కల్యాణదుర్గం రూరల్: కల్యాణదుర్గం టీడీపీలో వర్గ విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేపట్టిన కార్యక్రమాల్లోనే వర్గ విభేదాలు బయట పడుతుండడంతో ఆ పార్టీ పరువు పోతోంది. తాజాగా బీటీపీ పరిధిలోని హంద్రీ-నీవా కాలువ అభివృద్ధి పనులు పరిశీలించేందుకు కాలువ వెంబడి పాదయాత్ర చేపట్టాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరితో పాటు పలువురు పాదయాత్రలో పాల్గొన్నారు. కళ్యాణదుర్గం- ఒంటిమిద్ది మధ్యలో కార్యక్రమాన్ని చేపట్టారు.
పాదయాత్ర ముందు వరుసలో మాజీ మంత్రులతో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఆయన తనయుడు మారుతీ చౌదరి తదితరులు కలిసి సాగుతుండగా... వెనుక ఉన్న టీడీపీ కల్యాణదుర్గం ఇన్‌చార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు, అనుచరులు కల్పించుకున్నారు. ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఇలాంటి కార్యక్రమాల్లో మాత్రం ముందు వరసలో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. దీంతో వివాదం చెలరేగింది. ఒకానొక దశలో మారుతీ చౌదరి, ఉమా వర్గీయులు పరస్పరం బూతులతో విరుచుకుపడ్డారు. కొద్ది సేపు గందరగోళం నెలకొంది. చివరకు నాయకులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత పాదయాత్ర కాస్త ముందుకు సాగగానే నాయకులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.
కల్యాణదుర్గంలో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు
Published Sun, Sep 12 2021 3:34 PM | Last Updated on Mon, Sep 20 2021 12:06 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment