స్థానిక ఎన్నికల్లో టీడీపీకి 'సున్నా'లేశారు..!
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో ఎక్కడ చూసినా గులాబీ దళం హవానే కనిపించింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట నగర పంచాయతీని కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలలో టీడీపీ జాడ కనిపించకపోవడం గమనార్హం. టీడీపీ పార్టీకి గ్రేటర్ వరంగల్ ప్రజలు 'సున్నా'లేశారు. వరంగల్‌లో 51 డివిజన్లలో, ఖమ్మంలో 48 డివిజన్లలో, అచ్చంపేటలో 4 వార్డులలో పోటీ చేసిన టీడీపీ ఏ ఒక్క స్థానంలోనూ కూడా నెగ్గలేక పోయింది. ఆ పార్టీ తరఫున ఒక్క డివిజన్ లోనూ ఖాతా తెరవకపోవడం ప్రజల్లో వ్యతిరేఖతను వెల్లడిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలే ఇక్కడ కూడా రిపీట్ అయ్యాయి.
బుధవారం జరిగిన ఓట్ల లెక్కింపులో కారు జోరు కొనసాగిందని చెప్పవచ్చు. వరంగల్ కార్పొరేషన్ మొత్తం 58 డివిజన్లలో టీఆర్ఎస్ 44 డివిజన్లలో గెలుపొందగా, కాంగ్రెస్ 4, బీజేపీ 1, ఇతరులు 9 డివిజన్లలో విజయం సాధించారు. టీడీపీ నేతలు టీఆర్ఎస్ లోకి వలసలు కట్టడం కూడా ఆ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 20 వార్డులు ఉండగా అన్ని వార్డులను టీఆర్ఎస్ గెలుచుకుంది.