ఖాళీ బిందెలతో రోడ్డుకడ్డంగా నిల్చుని ఎమ్మెల్యే ఉన్నంను నిలదీస్తున్న మహిళలు
అనంతపురం, కంబదూరు: మండలంలోని నూతిమడుగు గ్రామంలో బుధవారం నిర్వహించిన ‘గ్రామదర్శిని’ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరికి చుక్కెదురైంది. ‘గ్రామంలోని టీడీపీ నాయకులందరూ అక్రమంగా కొళాయిలు వేసుకుని దర్జాగా సంపులు తవ్వుకుని మోటర్లు వేసుకున్నారు. దీంతో రెండు నెలలుగా బీసీ కాలనీకి నీళ్లు అందడం లేదు. కేవలం టీడీపీ నాయకులు మాత్రమే నీళ్లు తాగితే చాలా... మాలాంటివాళ్లు ఏం తాగి బతకాలి’ అంటూ ఆ గ్రామంలోని బీసీకాలనీ మహిళలు ఎమ్మెల్యేను కడిగిపారేశారు. ఆయన ‘గ్రామదర్శిని’కి వచ్చినట్లు తెలుసుకున్న వారు ఖాళీ బిందెలు తీసుకుని రోడ్డుపైకి వచ్చారు. కార్యక్రమం ముగిశాక ఖాళీ బిందెలు చేతబట్టి ఆయన వాహనానికి అడ్డంగా నిల్చున్నారు. ఎన్నికల్లో గెలిస్తే అవి చేస్తాం.. ఇవి చేస్తామని గొప్పలు చెబుతారని, గెలిచిన తర్వాత గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడరని, కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వకపోతే తాము ఎలా బతకాలని నిలదీశారు. ఐదేళ్లుగా తాగునీటి ట్యాంకును శుభ్రం చేయలేదని, ఎల్‌ఈడీ బల్పులు టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద మాత్రమే వేసుకున్నారని, అర్హులకు ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయడం లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు అక్కులన్న, వైఎస్ రామేష్, వెంకటేశులు, శీనప్ప, నరసింహులు తదితరులు మండిపడ్డారు. సమస్యలను పరిష్కారిస్తానని చెప్పి ఎమ్మెల్యే వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment