కోడ్ గర్జన
- ప్రజాగర్జనలో జెండాలు, ఫ్లెక్సీల ఏర్పాటుపై కన్నెర్ర
- వివరాలు సేకరించిన సిబ్బంది
- సభ ఖర్చుల మదింపులో అధికారులు
- టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదులు
- ఎమ్మెల్యే వెలగపూడితో పాటుమరో ఇద్దరికి నోటీసులు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : టీడీపీ ప్రజాగర్జన ఆ పార్టీ నాయకుల మెడకు చుట్టుకుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించడం పట్ల జిల్లా యంత్రాంగం సీరియస్‌గా స్పందించింది. నాయకులపై కేసులు పెట్టింది. నోటీసులు జారీ చేసింది. కొంతమందిపై నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. సభ ఏర్పాట్లతో పాటు జిల్లాలో ఎవరెవరూ బ్యానర్లు, జెండాలు, ఫెక్సీలు, హోర్డింగ్‌లు, కటౌట్‌లు పెట్టారన్న విషయాన్ని తీసిన వీడియోలను నిశితంగా పరిశీలిస్తోంది. ఖర్చుల మదింపు అనంతరం ఆయా నేతలపై చర్యలకు ఉపక్రమించాలన్న నిర్ణయానికి వచ్చింది.
ప్రజా గర్జన సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు నగరమంతటా ఆయా పార్టీ అగ్రనాయకుల ఫొటోలతో ఫ్లెక్సీలు, కటౌట్లు, జెండాలను ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో వాటిని సిబ్బంది తొలగించడానికి ప్రయత్నించగా టీడీపీ నేతలు వారిపై విరుచుకుపడ్డారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వాటన్నింటినీ సిబ్బంది వీడియో తీశారు. వీడియో వ్యూయింగ్ బృందం దీనిని నిశితంగా పరిశీలిస్తోంది. కోడ్ ఉల్లంఘిస్తూ వాటిని ఏర్పాటు చేసిన వారిపై కేసులు పెట్టనున్నారు.
ఎంసీఎంసీ అనుమతులు లేకుండా యాడ్స్
గర్జన సందర్భంగా నాయకులు పత్రికలకు ప్రకటనలిచ్చారు. ప్రకటనలలిచ్చే ముందు మీడియా సర్టిఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) నుంచి అనుమతులు పొందాలి. అయినా రూ.కోటి విలువ చేసే యాడ్స్ పత్రికల్లో వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తిగా లెక్కలు తేలిన తరువాత అనుమతులు లేకుండా ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకుంటారు.
నేడు పార్టీలతో సమావేశం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఇప్పటికే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోడ్ అమలు తీరును వివరించారు. టీడీపీ నాయకులు నియమావళిని ఉల్లంఘించడంతో మరోసారి శుక్రవారం సాయంత్రం అన్ని పార్టీల ప్రతినిధులతో కోడ్‌పై మరోసారి సమావేశం నిర్వహించనున్నారు.
కేసులు నమోదు
టీడీపీ నాయకులు ఒమ్మి సన్యాసిరావు, బొట్టా వెంకటరమణయాదవ్‌లపై అధికారులు మహారాణిపేట జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అన్నంరెడ్డి వాణి, బొట్టా వెంకటరమణ యాదవ్, అనిత సుకురులపై నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పశ్చిమ నియోజకవర్గంలో తొలగించని జెండాలు ఫ్లెక్లీల వీడియోను పరిశీలించి కేసులు నమోదు చేయనున్నారు.
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో పాటు, నేతలు అనితా సుకురు, రఘువీర్ సుకురులకు నోటీసులు జారీ చేశారు.
మిగిలిన నియోజకవర్గాల పరిధిలో కూడా తీసిన వీడియోను పరిశీలించిన అనంతరం నోటీసులు జారీ చేయడం లేదా కేసులు పెట్టే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.