తర్జనగర్జన
తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న ప్రజా గర్జన వేదిక మారింది. ఏయూ మైదానం నుంచి ఆర్‌కే బీచ్‌కు తరలింది. కాంగ్రెస్‌ను వీడిన మాజీ మంత్రి గంటా శ్రీని వాసరావు బృందాన్ని తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తూ చంద్రబాబు నాయు డు సమక్షంలో ఈ నెల 12న నిర్వహించతలపెట్టిన ఈ గర్జన మొదటినుంచి వివాదాస్పదంగానే తయారైంది.
నిజానికి ఈ నెల 8న మహిళా దినోత్సవ సభను భారీగా నిర్వహించి గంటా బృందాన్ని చేర్చుకోవాలని పార్టీ పెద్దలు భావించారు. కానీ మహిళా దినోత్సవ సభలో తాము చేరడం బాగోదని గంటా బృందం భావించింది. ఆధికారంలో ఉండగా మూడు నెలల క్రితం తన కుమార్తె వివాహాన్ని, నెల రోజుల క్రితం సహచర శాసన సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాస్ కుమార్తె వివాహాన్ని భారీగా నిర్వహించిన ఏయూ మైదానంలో గర్జన సభను పెట్టాలని గంటా నిర్ణయించారు. గంటా కుమార్తె వివాహ సమయంలో ఆయన మంత్రిగా ఉండడంతో ఏయూ మైదానానికి దారితీసే రహదారులను జీవీఎంసీ రెండు కోట్ల రూపాయలతో పునర్నిర్మించింది.
ఏయూ పాలకవర్గం కూడా వీరికి దాసోహమై సకల సదుపాయాలు కల్పించింది. అదే రీతిలో ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతాయని అనుకొన్న గంటాకు పోలీసు కమిషనర్ షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా మైదానం ఇవ్వడానికి ఏయూ వీసీ, సంబంధిత అనుమతులివ్వడానికి జీవీఎంసీ ముందుకు రాగా పోలీసు కమిషనర్ శివధర్‌రెడ్డి మాత్రం ఎన్నికల నిబంధనల మేరకు వ్యవహరించారు. ఎన్నికల సమయంలో విద్యా సంస్థల ప్రాంగణంలో సభలు నిర్వహించడం చట్టవిరుద్ధమంటూ స్పష్టం చేసి పోలీసు అనుమతిని నిరాకరించారు.
దీంతో ఏం చేయాలో తెలియక హడావుడిగా వన్‌టౌన్‌లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియాన్ని సందర్శించిన నేతలు ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా వద్దనుకొన్నారు. చేసేది లేక తొలుత వద్దకుకొన్న ఆర్‌కే బీచ్‌లోనే సభ పెట్టాలని నిర్ణయించారు. గంటా బృందం 2009 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యంలో చేరినప్పుడు ఆర్‌కే బీచ్‌లోనే సభ జరిగింది. గంటా తదితరులు 2009 ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ప్రజారాజ్యం పూర్తిగా విఫలమైంది. ఆ తర్వాత గంటా ప్రోద్భలంతో బీచ్‌లో నిర్వహించిన సమైక్యాంధ్ర సభ కూడా విఫలమైంది. సెంటిమెంట్‌గా బీచ్‌లో సభ నిర్వహిస్తే మంచిజరగదన్న అభిప్రాయం వీరిలో నాటుకొంది. పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇష్టం లేకపోయినా బీచ్‌లోనే సభ జరపాల్సి వస్తోంది. బీచ్‌లో సభ విజయవంతం కావాలంటే లక్షల్లో జనాన్ని తరలించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి అంత సీన్ లేదని స్థానిక దేశం నేతలు సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించిన సీనియర్‌నేత యనమల రామకృష్ణుడుకి స్పష్టం చేశారు.
12 వ తేదీన సెలవు దినం కూడా కానందున బీచ్‌లో పెద్దగా జనం ఉండరని, పూర్తిగా తాము తీసుకువచ్చేవారితోనే సభ నిర్వహించడం కష్టమని వారు అవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం అధికారంలో ఉండి తమను వేధింపులకు గురిచేసిన గంటా బృందం కోసం ఏర్పాటు చేస్తున్న సభకు తాము దూరంగా ఉంటామని మొదటి నుంచి పార్టీలో ఉన్న క్యాడర్ భీష్మించుకుకూర్చోవడం కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. ఆరునూరైనా బీచ్‌లో భారీగా సభ జరపాల్సిందేనని అధిష్టానం అదేశించడంతో చేసేది లేక ఏర్పాట్లలో నేతలు నిమగ్నమయ్యారు.