దానధర్మాలు ద్వంద్వ సమాసం. జంటగా కనపడతాయి. రెండూ ఒకటే అనుకుంటారు. ధర్మంలో దానం కూడా భాగం. దానం అంటే తన కున్నదానిని ఇతరులకు ఇవ్వటం. ‘ద’ అంటే ఇవ్వటం. ఆ ప్రక్రియ దానం. దానం, ధర్మం అనే రెండింటిని సమానార్థకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అడుక్కునేవాడు ‘‘అయ్యా! ధర్మం చేయండి.’’ అంటాడు. తనకున్న దానిని లేనివాడికి పంచటం ధర్మాచరణలో భాగం అని అర్థం చేసుకోవాలి. ‘‘నీ కిదేమైనా ధర్మంగా ఉందా?’’ అని అడిగి నప్పుడు ధర్మం అంటే న్యాయం అని అర్థం చేసుకోవాలి.
రసాయన శాస్త్రంలో ఉదజని ధర్మాలు అని అంటే దాని సహజగుణాలు అని అర్థం. ‘‘సూర్యుడు తూర్పున ఉదయించును’’ అన్నది ఏ కాలం అని వ్యాకరణంలో అడిగినప్పుడు తద్ధర్మ కాలం అని సమాధానం వస్తుంది. ఇక్కడ కర్తవ్యం, విధి, తప్పక చేయవలసినది అనే అర్థం. తన దగ్గర ఉన్న దానిని ఇతరులతో పంచుకోవటం ధర్మంలో భాగం కనుక దానానికి పర్యాయ పదంగా ధర్మం అని అనటం జరుగుతోంది.
దానం ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలో పెద్దలు మనకి చెప్పారు. ‘‘శ్రియా దేయం హ్రియా దేయం, సంవిదా దేయం’’ అని. తనదగ్గర ఉన్న సంపదకి తగినట్టుగా ఇవ్వాలట. ఒక కోటీశ్వరుడు ఒక రూపాయి దానం చేస్తే ఎంత సిగ్గుచేటు? వంద సంపాదించే రోజుకూలీ రూపాయి ఇస్తే పరవాలేదు కాని యాభై ఇస్తే తన తాహతుకి మించింది. తరవాత కష్టపడతాడు. సిగ్గుపడుతూ ఇవ్వాలట. ఇంతకన్న ఇవ్వలేక పోతున్నాను అని. తానే సిగ్గు పడుతూ ఉంటే తీసుకున్నవారు ఇంకెంత సిగ్గుపడాలో! తెలిసి ఇవ్వాలట.
‘‘గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం’’ అన్నట్టు కాకుండా మన చేతిలో నుండి జారిపోయింది దానం అనుకో కూడదు. ఇస్తున్నాను అని ఎరిగి ఇవ్వాలట. ఎవరికి ఇచ్చేది కూడా తెలిసి ఉండాలి. అంతా అయినాక వీళ్ళకా నేను ఇచ్చింది అని, ఇంత ఎందుకు ఇచ్చాను అని బాధపడకూడదు. దానాలు చాలా కారణాలుగా, చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. గ్రహదోషాలు ఉన్నాయి అంటే జపాలు తాము చేయలేరు కనుక ఎవరి చేతనైనా చేయిస్తారు. ఆ గ్రహానికి సంబంధించి కొన్ని వస్తువులు, ధనం దానం చేస్తారు.
ఇది ప్రతిఫలాపేక్షతో చేసేది. ఒక రకమైన వ్యాపారం అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కొంతమంది ఆడంబరం కోసం దానాలు చేస్తూ ఉంటారు. తాము చేసిన దానిని ప్రకటించటం, ప్రచారం చేసుకోవటం, ఫోటోలు తీయించుకుని వార్తాపత్రికలలో వేయించుకుంటూ ఉండటం చూస్తాం. తీసుకున్న వారిని చులకనగా చూస్తూ తమకు కృతజ్ఞులై ఉండాలని ఆశించటం కనపడుతుంది.
కొద్దిమంది ఎదుటి వారి అవసరం ఎరిగి అడగకుండానే దానం చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఉండదు. పైగా ఎవరికీ చెప్పనీయరు. కుడిచేత్తో చేసినది ఎడమ చేతికి తెలియ కూడదట. ఎందుకు దానం చేశావు అంటే నా దగ్గర ఉన్నది, వాళ్ళ దగ్గర లేదు... అంటారు. తీసుకున్నవారు సంతోషించినప్పుడు ఆ భావతరంగాలు ఇచ్చిన వారిని స్పృశిస్తాయి. వీరిని ఆవరించి ఉన్న ప్రతికూల తరంగాలు తప్పుకుంటాయి.
ఇవ్వటానికి మా దగ్గర ఏముంది? అని సన్నాయి నొక్కులు నొక్కుతారు కొందరు. తథాస్తు దేవతలుంటారు. తస్మాత్ జాగ్రత్త! ఏమీ లేక పోవుట ఏమి? ధనం మాత్రమేనా ఇవ్వదగినది? జ్ఞానం, శరీరం, ఆలోచన, మాట .. ఇట్లా ఎన్నో! తన జ్ఞానాన్ని పంచవచ్చు. జ్ఞానం లేకపోతే శరీరంతో సేవ చేసి సహాయ పడవచ్చు. అదీ చేత కాకపోతే మాట సహాయం చేసి సేద తీర్చవచ్చు. ఇది ధర్మమే కదా! ఈ ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది.
భారతీయ సంస్కృతిలో ధర్మానికి పెద్ద పీట వేశారు. ధర్మమే మనలను ఎల్లప్పుడు కాపాడుతుంది. మనం చాలా శతాబ్దాలు విదేశీయుల పాలనలో మగ్గిపోయాము. కాని ముష్కరులు మన ధర్మం మీద దెబ్బతీయలేక పోయారు. ధర్మగ్లాని దశలో మనం ఉన్నప్పుడు సాధుసంతులు, మహాత్ములు ఉక్కుగోడలా నిల్చొని ధర్మాన్ని కాపాడారు. అదే సమయంలో కొన్ని దేశాలు, సంస్కృతులు విదేశీయుల ఆక్రమణల కారణంగా నామరూపాలు లేకుండా పోయాయి.
మనకు ఇతరులు ఏమి చేయకూడదనుకుంటామో అది ఇతరులకు మనం చేయకపోవడం సర్వోత్తమ ధర్మం. మన ప్రాచీన ద్రష్టలైన మునులు లోక కళ్యాణం కొరకు నిర్వచించిన ధర్మం, దాని ఆచరణ మనకు వారసత్వంగా ఒక తరం నుంచి ముందు తరానికి వస్తూ మన తరం వరకు వచ్చింది. అంటే ధర్మచక్రం ఏ తరంలోనూ ఆగిపోలేదు. ఈ తరంలో ఆగిపోతే తరువాత తరం వారు ధర్మ భ్రష్టులవుతారు. ధర్మచక్రం ఆగిపోతే ఈ జాతి మనుగడ ఉండదు.
– డా. ఎన్.అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment