చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన అంశాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 21న చిత్తూరులో ‘చిత్తూరు ప్రజాగర్జన’ పేరిట భారీ సభ నిర్వహించనున్నట్లు సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక (ఎస్‌ఆర్‌పీవీ) జిల్లా జేఏసీ చైర్మన్, స్థానిక శాసన సభ్యుడు సీకే.బాబు చెప్పారు. శుక్రవారం చిత్తూరులోని నగర పాలక సంస్థ కార్యాలయంలో ఎస్‌ఆర్‌పీవీ జేఏసీ నేతల సర్వసభ్య సమావేశం జరిగింది. చిత్తూరులో తలపెట్టిన లక్షగళార్చన కార్యక్రమానికి బదులుగా చిత్తూరు ప్రజాగర్జన పేరిట సభను నిర్వహించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశం విషయాలను సీకే.బాబు మీడియాకు వెల్లడించారు.
కుల,మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఆ రోజు ఉదయం 10 గంటలకు చిత్తూరులోని పీసీఆర్ కూడలిలో జ్యోతిరావ్ పూలే విగ్రహం వద్ద ప్రజాగర్జన నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకునే ప్రతిఒక్కరూ పాల్గొని వారి గొంతు వినిపించాలన్నారు. చిత్తూ రు, పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలిరావాలన్నారు. పాఠశాలలకు చెందిన చిన్నపిల్లల్ని సభకు తీసుకురాకూడదని తెలిపారు. ఇంటర్ ఆ పైన చదివే ప్రతి విద్యార్థి ప్రజాగర్జనలో పాల్గొనాలని కోరారు. మహిళా సంఘాలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సేవా సంస్థలు.. అన్ని రకాల ప్రజలు ఈ సభలో పాల్గొనాలన్నారు.
జిల్లా గెజిటెడ్ ఆఫీసర్ల జేఏసీ ఛైర్మన్, అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ సీమాం ధ్రలో జరుగుతున్న సమైక్యాంద్ర ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి, కేంద్రానికి ఈ ప్రాంతవాసుల మనోభావాలు వినిపించడానికి ‘చిత్తూరు ప్రజాగర్జన’ వేదిక కానుందన్నారు. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సభలో పాల్గొని రాష్ట్ర సమైక్యతను చాటిచెప్పాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారుల జేఏసీ నాయకులు బసిరెడ్డి, అధికారులు అనిల్‌కుమార్‌రెడ్డి, చంద్రమౌళి, జయలక్ష్మి, నాగేశ్వరరావు, విజయసింహారెడ్డి, కృష్ణమనాయుడు, దేవప్రసాద్, డాక్టర్ దశరథరామయ్య, సచ్చిదానందవర్మ, డాక్టర్ జయరాజ్, ప్రభాకర్, గిరిప్రసాద్‌రెడ్డి, గంటా మోహన్, రెడ్డి శేఖర్‌రెడ్డి, శ్రీరాముమూర్తి, తేజోమూర్తి, ప్రకాష్ చంద్రారెడ్డి, శరశ్చంద్ర, మహేష్, సురేంద్రకుమార్ విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.
21న ‘చిత్తూరు ప్రజాగర్జన’
Published Sat, Sep 14 2013 3:27 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement