Unnam Hanumantaraya Chowdhury
-
టీడీపీ నేతల బరితెగింపు
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరి తెగించారు. మంగళవారం రాత్రి బలహీన వర్గాలకు చెందిన వారి ఇళ్లల్లోకి బలవంతంగా చొరబడి దౌర్జన్యం చేశారు. అడ్డొచ్చిన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ నానా దుర్భాషలాడారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాన్ని సాకుగా తీసుకుని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారులు ఉన్నం మారుతీ చౌదరి, ఉన్నం ఉదయ్ భాస్కర్ చౌదరితో పాటు పలువురు ఆ పార్టీ నాయకులు అలజడి సృష్టించారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 2019 సంవత్సరంలో రైతులకు ఉచితంగా సబ్మెర్సిబుల్ మోటార్లు పంపిణీ చేశారు. అప్పట్లో మిగిలిపోయిన మోటార్లు ప్రస్తుతం కర్ణాటకకు తరలుతున్నాయంటూ తాజాగా సోషల్‌మీడియాలో ఓ పోస్టు వచ్చింది. దీంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారులు ఉన్నం మారుతీ చౌదరి, ఉన్నం ఉదయ్ చౌదరితో పాటు ఆ పార్టీ నాయకులు హైడ్రామాకు తెర తీశారు. మోటార్లు తరలుతున్న వాహనాన్ని ఉన్నం మారుతీ చౌదరి వెంబడించినట్లు, అది కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండలం లక్ష్మంపల్లికి వెళ్లినట్లు కట్టుకథ అల్లారు. సోదరుడు ఉన్నం ఉదయ్ భాస్కర్ చౌదరి, మరికొందరు టీడీపీ నాయకులతో కలసి మారుతీ చౌదరి నేరుగా లక్ష్మంపల్లిలోని బలహీన వర్గానికి చెందిన వడ్డే శారదమ్మ ఇంటి వద్దకు చేరుకున్నాడు. దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడుతున్న టీడీపీ నేతలను శారదమ్మ, కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిని టీడీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషిస్తూ లోపలికి చొరబడ్డారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానిక దళిత యువకుడు విరుపాక్షిని కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. గాయపడిన అతను ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు శారదమ్మ ఇంటి వద్దకు చేరుకుని టీడీపీ నేతలను నిలదీశారు. రాత్రి సమయంలో ఇంట్లోకి ఎలా చొరబడతారని, మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదా అంటూ మండిపడ్డారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా, కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు, ఎస్ఐ యువరాజ్ బుధవారం పోలీసు సిబ్బందితో కలిసి లక్ష్మంపల్లిలో పర్యటించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల అదుపులో ఉన్నం మారుతీ చౌదరి, నేతలు ఉన్నం బ్రదర్స్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్నం మారుతీ చౌదరి, ఉన్నం ఉదయ్ భాస్కర్ చౌదరితో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ బి.శ్రీనివాసులు వెల్లడించారు. మంగళవారం రాత్రి జరిగిన ఘటనపై వడ్డే శారదమ్మ, హరిజన విరుపాక్షి ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు ఉన్నం మారుతీ చౌదరి, ఉన్నం ఉదయ్ భాస్కర్ చౌదరి, యర్రంపల్లి సత్తి, గోళ్ల వెంకటేశులు, కైరేవు తిమ్మరాజు, కరిడిపల్లి రంగప్పలతో పాటు మరో పదిమందిపై 147, 148, 354, 422 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉన్నం మారుతీ చౌదరితో పాటు టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కాగా, తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నాయకులు కౌంటర్ కేసుకు తెర తీశారు. ఉన్నం మారుతీ చౌదరి ఆదేశాల మేరకు టీడీపీ నాయకుడు కరిడిపల్లి రంగప్ప తననూ కులం పేరుతో దూషించి, దాడికి యత్నించారంటూ బాధితులపైనే బుధవారం మధ్యాహ్నం శెట్టూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. మంగళగిరికి చేరిన పంచాయితీ
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గం టీడీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. ఆధిపత్య పోరులో ఓ వర్గం నేతలు.. మరో వర్గం నాయకుడిపై దాడికి తెగబడిన ఘటన సంచలనం రేకెత్తించింది. బాధితుడు తెలిపిన మేరకు.. ఆదివారం రాత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గానికి చెందిన ఆ పార్టీ మాజీ కౌన్సిలర్ తిమ్మరాజుపై పార్టీ ఇన్చార్జ్ ఉమామహేశ్వరనాయుడు అనుచరులు నాగరాజు, బ్రహ్మ, గోవిందు దాడి చేశారు. అడుకోబోయిన తిమ్మరాజు కుమార్తెపై కూడా దౌర్జన్యం చేశారు. ఘటనకు సంబంధించి ఆదివారం రాత్రే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తిమ్మరాజు తెలిపారు. అసలేం జరిగింది... జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజలను పెడదోవ పట్టించేందుకు టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు కళ్యాణదుర్గంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమానికి ఉన్నం, ఉమ వర్గీయులు వేర్వేరుగా ఆదివారం ఉదయం నుంచి జన సమీకరణలో నిమగ్నమయ్యారు. ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో చివరకు ఉమామహేశ్వరనాయుడు డబ్బులు పంచి కూలీలను రప్పించుకుంటున్నాడంటూ ఆదివారం సాయంత్రానికి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది. ఉన్నం వర్గీయుడైన మాజీ కౌన్సిలర్ తిమ్మరాజునే ఈ పోస్టింగ్ పెట్టాడంతూ రాత్రి అతనిపై ఉమ వర్గీయులు దాడికి దిగారు. దీంతో తిమ్మరాజు చేతికి, ముఖానికి రక్తగాయాలయ్యాయి. చదవండి: (అనంతపురం టీడీపీలో భగ్గుమంటున్న వర్గ విభేదాలు) నవ్విపోదురు గాక.. ‘నవ్విపోదురు గాక మా కేటి సిగ్గు’ అన్న చందంగా మారింది కళ్యాణదుర్గం టీడీపీ నేతల తీరు. ప్రభుత్వ పథకాలను అభాసు పాలు చేసేందుకు ప్రయత్నించి.. వారే జనం దృష్టిలో నవ్వుల పాలయ్యారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సోమవారం ఉదయం కళ్యాణదుర్గంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అయితే ఉదయం టీడీపీ ఇన్చార్జ్ ఉమామహేశ్వరనాయుడు తన వర్గం వారితో నిరసన వ్యక్తం చేసి వెళ్లిపోగానే.. అదే స్థలంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. ఒకే పార్టీలో వేరు కుంపట్లతో ఒకే ప్రదేశంలో నిరసనలు చేపట్టడపై జనం చలోక్తులు విసిరారు. మంగళగిరికి చేరిన మడకశిర టీడీపీ పంచాయితీ మడకశిర: నియోజకవర్గంలోని టీడీపీలో వర్గపోరు జోరందుకుంది. మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. దీంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఫలితంగా పలువురు ముఖ్యమైన నాయకులు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే మడకశిర మాజీ ఎంపీపీ బజ్జప్ప, అగళి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణయాదవ్ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. మరికొందరు కూడా టీడీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. మాజీలైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పార్టీలో వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారు. ఏడాదిగా పార్టీ కార్యక్రమాలను కూడా వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాల యాలను కూడా వేర్వేరుగా ఏర్పాటు చేసుకున్నారు. అంతే కాకుండా హైమాండ్‌కు వీరు పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మడకశిర టీడీపీ పంచాయితీ మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరింది. బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి రావాల్సిందిగా అధినేత నుంచి వీరిద్దరికీ పిలుపు వచ్చింది. -
టీడీపీలో కుతకుతలు: నిన్న జేసీ, కాల్వకు.. నేడు ఉమా, ఉన్నం
కల్యాణదుర్గం రూరల్: కల్యాణదుర్గం టీడీపీలో వర్గ విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేపట్టిన కార్యక్రమాల్లోనే వర్గ విభేదాలు బయట పడుతుండడంతో ఆ పార్టీ పరువు పోతోంది. తాజాగా బీటీపీ పరిధిలోని హంద్రీ-నీవా కాలువ అభివృద్ధి పనులు పరిశీలించేందుకు కాలువ వెంబడి పాదయాత్ర చేపట్టాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరితో పాటు పలువురు పాదయాత్రలో పాల్గొన్నారు. కళ్యాణదుర్గం- ఒంటిమిద్ది మధ్యలో కార్యక్రమాన్ని చేపట్టారు. పాదయాత్ర ముందు వరుసలో మాజీ మంత్రులతో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఆయన తనయుడు మారుతీ చౌదరి తదితరులు కలిసి సాగుతుండగా... వెనుక ఉన్న టీడీపీ కల్యాణదుర్గం ఇన్చార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు, అనుచరులు కల్పించుకున్నారు. ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఇలాంటి కార్యక్రమాల్లో మాత్రం ముందు వరసలో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. దీంతో వివాదం చెలరేగింది. ఒకానొక దశలో మారుతీ చౌదరి, ఉమా వర్గీయులు పరస్పరం బూతులతో విరుచుకుపడ్డారు. కొద్ది సేపు గందరగోళం నెలకొంది. చివరకు నాయకులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత పాదయాత్ర కాస్త ముందుకు సాగగానే నాయకులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. -
‘ఒక్కొక్క నా కొ..’ అంటూ టీడీపీలో రచ్చకెక్కిన విబేధాలు
కళ్యాణదుర్గం రూరల్: అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో విబేధాలు మళ్లీ రచ్చకెక్కాయి. ఈసారి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ‘ఉమా’ వైపు కొందరు.. ‘ఉన్నం’ వైపు మరికొందరు చేరడంతో ఆధిపత్యపోరు తారస్థాయికి చేరుకుంది. ఇరువర్గాల వాగ్వాదాలతో స్థానిక టీడీపీ కార్యాలయం మంగళవారం ప్రతిధ్వనించింది. వివరాల్లోకి వెళితే... మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, తన వర్గీయులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. కాసేపు ఆగి, తిరిగి వెళ్లిపోతూ అప్పటికే అక్కడ కూర్చొని ఉన్న ప్రస్తుత టీడీపీ ఇన్చార్జ్ ఉమామహేశ్వరనాయుడు వర్గానికి చెందిన కొందరిని ఉద్దేశించి ఉన్నం వర్గీయుడైన కొండాపురం ముత్యాలరెడ్డి దుర్భాషలాడారు. ‘ఒక్కొక్క నా కొ... వచ్చి ఇష్టం వచ్చినట్లు కూర్చొన్నారు. పెద్దాయన (ఉన్నం హనుమంతరాయ చౌదరి) వచ్చినారన్న కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు. ఎక్కడి నా కొ...లో అంతా ఇక్కడ చేరి మర్యాద లేకుండా కూర్చొంటున్నారు’ అంటూ తీవ్రంగా దూషిస్తూ.. అక్కడున్న కుర్చీలను ఎత్తి విసిరేశారు. దీంతో ఉమా వర్గీయులైన మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ, నాయకులు కొల్లప్ప, సత్తి, డిష్ మురళి తదితరులు ఉన్నం వర్గీయులపై వాదనకు దిగారు. ఆ సమయంలో గందరగోళం చోటు చేసుకుంది. అరుపులతో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యాలయం లోపల ఏదో జరుగుతుందంటూ బయట జనం గుమికూడారు. దీంతో కొందరు సీనియర్ నాయకులు జోక్యం చేసుకుని రెండు వర్గాల వారిని సర్దిచెప్పి పంపించి అప్పటికప్పుడు పరిస్థితిని కాస్త చక్కదిద్దారు. కానీ రెండు వర్గాల నాయకులు మాత్రం ఏదో రోజు తేల్చుకుందామంటూ అక్కడి నుంచి వెళ్లపోవడం గమనార్హం. -
కళ్యాణదుర్గం: అనంత టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
-
అనంత టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
సాక్షి, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా టీడీపీలోని వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వరనాయుడు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే రీతిలో విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉమామహేశ్వరనాయుడుకు సంబంధించిన ఫ్లెక్సీలను ప్రత్యర్ధులు చించి, నిప్పు పెట్టారు. ఈ ఘటన అనంతపురం టీడీపీలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఉమామహేశ్వరనాయుడు అనుచరులు మాజీ ఎమ్మెల్యే ఉన్నం వర్గీయులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో ఇరు వర్గీయులు పార్టీ సమావేశాల్లో ఘర్షణలకు దిగిన విషయం తెలిసిందే. చదవండి: ఏబీఎన్ రాధాకృష్ణపై మంత్రి కొడాలి నాని ఫైర్ -
అనంత టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, కళ్యాణదుర్గం: టీడీపీలోని వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. పార్టీ వి స్తృత స్థాయి సమావేశాల సందర్భంగా శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక టీడీపీ కార్యాలయంలో తాజా, మాజీ ఎమ్మెల్యే ఉన్నం వర్గీయులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించగా.. ఇటీవల ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీ చేసిన ఉమా మహేశ్వర నాయుడు తన సొంత కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పరిశీలకుడుగా బీటీ నాయుడు కార్యక్రమాలకు హాజరయ్యారు. మొదటగా ఉమా మహేశ్వర నాయుడు నిర్వహించిన సమావేశంలో పాల్గొని.. మధ్యాహ్నం 3.30 గంటలకు మాజీ ఎమ్మెల్యే ఉన్నం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. దీంతో ఉన్నం వర్గీయులు ఆర్కే రాజు, ఆర్కే అలెగ్జాండర్, మాజీ సర్పంచ్ శ్రీరాములు, షామీర్, నారాయణ, మాజీ జడ్పీటీసీ మల్లికార్జున తెలుగు యువత నాయకుడు కిశోర్, వెంకటేశులు తదితరులు సమావేశానికి హాజరైన బీటీ నాయుడును చుట్టుముట్టి నిలదీశారు. ఒక్కసారిగా అందరూ గళం విప్పడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పార్టీ అధిష్టానం ఇన్చార్జ్ వ్యవస్థను నియమించకపోయినా ఇన్చార్జ్గా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఉన్నం వర్గీయులను పార్టీకి దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం ఎమ్మెల్యే అభ్య రి్థగా ఉమా మహేశ్వర నాయుడిని పంపితే అందరూ కష్టపడి పనిచేశామని, రాష్ట్రంలో ప్రతిపక్ష పారీ్టకి అనుకూలంగా గాలి ఉండటంతో 151 చోట్ల ఓడిపోయామన్నారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఓడించారని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉన్నం హనుమంతరాయ చౌదరికి టికెట్ రానప్పుడు తామంతా అధినేత చంద్రబాబు, నారా లోకే‹Ùను సంప్రదిస్తే జిల్లా అధ్యక్ష పదవి కట్టబెడుతానని, ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఉన్నం హనుమంతరాయ చౌదరికి సముచిత స్థానం ఇవ్వకపోతే ఒప్పుకునేది లేదని స్పష్టంచేశారు. ఉన్నంతో పాటు ఆయన వర్గీయులను పార్టీకి దూరం చేసే దుష్ప్రచారాలు జరుగుతున్నాయని వాపోయారు. కంబదూరు మాజీ సర్పంచ్ శ్రీరాములు స్పందిస్తూ పార్టీలోకి చంద్రబాబు కన్నా తామే ముందు వచ్చామని, మా తర్వాతే చంద్రబాబు టీడీపీలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి స్పందిస్తూ పార్టీ కోసం పనిచేస్తే కొందరు ఉన్నం హనుమంతరాయ చౌదరికి టికెట్ రాకుండా అడ్డుకున్నామని.. పార్టీ అభ్యర్థి గెలిచినా, ఓడినా తమకేమీ సంబంధం లేదని మాట్లాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం బీటీ నాయుడు స్పందించి పారీ్టలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని, సమస్య పరిష్కారానికి అధినేత దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. -
ఉన్నం వర్సెస్ ఉమా
అనంతపురం,కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పార్టీ ఇన్చార్జ్ ఉమామహేశ్వరనాయుడుల మధ్య శుక్రవారం ఘర్షణ జరిగింది. ఇరువురి మధ్య ఘర్షణతో రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో పార్టీ కార్యాలయంలో ఉద్రిక్తతకు దారి తీసింది.ఎన్నికల అనంతరం తాజా మాజీ ఎమ్మెల్యే ఉన్నం టీడీపీ కార్యాలయానికి అడపాదడపా వచ్చి వెళ్లేవారు. పార్టీ కార్యాలయ మరమ్మతులు జరుగుతుండటంతో ఇటీవల కార్యాలయానికి రాలేదు. దసరా పండుగ రోజు కార్యాలయానికి వచ్చి వెళ్లారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉన్నం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపు నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించి వివాహ కార్యక్రమానికి బయల్దేరారు. వాహనంలో బయలుదేరి వెళ్తుండగా టీడీపీ ఇన్చార్జ్ ఉమామహేశ్వరనాయుడు వాహనంలో కార్యాలయానికి వచ్చి లోపలికి వెళ్తూ వైఎస్సార్సీపీకి ఓట్లేసిన వారు పార్టీ కార్యాలయానికి వచ్చే అర్హత ఏముంటుందంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఉమా వ్యాఖ్యలను అనుచరులు ఉన్నం దృష్టికి తీసుకొచ్చారు. ‘రావొద్దనడానికి కార్యాలయం వారి అబ్బ సొమ్మా.. పెద్దాయనా.. వాహనం దిగు.. తిరిగి కార్యాలయంలోకి వెళ్దాం’ అని కార్యకర్తలు పట్టుబట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన ఉన్నం తనపై ఆరోపణలు చేసిన వారు ఎవడంటూ తీవ్ర పదజాలంతో కార్యాలయంలోకి వెళ్లారు. ఈ సందర్భంలో ఇరు వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాటలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా పార్టీ కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అక్కడున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. అనంతరం ఉన్నం అక్కడి నుంచి నిష్క్రమించగా.. ఉమా మహేశ్వర నాయుడు వర్గీయులు మరికొంతమంది పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. -
రండి బాబూ... రండి!
సాక్షి, కంబదూరు: కళ్యాణదుర్గంలో సోమవారం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో నామినేషన్‌కు మండలం నుంచి భారీగా జనాన్ని తరలించాలని ఆయన వర్గీయులు ప్రయత్నించారు. కానీ ప్రజలెవరూ స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడంతో గత్యంతరం లేక ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.400 వరకు కూలి డబ్బులు ఇచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. -
తెగని పంచాయితీ!
ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. టిక్కెట్లు ఖరారు చేసేందుకు ‘అనంత’ టీడీపీ నేతలను అమరావతికి పిలిపించిన ఆ పార్టీ అధినేతచంద్రబాబు అభ్యర్థుల సంగతి ఎటూ తేల్చలేకపోయారు. ఆరు నియోజకవర్గాలకే అభ్యర్థులను ఖరారు చేసి, 8 స్థానాలను పెండింగ్‌లో ఉంచారు. వారం రోజులోపు అభ్యర్థులను ప్రకటిస్తానని, ఎవరికి టిక్కెట్ ఇచ్చినా అంతా కలిసి పనిచేయాలని సూచించారు. చంద్ర బాబు ప్రకటనతో ఆయన బావమరిది బాలకృష్ణ మినహా తక్కిన 7 నియోజకవర్గాల్లోని సిట్టింగ్‌ల్లో గుబులు మొదలైంది. అర్ధరాత్రి వరకూ సాగిన చర్చలు కొలిక్కి రాకపోవడం, కొన్నిటికి మాత్రమే హామీ ఇచ్చి, తక్కిన స్థానాలను పెండింగ్‌లో ఉంచడంతో ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న వారంతా ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం : రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆపార్టీ అధినేత చంద్రబాబు జిల్లా నేతలకు కబురు పంపారు. దీంతో జిల్లాలోని 14 నియోజకవర్గాలకు చెందిన నేతలు బుధవారం ఉదయం 9 గంటలకే అమరావతిలో సీఎం నివాసం ఉంటున్న ఉండవల్లికి చేరుకున్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో మంత్రి జవహర్ సమక్షంలో ప్రత్యేకంగా టెంట్లు వేసి నియోజకవర్గాల వారీగా అభిప్రాయసేకరణ జరిపారు. ఆరు స్థానాల్లో అభ్యర్థులు ఖరారు! జిల్లాలోని 14 స్థానాల్లో హిందూపురం మినహా తక్కిన 13 స్థానాల్లో 7 స్థానాలకు మాత్రమే అభిప్రాయ సేకరణ జరిగింది. దీంతో అభిప్రాయసేకరణ జరగని 6 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారైనట్లే అని మంత్రులు సూచన ప్రాయంగా నాయకులు, కార్యకర్తలకు తెలిపారు. వీటిలో తాడిపత్రి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డి, పెనుకొండ నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, రాయదుర్గం నుంచి కాలవ శ్రీనివాసులు, ధర్మవరం నుంచి వరదాపురం సూరి, రాప్తాడు నుంచి పరిటాల సునీత టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులకు బరిలోకి దిగనున్నట్లు తేల్చారు. వీరితోపాటు అనంతపురం ఎంపీ అభ్యర్థిగా జేసీ పవన్ కుమార్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. అధికారిక ప్రకటన చేయకపోయినా వీరే అభ్యర్థులుగా టీడీపీ అధిష్టానం ఆయా నేతలతో పాటు కార్యకర్తలకు సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. పెండింగ్‌లో 8 స్థానాలు ప్రకటించిన 6 స్థానాలు మినహా అనంతపురం, గుంతకల్లు, శింగనమల, కళ్యాణదుర్గం, హిందూపురం, మడకశిర, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. వీటిలో హిందూపురం మినహా తక్కిన 7 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందని నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. మొదట కళ్యాణదుర్గం సమీక్ష జరిగింది. ఇందులో అభిప్రాయసేకరణ ప్రారంభం కాగానే ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి వ్యతిరేకవర్గానికి చెందిన రామ్మోహన్‌చౌదరి, మల్లిఖార్జున, నారాయణ, రమేశ్‌తో పాటు పలువురు తీవ్రస్థాయిలో వ్యతిరేకంచారు. చౌదరి అయితే ఓడిపోతారని, అతన్ని మార్చాలని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు కూడా వ్యతిరేకవర్గంపై మాటల దాడికి దిగారు. పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో అక్కడంతా గందరగోళంగా మారింది. దీంతో ఎవరి అభిప్రాయాన్ని వారు కాగితాలపై రాసి ఇవ్వాలని కోరారు. ప్రభాకర్‌చౌదరికి టిక్కెట్ ఇవ్వొద్దు కళ్యాణదుర్గం టికెట్ విషయంలో జరిగిన రభసను దృష్టిలో ఉంచుకుని అనంతపురం నియోజకవర్గంపై అభిప్రాయ సేకరణ ప్రారంభం కాగానే... అభ్యర్థిత్వంపై ఎవరు ఏమీ మాట్లాడొద్దని, అభిప్రాయాలు కాగితాల్లో రాసివ్వాలని మంత్రి దేవినేని చెప్పారు. ప్రభాకర్ చౌదరి వర్గీయులకు 63 మంది అక్కడకు వచ్చేందుకు అనుమతిచ్చారు. జకీవుల్లా, జయరాం వర్గీయులను 20 మందినే అనుమతించారు. దీంతో అభిప్రాయాన్ని చెప్పకుండా చౌదరి వ్యతిరేకవర్గం సభను బాయ్‌కాట్ చేసి బయటకు వచ్చేశారు. తర్వాత పుట్టపర్తి నియోజకవర్గం సమావేశం