AP: Conflict Between Kalyandurg TDP Leaders Anantapur District - Sakshi
Sakshi News home page

టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. మంగళగిరికి చేరిన పంచాయితీ 

Published Tue, Dec 21 2021 9:21 AM | Last Updated on Tue, Dec 21 2021 10:04 AM

Conflict Between Kalyandurg TDP Leaders Anantapur District - Sakshi

సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గం టీడీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. ఆధిపత్య పోరులో ఓ వర్గం నేతలు.. మరో వర్గం నాయకుడిపై దాడికి తెగబడిన ఘటన సంచలనం రేకెత్తించింది. బాధితుడు తెలిపిన మేరకు.. ఆదివారం రాత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గానికి చెందిన ఆ పార్టీ మాజీ కౌన్సిలర్‌ తిమ్మరాజుపై పార్టీ ఇన్‌చార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు అనుచరులు నాగరాజు, బ్రహ్మ, గోవిందు దాడి చేశారు. అడుకోబోయిన తిమ్మరాజు కుమార్తెపై కూడా దౌర్జన్యం చేశారు. ఘటనకు సంబంధించి ఆదివారం రాత్రే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తిమ్మరాజు తెలిపారు.  

అసలేం జరిగింది...  
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజలను పెడదోవ పట్టించేందుకు టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు కళ్యాణదుర్గంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమానికి    ఉన్నం, ఉమ వర్గీయులు వేర్వేరుగా ఆదివారం ఉదయం నుంచి జన సమీకరణలో నిమగ్నమయ్యారు. ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో చివరకు ఉమామహేశ్వరనాయుడు డబ్బులు పంచి కూలీలను రప్పించుకుంటున్నాడంటూ ఆదివారం సాయంత్రానికి వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ అయింది. ఉన్నం వర్గీయుడైన మాజీ కౌన్సిలర్‌ తిమ్మరాజునే ఈ పోస్టింగ్‌ పెట్టాడంతూ రాత్రి అతనిపై ఉమ వర్గీయులు దాడికి దిగారు. దీంతో తిమ్మరాజు చేతికి, ముఖానికి రక్తగాయాలయ్యాయి.  

చదవండి: (అనంతపురం టీడీపీలో భగ్గుమంటున్న వర్గ విభేదాలు)

నవ్విపోదురు గాక.. 
‘నవ్విపోదురు గాక మా కేటి సిగ్గు’ అన్న చందంగా మారింది కళ్యాణదుర్గం టీడీపీ నేతల తీరు. ప్రభుత్వ పథకాలను అభాసు పాలు చేసేందుకు ప్రయత్నించి.. వారే జనం దృష్టిలో నవ్వుల పాలయ్యారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సోమవారం ఉదయం కళ్యాణదుర్గంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అయితే ఉదయం టీడీపీ ఇన్‌చార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు తన వర్గం వారితో నిరసన వ్యక్తం చేసి వెళ్లిపోగానే.. అదే స్థలంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. ఒకే పార్టీలో వేరు కుంపట్లతో ఒకే ప్రదేశంలో నిరసనలు చేపట్టడపై జనం చలోక్తులు విసిరారు.  

మంగళగిరికి చేరిన మడకశిర టీడీపీ పంచాయితీ 
మడకశిర: నియోజకవర్గంలోని టీడీపీలో వర్గపోరు జోరందుకుంది. మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య  పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. దీంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఫలితంగా పలువురు ముఖ్యమైన నాయకులు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే మడకశిర మాజీ ఎంపీపీ బజ్జప్ప, అగళి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణయాదవ్‌ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. మరికొందరు కూడా టీడీపీని వీడేందుకు  సిద్ధమవుతున్నారు. మాజీలైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పార్టీలో వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారు. ఏడాదిగా పార్టీ కార్యక్రమాలను కూడా వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాల యాలను కూడా వేర్వేరుగా ఏర్పాటు చేసుకున్నారు. అంతే కాకుండా హైమాండ్‌కు వీరు పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మడకశిర టీడీపీ పంచాయితీ మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరింది. బుధవారం మంగళగిరిలోని  పార్టీ కార్యాలయానికి రావాల్సిందిగా అధినేత నుంచి వీరిద్దరికీ  పిలుపు వచ్చింది.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement