Prajagarjana
-
ఎస్సీలకు 18%.. ఎస్టీలకు 12% రిజర్వేషన్లు
చేవెళ్ల: చేవెళ్ల ప్రజాగర్జన సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. మొత్తం 12 అంశాలతో కూడిన ఈ డిక్లరేషన్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌లో పేర్కొన్న అంశాలన్నింటినీ తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని.. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఖర్గే ప్రకటించారు. డిక్లరేషన్‌లోని అంశాలివీ.. జనాభా దామాషా ప్రాతిపదికన ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12% మేర రిజర్వేషన్ల పెంపు. వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తాం. అంబేడ్కర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయం. ఐదేళ్ల పాటు ప్రతి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి పథకం అమలు. ఎస్సీ, ఎస్టీలకు అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 18 శాతం, 12 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు. ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీల్లో కూడా వారికి రిజర్వేషన్లు ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద ఇంటి స్థలాలు లేని ప్రతి దళిత, గిరిజనులకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.6 లక్షల ఆర్థిక సాయం. ఐదేళ్లలో ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపు. బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను అన్ని హక్కులతో తిరిగి అసైనీలకే కేటాయింపు. ప్రజా ప్రయోజనార్థం, భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు సదరు అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం. ఎస్సీలకు ఇచ్చిన అసైన్ భూములపై యాజమాన్య హక్కుల కల్పన. అమ్ముకునేందుకు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే హక్కులు. ఎస్టీలకు ఇచ్చిన పోడు భూములపైనా వారికి పూర్తి హక్కులు. అటవీ హక్కుల చట్టం పటిష్టంగా అమలు. సమ్మక్క–సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీలకు రూ.25లక్షల అభివృద్ధి నిధులు. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు. మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు ఒక్కో కార్పొరేషన్ ద్వారా ఏటా రూ.750 కోట్ల నిధులు. గిరిజనుల కోసం మూడు కార్పొరేషన్లు. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు. వాటికి ఏటా రూ. 500 కోట్ల కేటాయింపు. రాష్ట్రంలో ఐదు కొత్త ఐటీడీఏలు, తొమ్మిది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు. మైదాన ప్రాంత గిరిజనుల కోసం నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఐటీడీఏల ఏర్పాటు. అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు.. విద్యాజ్యోతుల పథకం కింద పదో తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి రూ.10 వేల నగదు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ పాసైతే రూ.25వేలు, పీజీకి రూ.లక్ష.. ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5లక్షల నగదు బహుమతులు. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అందరికీ విద్య. గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సాయం. -
జాతీయస్థాయిలో ఉద్యమం
- అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా చలో ఢిల్లీ, జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపడతాం - రాష్ట్ర ప్రభుత్వంలోని స్వార్థపర శక్తుల వల్లే సమస్య జఠిలం - అగ్రిగోల్డ్ ప్రజాగర్జన సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అనంతపురం అర్బన్: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, ‘చలో ఢిల్లీ’ ద్వారా ఈ సమస్యను జాతీయస్థాయికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలోని స్వార్థపర శక్తులే సమస్య పరిష్కారానికి అడ్డుగా నిలుస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్ల ఒరిస్సా, కర్నాటకలోని అగ్రిగోల్డ్ బాధితులను కలుపుకొని జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని, చలో ఢిల్లీ చేపట్టి జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగుతామని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నెలరోజులపాటు చేపట్టిన చైతన్యయాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ‘అగ్రిగోల్డ్ బాధితుల ప్రజాగర్జన’ సభ నిర్వహించారు. ముందుగా అగ్రిగోల్డ్ సంస్థ కారణంగా అసువులు బాసిన 149 మందికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సభలో నారాయణ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థ చట్టవిరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సంస్థ ఆస్తులను తాకట్టు పెట్టుకుని రూ.5 వేల కోట్లు ఇచ్చి చిన్నమొత్తాల ఖాతాదారులను ఆదుకోవాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. అగ్రిగోల్డ్ మోసం వల్ల 149 మరణించారని, ఇందుకు ప్రభుత్వాన్ని, అగ్రిగోల్డ్ సంస్థను బాధ్యులను చేస్తూ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంఎ.గఫూర్, ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ పోతిన వెంకటరామారావు, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి సుందర రామరాజు, అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు ముప్పాళ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి తిరుపతయ్య, జిల్లా అధ్యక్షుడు నారాయణప్ప, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.జె.చంద్రశేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే మూల్యం తప్పదు
‘ప్రజాగర్జన’ సభలో ఉత్తమ్ ధ్వజం సాక్షి, సంగారెడ్డి: ‘ప్రత్యేక తెలంగాణలో ప్రజాస్వామ్యానికి మనుగడ లేకుండా పోయిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. సర్పంచ్ నుంచి ఎంపీ దాకా ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మారుమూల గ్రామాల్లో వీర సైనికులుగా పోరాడుతున్నారన్నారు. ‘కార్యకర్తల వెంట ఐక్యంగా మేముంటాం. ఎవరిని ఇబ్బంది పెట్టినా మూల్యం చెల్లించక తప్పదు’ అంటూ హెచ్చరించారు. సంగారెడ్డి అంబేడ్కర్ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్రాల్లో మూడేళ్ల పాలనలో మోదీ, కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలూ కలగలేదనే అంశాన్ని రాష్ట్రమంతటా చాటేందుకే రాహుల్‌గాంధీ వచ్చారన్నారు. ‘ఆంధ్ర ప్రాంతంలో అధికారం కోల్పోతున్నామని తెలిసినా ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి, చలించి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ మూడేళ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఏ మేలూ జరగలేదు. విభజన బిల్లులోని ఏ హామీ అమలుకు నోచలేదు. ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ, ఎయిమ్స్ వంటివేమీ రాలేదు’ అన్నారు. దాశరథి, కాళోజీ కవితా పంక్తులను ఉటంకిస్తూ.. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. -
ప్రజాగర్జనకు తరలిన కాంగ్రెస్ నాయకులు
నార్నూర్: కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో సంగారెడ్డి ప్రజాగర్జనకు నార్నూర్, గాదిగూడ మండలాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు గురువారం భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌహాన్ డిగాంబర్, సత్తార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసమస్యలను విస్మరిస్తోందని వివరించారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రెండు మండలాల నుంచి మొత్తం 15 వాహనాల్లో కార్యకర్తలు తరలివెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గోవింద్, రాథోడ్ రమేశ్, కైలాష్ ఉన్నారు. -
ఎమ్మెల్యే వీరశివా దౌత్యం....
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు అభ్యర్థిత్వ ప్రభావం ప్రజాగర్జనపై పడింది. టికెట్ ఆశావాహులు ధిక్కార స్వరం విన్పిస్తున్నారు. సీఎం రమేష్ ఏకపక్ష నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, పీసీసీ మెంబర్ రాంప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు. సోమవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవాలని భావించిన నేతలు, ఆ కార్యక్రమానికి దూరం కావడం వెనుక కడప పార్లమెంటు టికెట్ వ్యవహారమే కారణంగా పలువురు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో భవిష్యత్ లేదని భావించిన నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, రమేష్‌రెడ్డి, వీరశివారెడ్డి, రాజంపేట నేత మేడా మల్లికార్జునరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదేబాటలో ఎమ్మెల్యేలు డీఎల్ రవీంద్రారెడ్డి, కందుల సోదరులు, పీసీసీ మెంబర్ రాంప్రసాద్‌రెడ్డి ఉన్నారని ఇదివరకే టీడీపీ నేతలు ప్రకటించారు. వీరందరూ ప్రజాగర్జనలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని భావించారు. అయితే ఊహించని రీతిలో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అయిష్టత ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. కడప పార్లమెంటు అభ్యర్థిత్వం ఆశించిన ఆయన ఆ అవకాశం దక్కదని భావించి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఇష్టపడనున్నట్లు తెలుస్తోంది. అనూహ్యంగా కడప పార్లమెంటు అభ్యర్థిగా మాజీ మంత్రి ఆర్ రాజగోపాల్‌రెడ్డి తనయుడు శ్రీనివాసులరెడ్డి తెరపైకి రావడంతో కందుల రాజమోహన్‌రెడ్డి సైతం అలక వహించినట్లు తెలుస్తోంది. కడప పార్లమెంటు సీటుతో మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించిన రాజమోహన్‌రెడ్డికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఎంపీ రమేష్ వైఖరి కారణంగా అడ్డుచక్రం పడ్డట్లు సమాచారం. ఆమేరకు ప్రజాగర్జనకు సైతం దూరంగా ఉండాలని రాజమోహన్‌రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వీరశివా దౌత్యం.... కడప పార్లమెంటు టికెట్ ఆశించి భంగపడ్డ కందుల రాజమోహన్‌రెడ్డి చంద్రబాబు ప్రజాగర్జనకు దూరంగా ఉండాలనే తలంపుతో ఉండిపోయారు. అయితే ఎమ్మెల్యే వీరశివారెడ్డి కందుల ఇంటికి చేరుకుని మంతనాలు నిర్వహించారు. కడప అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆర్. శ్రీనివాసులరెడ్డి నాన్‌లోకల్ అవుతారు.. మీతోబాటు మేము కూడా చంద్రబాబుకు చెబుతాం.. తొందరపడొద్దు.. ప్రజాగర్జనకు హాజరు అవండి..అభ్యర్థిని మార్చేందుకు అందరం కలిసి ప్రయత్నిస్తాం అంటూ సముదాయించినట్లు తెలుస్తోంది. వీరి చర్చల అనంతరం రాజమోహన్‌రెడ్డి కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నా, శివానందరెడ్డి మాత్రం దూరంగా ఉండిపోయారు. ఇకపై తాను తెలుగుదేశం పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటానని, నీవు మాత్రమే రాజకీయాలు చేసుకోవచ్చని సోదరుడు రాజమోహన్‌రెడ్డికి శివానందరెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడు రమేష్ ఏకపక్ష వైఖరితో కందుల సోదరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కాగా రాయచోటి కాంగ్రెస్ పార్టీ నేత రాంప్రసాద్‌రెడ్డి సైతం ప్రజాగర్జనకు దూరమయ్యారు. పాలకొండ్రాయుడికి గాని తనకుగాని టికెట్ ఇవ్వాలని, రమేష్‌రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంపై రాంప్రసాద్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రమేష్‌ను నియంత్రించాల్సిందే... చంద్రబాబు వద్ద ఎంత పరపతి ఉన్నా సరే జిల్లాలో పోట్లదుర్తి కుటుంబీకుడేనని గుర్తించుకునేలా వ్యవహరించాలని తెలుగుదేశం నేతలు సీఎం రమేష్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. వర్గ రాజకీయాల్లో సిఎం రమేష్ స్థాయి చాలా చిన్నదన్న విషయాన్ని గుర్తించాలని వ్యతిరేక టీం పేర్కొంటోంది. జిల్లాలోని పార్టీ కేడర్ కారణంగానే ప్రజాగర్జన విజయవంతమైంద ని, ఇందులో సీఎం రమేష్ గొప్పతనం ఏమీ లేదని చంద్రబాబుకు చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి కడప పార్లమెంటు టికెట్ వ్యవహారం తెలుగుతమ్ముళ్ల మధ్య అంతర్గత విభేదాలను తీవ్రతరం చేస్తోంది. -
బాబు పర్యటనతో నేడు ట్రాఫిక్ మళ్లింపు
కడప అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర మాజీ మఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా కడప నగరంలో డీఎస్పీ రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ మళ్లింపునకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ స్టేడియంలో నేడు ప్రజాగర్జన బహిరంగసభ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. కమలాపురం, పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాల నుంచి వచ్చే టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తమ వాహనాలను బిల్టప్ సమీపంలోని పుత్తా గార్డెన్స్, ఈద్గామైదానం వద్ద పార్కింగ్ చేసి కాలినడకన మున్సిపల్ స్టేడియంకు చేరుకోవాల్సి ఉంటుందని డీఎస్పీ ఆదేశించారు. రాజంపేట, బద్వేలు, రైల్వేకోడూరు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు బైపాస్ ద్వారా దేవునికడప మీదుగా మార్కెట్‌యార్డుకు చేరుకుని అక్కడ వాహనాలు నిలుపాలని సూచించారు. రాయచోటి నియోజకవర్గం నుంచి వచ్చేవారు రైల్వేగేటు ఇరువైపులా వాహనాలను పార్కింగ్ చేసుకోవాలన్నారు. -
రగులుతున్న ‘దేశం’
ప్రజాగర్జన తర్వాత రెండు గ్రూపులు అయ్యన్న వ్యాఖ్యలపై గంటా వర్గం గరంగరం చింతకాయలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ సందిగ్ధంలో అధిష్టానం గంటా బృందంతో నష్టమేనని ఆవేదన సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన తెలుగుదేశం ప్రజాగర్జన విశాఖ జిల్లా పార్టీలో గ్రూపు రాజకీయాలను పెంచింది. బుధవారం నాటి ప్రజాగర్జన తర్వాత పార్టీలోని నేతలు పాత వారు, కొత్తగా చేరిన వారుగా విడిపోయి రాజకీయాలు ప్రారంభించారు. చంద్రబాబు సమక్షంలోనే ప్రజాగర్జన సభలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కొత్తగా చేరిన గంటా బృందంతో విరుచుకుపడడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తమ చేరిక సందర్భంగా నిర్వహించిన సభలోనే అయ్యన్న తమపై చంద్రబాబు ఎదుటే విరుచుకుపడితే తమకు గౌరవమేముంటుందని గంటా వర్గీయులు మండిపడుతున్నారు. తన నిరసనను వ్యక్తం చేయడంలో భాగంగా గురువారం ఉదయం గంటా వర్గీయులు విమానాశ్రయంలో చంద్రబాబు వీడ్కోలుకు వెళ్లలేదు. గురువారం ఉదయం దసపల్లా హోటల్లో జరిగిన నియోజక వ ర్గ స్థాయి సమీక్ష సమావేశాలకు కూడా వీరు డుమ్మా కొట్టారు. అయ్యన్నకు వ్యతిరేకంగా గురువారం మధ్యాహ్నం గంటా శ్రీనివాసరావు ఇంట్లో సమావేశమైన ఆయన అనుచరులు అయ్యన్నకు వ్యతిరేకంగా మంతనాలు జరిపారు. పార్టీ పరిశీలకుడిగా వచ్చిన నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ కూడా ఈ సమావేశంలో పాల్గొని గంటా వర్గీయులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయ్యన్నపాత్రుడుపై పార్టీ కఠినంగా వ్యవహరించకుంటే తాము క్రీయాశీలంగా వ్యవహరించలేమని గంటా స్పష్టం చేసినట్టు తెలిసింది. పారిశ్రామిక వేత్తలు, రియల్టర్లు గంటాతో ఉండగా, నిజమైన తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, బీసీలు అయ్యన్నతో ఉండడంతో పార్టీ అధిష్టానానికి దిక్కుతోచడం లేదు. అయ్యన్నపై ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే బీసీలకు అన్యాయం చేశామనే భావన ప్రజల్లోకి వెళుతుందని పార్టీ నేతలు భయపడుతున్నారు. గంటా వర్గీయులను శాంతిపజేసేందుకు వెళ్లిన నారాయణ కూడా వారికి నిర్దిష్టమైన హామీని ఇవ్వలేకపోయారు. ప్రజాగర్జన సభలో అయ్యన్న అలా మాట్లాడి ఉండాల్సింది కాదని చంద్రబాబు పేర్కొనడంతో గంటా వర్గం కాస్త ఊరట చెందింది. కానీ గంటా వర్గం గ్రూపు రాజకీయాలను అయ్యన్న ప్రశ్నిస్తున్నారు. పార్టీలో చేరిన రెండు రోజులకు గ్రూపులు కట్టి అధిష్టానాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్న గంటాతో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు. గంటా వర్గం చేరిక ద్వారా పార్టీకి మేలు జరగకపోగా ఉన్న పరువు పోయిందని మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల మందితో జరగాల్సిన గర్జన సభకు 30 వేల మంది కూడా హాజరుకాకపోవడం గంటా వర్గీయులు వైఫల్యంగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. -
కోడ్ గర్జన
ప్రజాగర్జనలో జెండాలు, ఫ్లెక్సీల ఏర్పాటుపై కన్నెర్ర వివరాలు సేకరించిన సిబ్బంది సభ ఖర్చుల మదింపులో అధికారులు టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదులు ఎమ్మెల్యే వెలగపూడితో పాటుమరో ఇద్దరికి నోటీసులు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : టీడీపీ ప్రజాగర్జన ఆ పార్టీ నాయకుల మెడకు చుట్టుకుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించడం పట్ల జిల్లా యంత్రాంగం సీరియస్‌గా స్పందించింది. నాయకులపై కేసులు పెట్టింది. నోటీసులు జారీ చేసింది. కొంతమందిపై నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. సభ ఏర్పాట్లతో పాటు జిల్లాలో ఎవరెవరూ బ్యానర్లు, జెండాలు, ఫెక్సీలు, హోర్డింగ్‌లు, కటౌట్లు పెట్టారన్న విషయాన్ని తీసిన వీడియోలను నిశితంగా పరిశీలిస్తోంది. ఖర్చుల మదింపు అనంతరం ఆయా నేతలపై చర్యలకు ఉపక్రమించాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రజా గర్జన సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు నగరమంతటా ఆయా పార్టీ అగ్రనాయకుల ఫొటోలతో ఫ్లెక్సీలు, కటౌట్లు, జెండాలను ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో వాటిని సిబ్బంది తొలగించడానికి ప్రయత్నించగా టీడీపీ నేతలు వారిపై విరుచుకుపడ్డారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వాటన్నింటినీ సిబ్బంది వీడియో తీశారు. వీడియో వ్యూయింగ్ బృందం దీనిని నిశితంగా పరిశీలిస్తోంది. కోడ్ ఉల్లంఘిస్తూ వాటిని ఏర్పాటు చేసిన వారిపై కేసులు పెట్టనున్నారు. ఎంసీఎంసీ అనుమతులు లేకుండా యాడ్స్ గర్జన సందర్భంగా నాయకులు పత్రికలకు ప్రకటనలిచ్చారు. ప్రకటనలలిచ్చే ముందు మీడియా సర్టిఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) నుంచి అనుమతులు పొందాలి. అయినా రూ.కోటి విలువ చేసే యాడ్స్ పత్రికల్లో వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తిగా లెక్కలు తేలిన తరువాత అనుమతులు లేకుండా ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకుంటారు. నేడు పార్టీలతో సమావేశం ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఇప్పటికే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోడ్ అమలు తీరును వివరించారు. టీడీపీ నాయకులు నియమావళిని ఉల్లంఘించడంతో మరోసారి శుక్రవారం సాయంత్రం అన్ని పార్టీల ప్రతినిధులతో కోడ్‌పై మరోసారి సమావేశం నిర్వహించనున్నారు. కేసులు నమోదు టీడీపీ నాయకులు ఒమ్మి సన్యాసిరావు, బొట్టా వెంకటరమణయాదవ్లపై అధికారులు మహారాణిపేట జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నంరెడ్డి వాణి, బొట్టా వెంకటరమణ యాదవ్, అనిత సుకురులపై నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో తొలగించని జెండాలు ఫ్లెక్లీల వీడియోను పరిశీలించి కేసులు నమోదు చేయనున్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో పాటు, నేతలు అనితా సుకురు, రఘువీర్ సుకురులకు నోటీసులు జారీ చేశారు. మిగిలిన నియోజకవర్గాల పరిధిలో కూడా తీసిన వీడియోను పరిశీలించిన అనంతరం నోటీసులు జారీ చేయడం లేదా కేసులు పెట్టే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. -
తర్జనగర్జన
తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న ప్రజా గర్జన వేదిక మారింది. ఏయూ మైదానం నుంచి ఆర్కే బీచ్‌కు తరలింది. కాంగ్రెస్‌ను వీడిన మాజీ మంత్రి గంటా శ్రీని వాసరావు బృందాన్ని తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తూ చంద్రబాబు నాయు డు సమక్షంలో ఈ నెల 12న నిర్వహించతలపెట్టిన ఈ గర్జన మొదటినుంచి వివాదాస్పదంగానే తయారైంది. నిజానికి ఈ నెల 8న మహిళా దినోత్సవ సభను భారీగా నిర్వహించి గంటా బృందాన్ని చేర్చుకోవాలని పార్టీ పెద్దలు భావించారు. కానీ మహిళా దినోత్సవ సభలో తాము చేరడం బాగోదని గంటా బృందం భావించింది. ఆధికారంలో ఉండగా మూడు నెలల క్రితం తన కుమార్తె వివాహాన్ని, నెల రోజుల క్రితం సహచర శాసన సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాస్ కుమార్తె వివాహాన్ని భారీగా నిర్వహించిన ఏయూ మైదానంలో గర్జన సభను పెట్టాలని గంటా నిర్ణయించారు. గంటా కుమార్తె వివాహ సమయంలో ఆయన మంత్రిగా ఉండడంతో ఏయూ మైదానానికి దారితీసే రహదారులను జీవీఎంసీ రెండు కోట్ల రూపాయలతో పునర్నిర్మించింది. ఏయూ పాలకవర్గం కూడా వీరికి దాసోహమై సకల సదుపాయాలు కల్పించింది. అదే రీతిలో ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతాయని అనుకొన్న గంటాకు పోలీసు కమిషనర్ షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా మైదానం ఇవ్వడానికి ఏయూ వీసీ, సంబంధిత అనుమతులివ్వడానికి జీవీఎంసీ ముందుకు రాగా పోలీసు కమిషనర్ శివధర్‌రెడ్డి మాత్రం ఎన్నికల నిబంధనల మేరకు వ్యవహరించారు. ఎన్నికల సమయంలో విద్యా సంస్థల ప్రాంగణంలో సభలు నిర్వహించడం చట్టవిరుద్ధమంటూ స్పష్టం చేసి పోలీసు అనుమతిని నిరాకరించారు. దీంతో ఏం చేయాలో తెలియక హడావుడిగా వన్‌టౌన్‌లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియాన్ని సందర్శించిన నేతలు ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా వద్దనుకొన్నారు. చేసేది లేక తొలుత వద్దకుకొన్న ఆర్కే బీచ్‌లోనే సభ పెట్టాలని నిర్ణయించారు. గంటా బృందం 2009 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యంలో చేరినప్పుడు ఆర్కే బీచ్‌లోనే సభ జరిగింది. గంటా తదితరులు 2009 ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ప్రజారాజ్యం పూర్తిగా విఫలమైంది. ఆ తర్వాత గంటా ప్రోద్భలంతో బీచ్‌లో నిర్వహించిన సమైక్యాంధ్ర సభ కూడా విఫలమైంది. సెంటిమెంట్‌గా బీచ్‌లో సభ నిర్వహిస్తే మంచిజరగదన్న అభిప్రాయం వీరిలో నాటుకొంది. పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇష్టం లేకపోయినా బీచ్‌లోనే సభ జరపాల్సి వస్తోంది. బీచ్‌లో సభ విజయవంతం కావాలంటే లక్షల్లో జనాన్ని తరలించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి అంత సీన్ లేదని స్థానిక దేశం నేతలు సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించిన సీనియర్‌నేత యనమల రామకృష్ణుడుకి స్పష్టం చేశారు. 12 వ తేదీన సెలవు దినం కూడా కానందున బీచ్‌లో పెద్దగా జనం ఉండరని, పూర్తిగా తాము తీసుకువచ్చేవారితోనే సభ నిర్వహించడం కష్టమని వారు అవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం అధికారంలో ఉండి తమను వేధింపులకు గురిచేసిన గంటా బృందం కోసం ఏర్పాటు చేస్తున్న సభకు తాము దూరంగా ఉంటామని మొదటి నుంచి పార్టీలో ఉన్న క్యాడర్ భీష్మించుకుకూర్చోవడం కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. ఆరునూరైనా బీచ్‌లో భారీగా సభ జరపాల్సిందేనని అధిష్టానం అదేశించడంతో చేసేది లేక ఏర్పాట్లలో నేతలు నిమగ్నమయ్యారు. -
ప్రజాగర్జనపై టీడీపీలో అయోమయం
ఈనెల 12వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించ తలపెట్టిన ప్రజాగర్జన సభపై తెలుగుదేశం పార్టీలో అయోమయం నెలకొంది. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్ లో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ నిరాకరించింది. అయితే, బీచ్ రోడ్డులో సభ ఏర్పాటుచేస్తే వాస్తుపరంగా అనుకూలంగా ఉండదని, అందువల్ల సభ ఎక్కడ నిర్వహించాలోనని తెలుగుదేశం పార్టీ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. -
సమైక్య సునామీ
కందనవోలు గడ్డ లక్ష్య సాధకులతో పోటెత్తింది. ఉద్యమాల ఖిల్లా.. తెలుగుబిడ్డలతో కదంతొక్కింది. అడుగుల పిడుగులు.. మాటల తూటాలు.. స్ఫూర్తి నింపిన పాటలు.. ఉత్సాహం నింపిన ఆట నడుమ సమైక్య నినాదం మారుమ్రోగింది. ఇసుకేస్తే రాలనంత జనం.. తొణికిసలాడే ఉద్యమ భావం.. ఉప్పొంగే పౌరుషం పోరాట పటిమకు అద్దం పట్టింది. కర్నూలులో దారులన్నీ ఒక్కటి కాగా.. ఉద్యమకారులంతా కలిసి నడవగా.. ఎస్టీబీసీ కళాశాల మైదానం జన సునామీని తలపించింది. పార్టీలకు అతీతంగా.. నేతల ఊసే లేకుండా సాగిన ప్రజాగర్జన జిల్లా చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికింది. ప్రజల తోడుగా.. వారే సారథులుగా సాగుతున్న ఉద్యమానికి దిశా నిర్దేశం చేసింది. కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్:కర్నూలులో నిర్వహించిన సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన బహిరంగ సభ విజయవంతమైంది. సభా వేదిక ఎస్టీబీసీ కళాశాల మైదానంతో పాటు చుట్టుపక్క రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. గతంలో ఇదే మైదానంలో అనేక రాజకీయ పార్టీల బహిరంగ సభలు జరిగినా.. ఈ స్థాయిలో జనాన్ని చూడలేదనే చర్చ జరిగింది. తద్వారా సమైక్యవాదాన్ని బలంగా చాటగలిగారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో సభ ఆద్యంతం హోరెత్తింది. వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ఊరేగింపుగా బహిరంగ సభకు తరలివచ్చారు. ఉదయం 10 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలైన కార్యక్రమం రాత్రి 9:15 గంటలకు ముగిసింది. సభ పూర్తయ్యేంత వరకు ఎవరూ బయటకు వెళ్లకుండా క్రమశిక్షణ పాటించడం విశేషం. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు వి.సి.హెచ్.వెంగల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబుతో పాటు మొత్తం 40 మంది ప్రసంగించారు. అశోక్‌బాబు ప్రసంగిస్తున్నంత సేపు ప్రజలు చప్పట్లు, ఈలలు, కేకలతో ప్రోత్సహించారు. నెల్లూరు వాసులు తమిళనాడులో, అనంతపురం ప్రజలు బెంగుళూరులో, విశాఖపట్నం ప్రజలు ఒరిస్సాలో పెట్టుబడులు పెట్టవచ్చని, అయితే అక్కడకు వెళ్లకుండా హైదరాబాదులో ఎందుకు పెట్టుబడులు పెట్టారు... ఇది మన రాజధాని అనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చి అభివృద్ధి చేశారని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల అంగీకారం లేనిదే రాష్ట్ర విభజన జరగదని, కాదు కూడదని ముందుకెళ్తే హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామన్నారు. ఎంపీలు, కేంద్ర మంత్రుల మెడలు వంచి రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేకపోయినా ముందుకు సాగకుండా అడ్డుకోగలిగామని, ఇది 60 రోజుల ఉద్యమంతో సాధ్యమైందన్నారు. ప్రజాగాయకుడు వంగపండు బృందం ఆటాపాటా సభికులను విశేషంగా ఆకట్టుకుంది. సమ్మెను కొనసాగిస్తామని, అయితే విధి విధానాలపై ఈనెల 30న అన్ని జేఏసీ నేతలతో చర్చించి కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు. సీమాంధ్ర జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి తీరాల్సిందేనన్నారు. ప్రైవేటు సంస్థలన్నీ యథావిధిగా పనిచేస్తున్నాయని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అనడం సరికాదని, ఆగస్టు 1 నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలు నిరంతరం ఉద్యమిస్తున్నాయని ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ చైర్మన్ జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ పేర్కొనగా ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థలను యథావిధిగా నడుపుతూ ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించగా వి.సి.హెచ్.వెంగల్రెడ్డి జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో ఉపాధ్యాయులు వెనక్కు తగ్గారు. ఇదిలా ఉండగా ఉదయం స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యోగులు, ప్రజలు రోడ్లపైకొచ్చి 60 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారని, కేంద్రంలోని మంత్రులు, ఎంపీలు పదవులకు రాజీనామా చేసినట్లయితే విభజన ప్రక్రియ ఎప్పుడో తేలిపోయేదన్నారు. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్రులకు జరిగే అన్యాయంపై రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలే నాయకత్వం వహించి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తుండటం శుభపరిణామమన్నారు. తెలంగాణలోనూ సమైక్యాంధ్రకు మద్దతిచ్చే ప్రజలు చాలా మంది ఉన్నారని.. అలాంటి వారిపై తెలంగాణ ముసుగులో దాడులకు పాల్పడితే సహించబోమన్నారు. రాజకీయ స్వార్థం కోసం తీసుకున్న విభజన నిర్ణయం శిలాశాసనం కాదన్నారు. తెలంగాణ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం మానకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. విశాఖలో వచ్చే నెల 3, 4 తేదీల్లో అక్కడి పరిశ్రమల కార్మికులతో కలిసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. సోమవారం 120 ప్రభుత్వ శాఖల జేఏసీ నాయకులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. -
21న ‘చిత్తూరు ప్రజాగర్జన’
చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన అంశాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 21న చిత్తూరులో ‘చిత్తూరు ప్రజాగర్జన’ పేరిట భారీ సభ నిర్వహించనున్నట్లు సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక (ఎస్‌ఆర్‌పీవీ) జిల్లా జేఏసీ చైర్మన్, స్థానిక శాసన సభ్యుడు సీకే.బాబు చెప్పారు. శుక్రవారం చిత్తూరులోని నగర పాలక సంస్థ కార్యాలయంలో ఎస్‌ఆర్‌పీవీ జేఏసీ నేతల సర్వసభ్య సమావేశం జరిగింది. చిత్తూరులో తలపెట్టిన లక్షగళార్చన కార్యక్రమానికి బదులుగా చిత్తూరు ప్రజాగర్జన పేరిట సభను నిర్వహించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశం విషయాలను సీకే.బాబు మీడియాకు వెల్లడించారు. కుల,మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఆ రోజు ఉదయం 10 గంటలకు చిత్తూరులోని పీసీఆర్ కూడలిలో జ్యోతిరావ్ పూలే విగ్రహం వద్ద ప్రజాగర్జన నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకునే ప్రతిఒక్కరూ పాల్గొని వారి గొంతు వినిపించాలన్నారు. చిత్తూ రు, పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలిరావాలన్నారు. పాఠశాలలకు చెందిన చిన్నపిల్లల్ని సభకు తీసుకురాకూడదని తెలిపారు. ఇంటర్ ఆ పైన చదివే ప్రతి విద్యార్థి ప్రజాగర్జనలో పాల్గొనాలని కోరారు. మహిళా సంఘాలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సేవా సంస్థలు.. అన్ని రకాల ప్రజలు ఈ సభలో పాల్గొనాలన్నారు. జిల్లా గెజిటెడ్ ఆఫీసర్ల జేఏసీ ఛైర్మన్, అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ సీమాం ధ్రలో జరుగుతున్న సమైక్యాంద్ర ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి, కేంద్రానికి ఈ ప్రాంతవాసుల మనోభావాలు వినిపించడానికి ‘చిత్తూరు ప్రజాగర్జన’ వేదిక కానుందన్నారు. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సభలో పాల్గొని రాష్ట్ర సమైక్యతను చాటిచెప్పాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధికారుల జేఏసీ నాయకులు బసిరెడ్డి, అధికారులు అనిల్‌కుమార్‌రెడ్డి, చంద్రమౌళి, జయలక్ష్మి, నాగేశ్వరరావు, విజయసింహారెడ్డి, కృష్ణమనాయుడు, దేవప్రసాద్, డాక్టర్ దశరథరామయ్య, సచ్చిదానందవర్మ, డాక్టర్ జయరాజ్, ప్రభాకర్, గిరిప్రసాద్‌రెడ్డి, గంటా మోహన్, రెడ్డి శేఖర్‌రెడ్డి, శ్రీరాముమూర్తి, తేజోమూర్తి, ప్రకాష్ చంద్రారెడ్డి, శరశ్చంద్ర, మహేష్, సురేంద్రకుమార్ విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.