Charities
-
దానం ధర్మం
దానధర్మాలు ద్వంద్వ సమాసం. జంటగా కనపడతాయి. రెండూ ఒకటే అనుకుంటారు. ధర్మంలో దానం కూడా భాగం. దానం అంటే తన కున్నదానిని ఇతరులకు ఇవ్వటం. ‘ద’ అంటే ఇవ్వటం. ఆ ప్రక్రియ దానం. దానం, ధర్మం అనే రెండింటిని సమానార్థకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అడుక్కునేవాడు ‘‘అయ్యా! ధర్మం చేయండి.’’ అంటాడు. తనకున్న దానిని లేనివాడికి పంచటం ధర్మాచరణలో భాగం అని అర్థం చేసుకోవాలి. ‘‘నీ కిదేమైనా ధర్మంగా ఉందా?’’ అని అడిగి నప్పుడు ధర్మం అంటే న్యాయం అని అర్థం చేసుకోవాలి. రసాయన శాస్త్రంలో ఉదజని ధర్మాలు అని అంటే దాని సహజగుణాలు అని అర్థం. ‘‘సూర్యుడు తూర్పున ఉదయించును’’ అన్నది ఏ కాలం అని వ్యాకరణంలో అడిగినప్పుడు తద్ధర్మ కాలం అని సమాధానం వస్తుంది. ఇక్కడ కర్తవ్యం, విధి, తప్పక చేయవలసినది అనే అర్థం. తన దగ్గర ఉన్న దానిని ఇతరులతో పంచుకోవటం ధర్మంలో భాగం కనుక దానానికి పర్యాయ పదంగా ధర్మం అని అనటం జరుగుతోంది. దానం ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలో పెద్దలు మనకి చెప్పారు. ‘‘శ్రియా దేయం హ్రియా దేయం, సంవిదా దేయం’’ అని. తనదగ్గర ఉన్న సంపదకి తగినట్టుగా ఇవ్వాలట. ఒక కోటీశ్వరుడు ఒక రూపాయి దానం చేస్తే ఎంత సిగ్గుచేటు? వంద సంపాదించే రోజుకూలీ రూపాయి ఇస్తే పరవాలేదు కాని యాభై ఇస్తే తన తాహతుకి మించింది. తరవాత కష్టపడతాడు. సిగ్గుపడుతూ ఇవ్వాలట. ఇంతకన్న ఇవ్వలేక పోతున్నాను అని. తానే సిగ్గు పడుతూ ఉంటే తీసుకున్నవారు ఇంకెంత సిగ్గుపడాలో! తెలిసి ఇవ్వాలట. ‘‘గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం’’ అన్నట్టు కాకుండా మన చేతిలో నుండి జారిపోయింది దానం అనుకో కూడదు. ఇస్తున్నాను అని ఎరిగి ఇవ్వాలట. ఎవరికి ఇచ్చేది కూడా తెలిసి ఉండాలి. అంతా అయినాక వీళ్ళకా నేను ఇచ్చింది అని, ఇంత ఎందుకు ఇచ్చాను అని బాధపడకూడదు. దానాలు చాలా కారణాలుగా, చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. గ్రహదోషాలు ఉన్నాయి అంటే జపాలు తాము చేయలేరు కనుక ఎవరి చేతనైనా చేయిస్తారు. ఆ గ్రహానికి సంబంధించి కొన్ని వస్తువులు, ధనం దానం చేస్తారు. ఇది ప్రతిఫలాపేక్షతో చేసేది. ఒక రకమైన వ్యాపారం అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కొంతమంది ఆడంబరం కోసం దానాలు చేస్తూ ఉంటారు. తాము చేసిన దానిని ప్రకటించటం, ప్రచారం చేసుకోవటం, ఫోటోలు తీయించుకుని వార్తాపత్రికలలో వేయించుకుంటూ ఉండటం చూస్తాం. తీసుకున్న వారిని చులకనగా చూస్తూ తమకు కృతజ్ఞులై ఉండాలని ఆశించటం కనపడుతుంది. కొద్దిమంది ఎదుటి వారి అవసరం ఎరిగి అడగకుండానే దానం చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఉండదు. పైగా ఎవరికీ చెప్పనీయరు. కుడిచేత్తో చేసినది ఎడమ చేతికి తెలియ కూడదట. ఎందుకు దానం చేశావు అంటే నా దగ్గర ఉన్నది, వాళ్ళ దగ్గర లేదు... అంటారు. తీసుకున్నవారు సంతోషించినప్పుడు ఆ భావతరంగాలు ఇచ్చిన వారిని స్పృశిస్తాయి. వీరిని ఆవరించి ఉన్న ప్రతికూల తరంగాలు తప్పుకుంటాయి. ఇవ్వటానికి మా దగ్గర ఏముంది? అని సన్నాయి నొక్కులు నొక్కుతారు కొందరు. తథాస్తు దేవతలుంటారు. తస్మాత్ జాగ్రత్త! ఏమీ లేక పోవుట ఏమి? ధనం మాత్రమేనా ఇవ్వదగినది? జ్ఞానం, శరీరం, ఆలోచన, మాట .. ఇట్లా ఎన్నో! తన జ్ఞానాన్ని పంచవచ్చు. జ్ఞానం లేకపోతే శరీరంతో సేవ చేసి సహాయ పడవచ్చు. అదీ చేత కాకపోతే మాట సహాయం చేసి సేద తీర్చవచ్చు. ఇది ధర్మమే కదా! ఈ ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. భారతీయ సంస్కృతిలో ధర్మానికి పెద్ద పీట వేశారు. ధర్మమే మనలను ఎల్లప్పుడు కాపాడుతుంది. మనం చాలా శతాబ్దాలు విదేశీయుల పాలనలో మగ్గిపోయాము. కాని ముష్కరులు మన ధర్మం మీద దెబ్బతీయలేక పోయారు. ధర్మగ్లాని దశలో మనం ఉన్నప్పుడు సాధుసంతులు, మహాత్ములు ఉక్కుగోడలా నిల్చొని ధర్మాన్ని కాపాడారు. అదే సమయంలో కొన్ని దేశాలు, సంస్కృతులు విదేశీయుల ఆక్రమణల కారణంగా నామరూపాలు లేకుండా పోయాయి. మనకు ఇతరులు ఏమి చేయకూడదనుకుంటామో అది ఇతరులకు మనం చేయకపోవడం సర్వోత్తమ ధర్మం. మన ప్రాచీన ద్రష్టలైన మునులు లోక కళ్యాణం కొరకు నిర్వచించిన ధర్మం, దాని ఆచరణ మనకు వారసత్వంగా ఒక తరం నుంచి ముందు తరానికి వస్తూ మన తరం వరకు వచ్చింది. అంటే ధర్మచక్రం ఏ తరంలోనూ ఆగిపోలేదు. ఈ తరంలో ఆగిపోతే తరువాత తరం వారు ధర్మ భ్రష్టులవుతారు. ధర్మచక్రం ఆగిపోతే ఈ జాతి మనుగడ ఉండదు. – డా. ఎన్.అనంతలక్ష్మి -
రూ.7250 కోట్లు విరాళం ప్రకటించిన వారెన్ బఫెట్ - ఎవరికో తెలుసా?
ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరైన 'వారెన్ బఫెట్' (Warren Buffett) గతంలోనే తన సంపదలో 99 శాతాన్ని ఛారిటీకి అందిస్తానని వెల్లడించారు. అన్నమాట ప్రకారమే చేస్తున్న బఫెట్ తాజాగా స్వచ్ఛంద సంస్థలకు 876 మిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ హాత్వే షేర్లను అందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వారెన్ బఫెట్ బిలియనీర్ అయినప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతూ తమ పిల్లలు నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థలకు వేలకోట్లు విరాళాలు అందిస్తుంటాడు. ఇందులో భాగంగానే గత మంగళవారం 876 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 7250 కోట్లు) షేర్లను గిఫ్ట్‌గా ప్రకటించారు. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. వారెన్ బఫెట్ భార్య పేరు మీద ఉన్న 'సుసాన్ థాంప్సన్ బఫ్ఫెట్ ఫౌండేషన్'కు 1.5 మిలియన్ క్లాస్ B షేర్లను ప్రకటించారు. తమ పిల్లలు నిర్వహిస్తున్న మూడు ఫౌండేషన్లకు (షేర్వుడ్ ఫౌండేషన్, హోవార్డ్ జి. బఫ్ఫెట్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్) ఒక్కొక్క దానికి 3,00,000 బెర్క్‌షైర్ హాత్వే షేర్లను విరాళంగా ఇచ్చేసారు. గత ఏడాది కూడా భారీ షేర్లను విరాళంగా అందించారు. -
అన్నదానం చేస్తున్న పలు ధార్మిక సంస్థలు
-
గిఫ్ట్స్ వద్దు.. ఛారిటీ ముద్దు
లండన్ : ప్రపంచం అంతా ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హారీ, మేఘన్ మార్కెల్‌ల వివాహం గురించి. మే 19న విండ్సోర్లో వివాహంతో ఒక్కటవనున్న ఈ జంట తమ వివాహవేడుకకు హజరయ్యే అథిదులకు ఒక విన్నపం చేసింది. అదేంటంటే తమ వివాహానికి వచ్చేవారు బహుమతులు తేవద్దని, ఆ మొత్తాన్ని ముంబైలోని ‘మైనా మహిళ ఫౌండేషన్’కు విరాళంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. వివాహ వేడుక సందర్భంగా ఈ జంట కొన్ని సంస్థలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకుగాను కొన్ని సేవా సంస్థలను ఎన్నుకున్నారు. ఇవన్నీ మహిళా సాధికరత, సామాజిక మార్పు, పర్యావరణ మార్పు, ఎయిడ్స్ బాధితులు, నిర్వాసితులు, సాయుధ దళాలు, క్రీడలు, అనాథల కోసం పనిచేసే సంస్థలు. ఈ విషయం గురించి కెన్సింగ్టన్ రాజ ప్రసాదం అధికారులు మాట్లాడుతూ ఇవన్ని చాలా చిన్నసంస్థలు వీటికి, ప్రిన్స్ హారీ జంటకు ఎటువంటి అధికారిక సంబంధాలు లేవని ప్రకటించారు. కేవలం ఆ సంస్థలకు సహాయం చేయడం కోసమే వీటిని ఎంపిక చేసుకున్నారని వెల్లడించారు. వీటిల్లో మన దేశంలోని ముంబైకి చెందిన ‘మైనే మహిళ ఫౌండేషన్’ ఒకటి. మేఘన మార్కెల్ గత ఏడాది ఈ ఫౌండేషన్‌ను సందర్శించారు. ఈ ఫౌండేషన్ వారు మహిళలకు ఉపాధి కల్పించడం కోసం కృషి చేస్తుంది. అందుకుగాను ఈ సంస్థ మహిళలకు సానీటరీ నాపికిన్ల తయారీలో శిక్షణ ఇస్తుంది. దీనివల్ల మహిళలకు ఉపాధితో పాటు వ్యక్తిగత శుభ్రత గురించి కూడా వారికి సమాచారం అందించే వీలు కలుగుతుంది. ఈ సంస్థ చేసిన కృషి ఫలితంగా పాఠశాలల్లో ఆడపిల్లల డ్రాపవుట్స్ కూడా తగ్గాయి. ఈ సంస్థవారు కేవలం సానీటరి పాడ్ల తయారీ గురించి మాత్రమే కాక గణితం, ఆంగ్లం, మహిళల ఆరోగ్యం, ఆత్మ రక్షణ వంటి అంశాల్లో కూడా మహిళలకు శిక్షణ ఇస్తుంది. ప్రిన్స్ హారీ - మేఘన జంట తమ వివాహ సందర్భంగా మా ఈ సంస్థను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. వీరి సహాయంతో మేము మా సంస్థ సేవలను మరిన్ని మురికి వాడలకు విస్తరించే అవకాశం లభిస్తుందని సంస్థ స్థాపకురాలు సుహాని జలోతా హర్షం వ్యక్తం చేశారు. సుహానీ 2015లో మైనే మహిళా ఫౌండేషన్‌ను స్థాపించారు. ముంబై మురికి వాడల మహిళలకు ఉపాధి కల్పనతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేశారు. మైనే మహిళ ఫౌండేషన్‌తో పాటు మరో ఆరు సంస్థలను ఈ జంట ఎంపిక చేసుకున్నారు. అవి క్రైసిస్, స్కాటీస్ లిటిల్ సోల్జర్స్, స్ట్రీట్ గేమ్స్, సర్ఫర్స్ ఎగెనెస్ట్ సెవేజ్, సీహెచ్ఐవీఏ, వైల్డరనెస్ ఫౌండేషన్ యూకే. -
21న ‘చిత్తూరు ప్రజాగర్జన’
చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన అంశాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 21న చిత్తూరులో ‘చిత్తూరు ప్రజాగర్జన’ పేరిట భారీ సభ నిర్వహించనున్నట్లు సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక (ఎస్‌ఆర్‌పీవీ) జిల్లా జేఏసీ చైర్మన్, స్థానిక శాసన సభ్యుడు సీకే.బాబు చెప్పారు. శుక్రవారం చిత్తూరులోని నగర పాలక సంస్థ కార్యాలయంలో ఎస్‌ఆర్‌పీవీ జేఏసీ నేతల సర్వసభ్య సమావేశం జరిగింది. చిత్తూరులో తలపెట్టిన లక్షగళార్చన కార్యక్రమానికి బదులుగా చిత్తూరు ప్రజాగర్జన పేరిట సభను నిర్వహించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశం విషయాలను సీకే.బాబు మీడియాకు వెల్లడించారు. కుల,మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఆ రోజు ఉదయం 10 గంటలకు చిత్తూరులోని పీసీఆర్ కూడలిలో జ్యోతిరావ్ పూలే విగ్రహం వద్ద ప్రజాగర్జన నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకునే ప్రతిఒక్కరూ పాల్గొని వారి గొంతు వినిపించాలన్నారు. చిత్తూ రు, పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలిరావాలన్నారు. పాఠశాలలకు చెందిన చిన్నపిల్లల్ని సభకు తీసుకురాకూడదని తెలిపారు. ఇంటర్ ఆ పైన చదివే ప్రతి విద్యార్థి ప్రజాగర్జనలో పాల్గొనాలని కోరారు. మహిళా సంఘాలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సేవా సంస్థలు.. అన్ని రకాల ప్రజలు ఈ సభలో పాల్గొనాలన్నారు. జిల్లా గెజిటెడ్ ఆఫీసర్ల జేఏసీ ఛైర్మన్, అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ సీమాం ధ్రలో జరుగుతున్న సమైక్యాంద్ర ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి, కేంద్రానికి ఈ ప్రాంతవాసుల మనోభావాలు వినిపించడానికి ‘చిత్తూరు ప్రజాగర్జన’ వేదిక కానుందన్నారు. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సభలో పాల్గొని రాష్ట్ర సమైక్యతను చాటిచెప్పాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధికారుల జేఏసీ నాయకులు బసిరెడ్డి, అధికారులు అనిల్‌కుమార్‌రెడ్డి, చంద్రమౌళి, జయలక్ష్మి, నాగేశ్వరరావు, విజయసింహారెడ్డి, కృష్ణమనాయుడు, దేవప్రసాద్, డాక్టర్ దశరథరామయ్య, సచ్చిదానందవర్మ, డాక్టర్ జయరాజ్, ప్రభాకర్, గిరిప్రసాద్‌రెడ్డి, గంటా మోహన్, రెడ్డి శేఖర్‌రెడ్డి, శ్రీరాముమూర్తి, తేజోమూర్తి, ప్రకాష్ చంద్రారెడ్డి, శరశ్చంద్ర, మహేష్, సురేంద్రకుమార్ విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.