దేవరపల్లి(ప.గో): దేవరపల్లి ఎంపీపీ పీఠానికి సంబంధించి జరిగిన ఎన్నికల్లో అధికారులపై దాడికి దిగిన ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలను ఎట్టకేలకు శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసిన అనంతరం రిమాండ్ కు తరలించారు. ఎలాగైనా ఆ మండలంలో పాగా వేయాలని భావిస్తున్న టీడీపీ ఘర్షణ వాతావరణాన్ని తిరిగి సృష్టించాలని యత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఒకసారి ఉద్రిక్తతలు సృష్టించి ఎన్నిక వాయిదా పడేలా చేసిన ఆ పార్టీ నేతలు ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లోనూ శాంతిభద్రతల సమస్య తీసుకురావాలని కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది.
దేవరపల్లి మండల పరిషత్‌లో 22 ఎంపీటీసీ స్థానాలకుగాను 12 వైఎస్సార్ సీపీ, 9 టీడీపీ గెల్చుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన పెనుబోతుల సుబ్బారావు వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. వైఎస్సార్ సీపీ తరఫున ఎంపీపీ పదవికి గన్నమని జనార్దనరావు పోటీకి దిగారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుల్ని భయపెట్టో, ప్రలోభపెట్టో తమవైపు తిప్పుకొని ఎంపీపీ పదవి దక్కించుకోవాలని టీడీపీ పథకాలు రచిస్తోంది.