అందరికీ న్యాయం.. అదే సమన్యాయం
సామాన్యునికి న్యాయశాస్త్రం నారికేళపాకం. అక్షరాస్యుడికి సైతం కొరకరాని కొయ్య. రాజ్యాంగంలోని ప్రవేశిక ద్వారా అందరికీ న్యాయం, సమానత్వం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అది జరగాలంటే ప్రజలకి కనీస హక్కులపై అవగాహన ఉండాలి. ఆ అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. దానికోసమే నవంబర్ 9న న్యాయ, సాక్షరతా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఎవరికోసమైతే రాజ్యాంగం రాయబడిందో వారికి ఆ రాజ్యాంగం ప్రసాదించిన కనీస హక్కులు తెలియజేయాలి. వాళ్లకు ఈ రాజ్యాంగం, ఈ చట్టాలు మనవి అనే విశ్వాసం కల్పించాలి. ఇక్కడ న్యాయ సాక్షరత అంటే ప్రజలకి కనీస హక్కులపై అవగాహన కల్పించడం, అందుకోసం పని చేస్తున్న వ్యవస్థల గురించి తెలియజెప్పడం, ఆ వ్యవస్థలని ఆశ్రయించే మార్గాల గురించి తెలియజెప్పడం. అందుబాటులో ఉన్న న్యాయవ్యవస్థ గురించి సమాచారాన్ని వ్యాప్తిచేయడం.
ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించడానికి భయపడే కారణాలు రెండు. కాలాతీతమైన కేసులు, భరించలేని ఖర్చులు. కాలాతీతంగా నడుస్తున్న వ్యాజ్యాలు ప్రజలకు న్యాయవ్యవస్థమీద నమ్మకం సన్నగిల్లేలా చేస్తుంది. ఈ రెండు పరిష్కరించే దిశలో భాగంగా లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా అనవసర కారణాలతో సాగుతున్న వ్యాజ్యాలను ఇరుపక్షాల ఆమోదంతో త్వరగా పరిష్కరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల కేసుల్ని ఈ విధంగా పరిష్కరించి ప్రజల సమయాన్ని, వ్యయాన్ని కాపాడగలిగారు.
ముఖ్యంగా న్యాయ అవగాహన ప్రజల్లో కలగడానికి భాష కీలకమైంది. దీనికోసం అన్ని చట్టాలను అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించాలి. సామాన్యులకు అర్థమయ్యే దిశలో వాటిని అనువదిస్తే తద్వారా న్యాయవ్యవస్థ ఫలాలు అందరికీ అందుతాయి. ఎందుకంటే భాష అవరోధంగా ఉండడం వలన ప్రజలకు దీనిపై అవగాహనకి అవరోధం ఏర్పడుతుంది.
కోర్టులను ఆశ్రయించడం, ప్రజలకు దండగమారి వ్యవహారంగా మారింది. గెలిచినవాడికి, ఓడినవాడికి తేడాలేని పరిస్థితి. శ్రీశ్రీ అన్నట్లు న్యాయం గెలుస్తుందన్న మాట నిజమేగాని, గెలిచేదంతా న్యాయం కాదు. కోర్టులో కేసు గెలిచినా, గెలిచామన్న తృప్తి మిగలడం లేదు. దీనికి కారణం కాలాతీతమైన తీర్పులు, గెలుపుకి, ఓటమికి మధ్య తేడా లేకుండా చేస్తున్నాయి.
ఆదేశిక సూత్రాలలో భాగమైన 39(ఏ) అధికరణ న్యాయ సహాయం అందరికి అందుబాటులోకి రావాలని ఆర్థిక దుస్థితి వల్ల కాని, మరే ఇతర కారణాల వల్ల గాని న్యాయాన్ని పొందే అవకాశం కొందరికే పరిమితం కాకుండా ఉండాలని ఆ అధికరణ చెపుతోంది. దేశంలో పేదరిక శాతం ఎంత ఉన్నప్పటికీ మధ్యతరగతి వారికి కూడా న్యాయ స్థానాలను ఆశ్రయించడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారంగా ఉంది. ఇందుకోసం 1976లో భారత రాజ్యాంగానికి అధికరణ 39(ఏ) జతచేసి అవసరమైన వారికి ఉచిత న్యాయం అందించటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా నిర్దేశించారు. దీని కోసం చట్టాన్ని కూడా రూపొందించారు. అదే న్యాయసేవల అధికారిక చట్టం ఇది కేంద్ర చట్టం. ఈ చట్టం ద్వారా మహిళలు, పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు, అల్పాదాయ వర్గాలవారు, మత హింస బాధితులు, కులహింస బాధితులు ఈ చట్టం ద్వారా న్యాయం పొందటానికి అర్హులు.
న్యాయవ్యవస్థ ఫలాలు అందరికీ అందినప్పుడే సామాన్యులకి వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. నిబద్ధత, చిత్తశుద్ధితో పనిచేసే ఏ వ్యవస్థకైనా ప్రజల ఆమోదముద్ర ఎప్పుడూ ఉంటుంది. ఈ దిశలో న్యాయవ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే ఫలితాలు ఆశించిన మేర సిద్ధిస్తాయి. ప్రజాస్వామ్యవ్యవస్థలో ప్రజలే పాలకులు. వాళ్ల నిరంతర అప్రమత్తతే వ్యవస్థని కాపాడుతుంది. అలా అప్రమత్తంగా ఉండాలంటే ప్రజలు చైతన్యవంతులై ఉండాలి. చైతన్యం రావాలంటే వాళ్లకి చట్టాలపై, రాజ్యాంగంపై అవగాహన ఉండాలి. తెలుసుకోవడం సామాజిక బాధ్యత. అలా తెలుసుకుంటేనే దోపిడీ ఉండదు. హక్కుల ఉల్లంఘన ఉండదు. ఈ బాధ్యతని కేవలం ప్రభుత్వాలే కాకుండా ప్రజలందరూ గుర్తిస్తే తమనుతామే పాలించుకుంటున్నామన్న భావనకు సార్థకత ఉంటుంది.
(నేడు న్యాయ, సాక్షరతా దినోత్సవం సందర్భంగా)
సి.హెచ్.పుల్లారెడ్డి ,వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్,
కె.వి. రంగారెడ్డి న్యాయ కళాశాల, హైదరాబాద్