ఎన్టీఆర్ వర్ధంతిని ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఆయన కుమారులు తమ బలప్రదర్శనకు వేదికగా చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి తమ కుటుంబానికే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని, పార్టీ శ్రేణులంతా తమ వైపే ఉన్నారని చూపించుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ద్విచక్రవాహనదారులకు సొంత పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించడంతోపాటు వారి జేబులు సైతం నింపి అంతా మా ఇష్టం అన్న రీతిలో బైకు ర్యాలీతో హడావుడి చేశారు.
అనంతపురం, కళ్యాణదుర్గం: ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా శుక్రవారం కళ్యాణదుర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఆయన కుమారులు మారుతీ చౌదరి, ఉదయ్ చౌదరిల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందాన పట్టణవాసులను తీవ్ర ఇబ్బందులపాలు చేశాయి. వందలాది ద్విచక్రవాహనాలు ప్రధాన రహదారుల్లో చక్కర్లు కొట్టడం, అనంతపురం ప్రధాన రహదారుల్లో రాకపోకలు బంద్ చేయడం, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు విధించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ప్రజల సమస్యల పరిష్కారం కోరుతూ ర్యాలీ, ధర్నా లాంటి ఆందోళన కార్యక్రమాలు చేయాలంటే 30 పోలీసు యాక్టు అమల్లో ఉందని చెప్పి సవాలక్ష నిబంధనలు విధిస్తున్న పోలీసు అధికారులు టీడీపీ నాయకుల బలప్రదర్శనకు మాత్రం అడ్డు చెప్పలేదు. పైగా దగ్గరుండి సహకరించారు. స్వయానా రూరల్ ఎస్‌ఐ నబీరసూల్ ఆధ్వర్యంలో టీడీపీ బైక్ ర్యాలీకి, ఇతర హంగామా కార్యక్రమాలకు బందోబస్తు నిర్వహించారు. ఇదంతా ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల కనుసన్నల్లో జరుగుతోందనే ఆరోపణలున్నాయి.
ట్రాఫిక్ ఆంక్షలతో ఇబ్బందులు
టీడీపీ కార్యాలయం ముందు ప్రధాన రహదారిలో సభా వేదికను ఏర్పాటు చేయడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బైపాస్ రోడ్డులోని రింగురోడ్డు నుంచి వాహనాలు మరో మార్గం గుండా ఆర్టీసీ బస్టాండ్, రాయదుర్గం రహదారులకు వెళ్లేలా బందోబస్తు నిర్వహించారు. అలాగే అనంతపురం రహదారి వైపు వాహనాలు వెళ్లకుండా టీ సర్కిల్, అక్కమాంబ సర్కిల్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో పట్టణంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు ఈ ఆంక్షలను ఛీదరించుకుని ఛీవాట్లు పెట్టారు.
బైకు ర్యాలీకి డుమ్మా కొట్టినఅసమ్మతి వర్గీయులు
అసమ్మతి నాయకులుగా ముద్రపడిన మార్కెట్‌యార్డు చైర్మన్ దొడగట్ట నారాయణ, మాజీ ఎంపీపీలు మల్లికార్జున, లక్ష్మినారాయణ చౌదరి, కంబదూరు జెడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్‌చౌదరి, కళ్యాణదుర్గం ఎంపీపీ మంజుల భర్త కొల్లప్ప, పట్టణ కన్వీనర్ డిష్ మురళి బైకు ర్యాలీ వైపు కన్నెత్తి చూడలేదు. ర్యాలీ సమయంలో ఎన్టీఆర్ వర్థంతి వేడుక సభ వద్దే కూర్చుని ఎమ్మెల్యే, ఆయన కుమారుల వ్యవహార శైలిపై చర్చించుకుంటూ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment