాలని, రమేష్‌రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంపై రాంప్రసాద్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం రమేష్‌ను నియంత్రించాల్సిందే...
చంద్రబాబు వద్ద ఎంత పరపతి ఉన్నా సరే జిల్లాలో పోట్లదుర్తి కుటుంబీకుడేనని గుర్తించుకునేలా వ్యవహరించాలని తెలుగుదేశం నేతలు సీఎం రమేష్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. వర్గ రాజకీయాల్లో సిఎం రమేష్ స్థాయి చాలా చిన్నదన్న విషయాన్ని గుర్తించాలని వ్యతిరేక టీం పేర్కొంటోంది.
జిల్లాలోని పార్టీ కేడర్ కారణంగానే ప్రజాగర్జన విజయవంతమైంద ని, ఇందులో సీఎం రమేష్ గొప్పతనం ఏమీ లేదని చంద్రబాబుకు చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి కడప పార్లమెంటు టికెట్ వ్యవహారం తెలుగుతమ్ముళ్ల మధ్య అంతర్గత విభేదాలను తీవ్రతరం చేస్తోంది.