నిర్వహించారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డికి టిక్కెట్ ఇవ్వొద్దని, నియోజకవర్గంలో పార్టీ బలహీనపడటంతో పాటు కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నేతలను కూడా ‘పల్లె’ నిర్లక్ష్యం చేశారని చంద్రమోహన్ అనే కార్యకర్త మాట్లాడారు. దీంతో పల్లె రఘునాథరెడ్డి గన్‌మన్ చంద్రపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే కార్యకర్తలంతా ‘పల్లె’కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పుట్టపర్తి అభిప్రాయ సేకరణలోనూ గందరగోళం జరిగింది. తర్వాత శింగనమల, మడకశిర, కదిరి, గుంతకల్లు నియోజకవర్గాలపై అభిప్రాయసేకరణ చేశారు. వీటితో పాటు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి సంగతి కూడా తేల్చలేదు. ఇక హిందూపురం నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ సమావేశానికి రాలేదు. హిందూపురం నుంచి బాలకృష్ణే బరిలో ఉండొచ్చని టీడీపీ నేతలు చెబుతున్నారు. పదిరోజుల్లో అభ్యర్థులందరినీ ప్రకటిస్తానన్న చంద్రబాబు అభిప్రాయ సేకరణ తర్వాత 14 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు ప్రసగించారు. వారం, పదిరోజుల్లోపు ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ ప్రకటిస్తానని చెప్పారు. ఎవరికి టిక్కెట్ వచ్చినా, రాకపోయినా అంతా పార్టీ కోసం పనిచేయాలని చెప్పారు. విభేదాలను పక్కనపెట్టాలని, వాటి సంగతి తాను చూసుకుంటానన్నారు. ఏదిఏమైనా బు«ధవారం సమావేశంతో గుంతకల్లు, శింగనమల స్థానాలకు కచ్చితంగా అభ్యర్థులు మారతారని స్పష్టమైంది. అనంతపురం, కళ్యాణదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను మార్చే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా బుధవారం టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ గైర్హాజరయ్యారు. గుప్తా చేరికతో ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌కు టిక్కెట్ దక్కదనే ప్రచారం సాగుతోంది. గుప్తాకు గుంతకల్లు టిక్కెట్ దాదాపు ఖాయమని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తనను కాదని గుప్తాకు టిక్కెట్ ఇస్తే పార్టీలో కొనసాగే ప్రసక్తే లేదని జితేంద్ర పార్టీ నేతలతో తే ల్చిచెప్పినట్లు తెలుస్తోంది. -
ఉన్నంకు అసమ్మతి సెగ
అనంతపురం, కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం టీడీపీలో గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. రాజకీయ కురువృద్ధుడు, టీడీపీ సీనియర్ నాయకుడు ఉన్నం హనుమంతరాయ చౌదరికి సొంత పార్టీలోనూ అసమ్మతి సెగపుట్టింది. ‘సేవ్ ఏపీ’ పేరుతో ఎమ్మెల్యే ‘ఉన్నం’ వ్యతిరేక వర్గీయులు శుక్రవారం బల నిరూపణకు దిగారు. నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. యార్డు చైర్మన్ దొడగట్ట నారాయణ, కంబదూరు జెడ్పీటీసీ రామ్మోహన్ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు, ఎంపీపీ మంజుల, మాజీ ఎంపీపీలు మల్లికార్జున, లక్ష్మీనారాయణ చౌదరి, మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్, స్వర్గీయ బాదన్న కుమారుడు రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, పట్టణ కన్వీనర్ మురళి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బల నిరూపణ ర్యాలీ చేశారు. పట్టణంలోని సాయిబాబా ఆలయం నుంచి టీ సర్కిల్, వాల్మీకి సర్కిల్ మీదుగా ర్యాలీ చేశారు. టీడీపీ కార్యాలయం నుంచి కాకుండా సాయిబాబా ఆలయం నుంచి ర్యాలీ ప్రారంభించారు. ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆయన వర్గీయులు ర్యాలీలో పాల్గొనకపోవడమే అసమ్మతి వర్గీయుల బలనిరూపణ అనడానికి నిదర్శనం. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే ఆయన వర్గీయులు శెట్టూరు మండలంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని మోదీకి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయజేశారు. కుటుంబ పాలనతో నలిగిపోయాం : ‘పదేళ్లపాటు ప్రతిపక్షంలో పార్టీ కోసం శ్రమించాం. అధికారంలోకొచ్చాక కుటుంబ పాలనతో నలిగిపోయాం’ అని మార్కెట్‌యార్డు చైర్మన్ నారాయణ, జెడ్పీటీసీ రామ్మోహన్ చౌదరి, మాజీ ఎంపీపీ మల్లికార్జున, మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్, ఉమా మహేశ్వర నాయుడు, బాదెన్న కుమారుడు రమేష్ మండిపడ్డారు. ర్యాలీలో భాగంగా టీ సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. అందరూ సమష్టిగా కష్టపడి పార్టీని గెలిపించుకుంటే కొందరు స్వార్థపరులు కుటుంబ పాలనతో సంపదను సొంతం చేసుకున్నారని ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఆయన కుటుంబ సభ్యులపై పరోక్షంగా విమర్శలు చేశారు. ర్యాలీకి రాకూడదని స్వార్థ పరులు బెదిరించినా వేలాదిగా తరలివచ్చినందుకు పాదాభివందనం చేస్తామన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించే అభ్యర్థిని ఎన్నుకుందామని నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలేదని, ఇక్కడ కొందరు స్వార్థ పరులు సొంత ప్రచారం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని, పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. -
అంతా మా ఇష్టం
ఎన్టీఆర్ వర్ధంతిని ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఆయన కుమారులు తమ బలప్రదర్శనకు వేదికగా చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి తమ కుటుంబానికే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని, పార్టీ శ్రేణులంతా తమ వైపే ఉన్నారని చూపించుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ద్విచక్రవాహనదారులకు సొంత పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించడంతోపాటు వారి జేబులు సైతం నింపి అంతా మా ఇష్టం అన్న రీతిలో బైకు ర్యాలీతో హడావుడి చేశారు. అనంతపురం, కళ్యాణదుర్గం: ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా శుక్రవారం కళ్యాణదుర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఆయన కుమారులు మారుతీ చౌదరి, ఉదయ్ చౌదరిల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందాన పట్టణవాసులను తీవ్ర ఇబ్బందులపాలు చేశాయి. వందలాది ద్విచక్రవాహనాలు ప్రధాన రహదారుల్లో చక్కర్లు కొట్టడం, అనంతపురం ప్రధాన రహదారుల్లో రాకపోకలు బంద్ చేయడం, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు విధించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ప్రజల సమస్యల పరిష్కారం కోరుతూ ర్యాలీ, ధర్నా లాంటి ఆందోళన కార్యక్రమాలు చేయాలంటే 30 పోలీసు యాక్టు అమల్లో ఉందని చెప్పి సవాలక్ష నిబంధనలు విధిస్తున్న పోలీసు అధికారులు టీడీపీ నాయకుల బలప్రదర్శనకు మాత్రం అడ్డు చెప్పలేదు. పైగా దగ్గరుండి సహకరించారు. స్వయానా రూరల్ ఎస్ఐ నబీరసూల్ ఆధ్వర్యంలో టీడీపీ బైక్ ర్యాలీకి, ఇతర హంగామా కార్యక్రమాలకు బందోబస్తు నిర్వహించారు. ఇదంతా ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల కనుసన్నల్లో జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలతో ఇబ్బందులు టీడీపీ కార్యాలయం ముందు ప్రధాన రహదారిలో సభా వేదికను ఏర్పాటు చేయడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బైపాస్ రోడ్డులోని రింగురోడ్డు నుంచి వాహనాలు మరో మార్గం గుండా ఆర్టీసీ బస్టాండ్, రాయదుర్గం రహదారులకు వెళ్లేలా బందోబస్తు నిర్వహించారు. అలాగే అనంతపురం రహదారి వైపు వాహనాలు వెళ్లకుండా టీ సర్కిల్, అక్కమాంబ సర్కిల్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో పట్టణంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు ఈ ఆంక్షలను ఛీదరించుకుని ఛీవాట్లు పెట్టారు. బైకు ర్యాలీకి డుమ్మా కొట్టినఅసమ్మతి వర్గీయులు అసమ్మతి నాయకులుగా ముద్రపడిన మార్కెట్‌యార్డు చైర్మన్ దొడగట్ట నారాయణ, మాజీ ఎంపీపీలు మల్లికార్జున, లక్ష్మినారాయణ చౌదరి, కంబదూరు జెడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్‌చౌదరి, కళ్యాణదుర్గం ఎంపీపీ మంజుల భర్త కొల్లప్ప, పట్టణ కన్వీనర్ డిష్ మురళి బైకు ర్యాలీ వైపు కన్నెత్తి చూడలేదు. ర్యాలీ సమయంలో ఎన్టీఆర్ వర్థంతి వేడుక సభ వద్దే కూర్చుని ఎమ్మెల్యే, ఆయన కుమారుల వ్యవహార శైలిపై చర్చించుకుంటూ ఉన్నారు. -
నీళ్లు... మీ నాయకులు తాగితే చాలా?
అనంతపురం, కంబదూరు: మండలంలోని నూతిమడుగు గ్రామంలో బుధవారం నిర్వహించిన ‘గ్రామదర్శిని’ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరికి చుక్కెదురైంది. ‘గ్రామంలోని టీడీపీ నాయకులందరూ అక్రమంగా కొళాయిలు వేసుకుని దర్జాగా సంపులు తవ్వుకుని మోటర్లు వేసుకున్నారు. దీంతో రెండు నెలలుగా బీసీ కాలనీకి నీళ్లు అందడం లేదు. కేవలం టీడీపీ నాయకులు మాత్రమే నీళ్లు తాగితే చాలా... మాలాంటివాళ్లు ఏం తాగి బతకాలి’ అంటూ ఆ గ్రామంలోని బీసీకాలనీ మహిళలు ఎమ్మెల్యేను కడిగిపారేశారు. ఆయన ‘గ్రామదర్శిని’కి వచ్చినట్లు తెలుసుకున్న వారు ఖాళీ బిందెలు తీసుకుని రోడ్డుపైకి వచ్చారు. కార్యక్రమం ముగిశాక ఖాళీ బిందెలు చేతబట్టి ఆయన వాహనానికి అడ్డంగా నిల్చున్నారు. ఎన్నికల్లో గెలిస్తే అవి చేస్తాం.. ఇవి చేస్తామని గొప్పలు చెబుతారని, గెలిచిన తర్వాత గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడరని, కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వకపోతే తాము ఎలా బతకాలని నిలదీశారు. ఐదేళ్లుగా తాగునీటి ట్యాంకును శుభ్రం చేయలేదని, ఎల్ఈడీ బల్పులు టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద మాత్రమే వేసుకున్నారని, అర్హులకు ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయడం లేదని వైఎస్సార్సీపీ నాయకులు అక్కులన్న, వైఎస్ రామేష్, వెంకటేశులు, శీనప్ప, నరసింహులు తదితరులు మండిపడ్డారు. సమస్యలను పరిష్కారిస్తానని చెప్పి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. -
టీచర్లకు ఎంత చేసినా టీడీపీకి ఓట్లేయరు
శెట్టూరు: ‘‘టీడీపీ హయాంలో చంద్రబాబు ఉపాధ్యాయులకు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో టీచర్ పోస్టులు మా ప్రభుత్వంలోనే వచ్చాయి. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా టీచర్లు మాత్రం టీడీపీకి ఓట్లెయ్యరు.’’ అని టీడీపీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అసహనం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా శెట్టూరు మండల పరిధిలోని యాటకల్లులో మంగళవారం ఎంఈఓ శ్రీధర్ అధ్యక్షతన ఆదర్శ పాఠశాల హెచ్ఎం శెట్టి నరసింహులు పదవీ విరమణ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా నాయకుడు రఘురామిరెడ్డి, మరో నాయకుడు నరసింహులు ప్రభుత్వం విద్యను హేతుబద్ధీకరణ పేరుతో పేద ప్రజలకు దూరం చేస్తోందన్నారు. దీనిని ఖండిస్తూ ఎమ్మెల్యే ఉన్నం టీచర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యను పేదలకు దూరం చేస్తోందంటున్నారు కదా.. ఎంత మంది అయ్యవార్లు తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారని ప్రశ్నించారు? ఏదైనా సమస్యలు వస్తే యూనియన్లంటూ ముందుకు వస్తారన్నారు. టీడీపీ హయాంలో సీఎం చంద్రబాబు ఎన్నో లబ్ధి చేకూర్చే పథకాలను తీసుకొచ్చారని.. అయినా టీడీపీకి మాత్రం అయ్యవార్లు ఓట్లెయ్యరన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు మాని ఒక పద్ధతిగా పోరాడండంటూ తన ప్రసంగాన్ని ఆవేశంతో సాగించారు. అంతలోనే మరో ఉపాధ్యాయ సంఘం నాయకుడు వెంకటస్వామి జోక్యం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేల పిల్లలు ఒకే పాఠశాలలో చదివితే ఇలాంటి అంతరాలు ఉండవన్నారు. -
వన్యప్రాణి వేటగాళ్లకు ఎమ్మెల్యే అండ?
కళ్యాణదుర్గం : వన్యప్రాణిని వేటగాళ్లకు స్థానిక ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అండదండలున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. గత శనివారం శెట్టూరు మండల పరిధిలోని మాలేపల్లి అటవీ ప్రాంతంలో జింకను వేటాడుతూ 14 మంది ఆ మండల ఎస్ఐ వెంకటరమణకు పట్టుబడ్డారు. ఆ సమయంలో నిందితుల నుంచి రెండు తపంచాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో పట్టుబడ్డ వారిలో కళ్యాణదుర్గం కొత్తూరుకు చెందిన తొమ్మిది మంది టీడీపీ సానుభూతిపరులు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే పోలీస్ స్టేషన్‌ను చేరుకుని టీడీపీ మద్దతుదారులను కేసు నుంచి తప్పించాలని ఎస్ఐతో చర్చించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొంచిన ఎస్ఐ ఐదుగురిపై మాత్రమే కేసు నమోదు చేశారు. వీరిలో ముగ్గురు కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. కాగా, జింక కలేబరానికి పశు వైద్యాధికారితో పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉండగా శెట్టూరు పశువైద్యశాల అటెండర్ రాధమ్మ సమక్షంలో తంతు ముగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసును పక్కదారి పట్టించడంలో రూ. లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఘటనకు సంబంధించి పోలీసులకు పట్టుబడ్డ ఐదుగురిపైనే కేసు నమోదు చేసినట్లు అటవీశాఖ అధికారి రాఘవయ్య పేర్కొన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశామని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఎస్ఐ వెంకటరమణ తేల్చి చెప్పారు.